మన తెలంగాణ/ క్రీడా విభాగం: ఐపిఎల్ సీజన్ 2025లో పంజాబ్ కింగ్స్ అసాధారణ ఆటతో ప్లేఆఫ్‌కు చేరుకుంది. ఏమాత్రం అంచనాలు లేకుండా బరిలోకి దిగిన పంజాబ్ అద్భుత ప్రదర్శనతో నాకౌట్‌కు దూసుకెళ్లింది. ఈ సీజన్‌లో ఇప్పటి వరకు 12 మ్యాచ్‌లు ఆడిన పంజాబ్ 8 విజయాలు సాధించి సత్తా చాటింది. ఒక మ్యాచ్ వర్షం వల్ల రద్దయ్యింది. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ జట్టును ముందుండి నడిపిస్తున్నాడు. బ్యాట్‌తో కూడా రాణిస్తూ జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషిస్తున్నాడు. సీజన్ ఆరంభానికి ముందు పంజాబ్‌పై ఎవరికీ పెద్దగా అంచనాలు లేవు. ప్లేఆఫ్ బెర్త్ సంగతి అటుంచి కనీసం టాప్6లో నిలిచినా గొప్పే అంటూ విశ్లేషకులు సయితం అభిప్రాయపడ్డారు. కానీ ఈ సీజన్‌లో పంజాబ్ అసాధారణ రీతిలో రాణించింది. సమష్టిగా రాణిస్తూ ప్లేఆఫ్‌కు చేరుకుంది. జట్టు విజయాల్లో ఓపెనర్లు ప్రియాంశ్ ఆర్య, ప్రభ్‌సిమ్రన్ సింగ్ కీలక పాత్ర పోషిస్తున్నారు. ప్రియాంశ్ ఇప్పటికే సెంచరీతో ఆకట్టుకున్నాడు. ప్రభ్‌సిమ్రన్ కూడా నిలకడైనబ్యాటింగ్‌తో జట్టుకు అండగా నిలిచాడు.
ఇద్దరు చాలా మ్యాచుల్లో జట్టుకు శుభారంభం అందించారు. నెహాల్ వధెరా, శశాంక్ సింగ్ తదితరులు కూడా తమవంతు సహకారం అందించారు. వీరు కూడా నిలకడగా బ్యాటింగ్ చేస్తూ తమవంతు పాత్ర పోషించారు. అయితే జట్టు ఈ స్థాయిలో ఉందంటే మాత్రం దానికి ప్రధాన కారణం శ్రేయస్ అయ్యర్ అద్భుత కెప్టెన్సీనే అనడంలో ఎలాంటి సందేహం లేదు. జట్టుపై శ్రేయస్ ముద్ర స్పష్టంగా కనిపిస్తోంది. సందర్భోచితంగా నిర్ణయాలు తీసుకుంటూ జట్టును ముందుకు తీసుకెళుతున్నాడు. సహచరుల్లో కొత్త జోష్‌ను నింపుతూ వారు మెరుగైన ఆట కనబరిచేలా చూస్తున్నాడు. దాదాపు ప్రతి మ్యాచ్‌లోనూ శ్రేయస్ బ్యాట్‌తోనూ సత్తా చాటాడు. కెప్టెన్సీతో పాటు బ్యాటింగ్‌లోనూ అతను రాణిస్తున్నాడు. ఇది పంజాబ్‌కు కలిసి వచ్చే అంశంగా మారింది. ప్రభ్‌సిమ్రన్ కూడా అద్భుత బ్యాటింగ్‌తో ఆకట్టుకుంటున్నాడు.
ప్రియాంశ్ ఆర్యతో కలిసి పలు మ్యాచుల్లో జట్టుకు శుభారంభం అందించాడు. మిగిలిన మ్యాచుల్లోనూ సత్తా చాటేందుకు ఈ జోడీ సిద్ధంగా ఉంది. బౌలింగ్‌లో కూడా పంజాబ్ బలమైన శక్తిగా మారింది. హర్‌ప్రీత్ బ్రార్, యుజువేంద్ర చాహల్, అర్ష్‌దీప్ సింగ్, మార్కొ జాన్‌సెన్, అజ్మతుల్లా ఒమర్‌జాయ్ వంటి మ్యాచ్ విన్నర్ బౌలర్లు జట్టులో ఉన్నారు. చాహల్, అర్ష్‌దీప్‌లు దాదాపు ప్రతి మ్యాచ్‌లోనూ మెరుగైన బౌలింగ్‌ను కనబరిచారు. రెండు విభాగాల్లోనూ బలంగా ఉన్న పంజాబ్ 17 పాయింట్లతో నాకౌట్‌కు చేరుకుంది. మరో రెండు మ్యాచ్‌లు ఆడాల్సిన ఉన్న పంజాబ్ పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి చేరుకోవాలని భావిస్తోంది. ఇప్పటికే నాకౌట్‌కు చేరిన పంజాబ్ ఇక దృష్టంతా ట్రోఫీపైనే నిలిపింది. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్‌పై భారీ అంచనాలు ఉన్నాయి. కిందటి సీజన్‌లో కోల్‌కతాకు ట్రోఫీని సాధించి పెట్టిన అయ్యర్ ఈసారి పంజాబ్ కలను నెరవేర్చాలనే లక్షంతో ఉన్నాడు. అన్ని అనుకున్నట్టు సాగితే ఈసారి పంజాబ్ ఐపిఎల్ ట్రోఫీని గెలుచుకున్నా ఆశ్చర్యం లేదు.