Sunday, October 6, 2024

బిఆర్‌ఎస్ చిల్లర చేష్టలు

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్ : మెడలో నూలు దండ వేస్తే బిఆర్‌ఎస్ నాయకులు చిల్లర కామెంట్లు చేస్తారా, సోషల్ మీడియాలో బిఆర్‌ఎస్ నాయకులు చేస్తున్న కామెంట్లతో నిన్నటి నుంచి ఆవేదనతో ఉ న్నానని, అన్నం కూడా తినలేదని మీడియా ఎదుట మంత్రి కొండా సురేఖ కంటతడి పెట్టారు. గాంధీభవన్‌లో ఆమె సోమవారం మీడియాతో మాట్లాడుతూ మహిళనని చూడకుండా పశువుల కంటే హీనంగా బిఆర్‌ఎస్ నేతలు సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. బిజెపి ఎంపి
రఘునందన్ రావు చేనేత నూలు దండ నా మెడలో వేస్తే చేనేత వృత్తుల వారికి సంబంధించిన గౌరవప్రదమైన నూలు అని దానిని పరీక్షగా చూశానని, దానిపై బిఆర్‌ఎస్ నాయకులు ట్రోల్ చేయడం తగదని ఆమె అన్నారు.

ట్రోలింగ్ వీడియోలను మీ చెల్లికి, తల్లికి చూపించు
కెటిఆర్ నీకు ఓ చెల్లి ఉంది కదా ఆమె జైలుకు వెళ్లినప్పుడు మేం ఇలాగే ట్రోల్ చేశామా అని బిఆర్‌ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్‌పై మంత్రి కొండా సురేఖ ఫైర్ అయ్యారు. కెటిఆర్ ఖబడ్దార్, కెసిఆర్ ఖబడ్దార్ ఈ ట్రోలింగ్ వీడియోలను మీ చెల్లికి, తల్లికి చూపించు ఇకపై ట్రోలింగ్ చేస్తే ఊరుకునేది లేదని మంత్రి హెచ్చరించారు. ఏదో ఒకరోజు ప్రజలు తిరగబడుతారని ఆమె అన్నారు. మహిళలంటే కెటిఆర్‌కు చులకని అని, బిఆర్‌ఎస్ పార్టీలో ఉన్నప్పుడు తనను ఇలాగే అగౌరపరిస్తే ఆ పార్టీ నుంచి బయటకు వచ్చానని ఆమె తెలిపారు. చేనేత కార్మికుల ఓట్లతో గెలిచిన పద్మశాలి బిడ్డను ఇంత అవమానపరుస్తారా? అని మంత్రి బిఆర్‌ఎస్ నాయకులను ప్రశ్నించారు. మానసిక వేదన కలిగించి కుటుంబాల్లో ఇబ్బంది పెడుతారా? అని మంత్రి అన్నారు. తనకు మంత్రి పదవి ఇవ్వాల్సి వస్తుందని కెసిఆర్ మహిళలకు మంత్రిపదవి ఇవ్వలేదని, రెండోసారి అధికారంలోకి వచ్చాక బిఆర్‌ఎస్‌లో భారీ మార్పులు వచ్చాయని, బిఆర్‌ఎస్ నాయకులు డబ్బు, మదంతో పిచ్చిగా ప్రవర్తిస్తున్నారన్నారు.’

బిఆర్‌ఎస్‌కు నా శాపం తగులుతుంది
కెటిఆర్ ఖబడ్దార్ ఇకపై సోషల్ మీడియాలో పోస్టులు పెడితే ఊరుకునేది లేదని మంత్రి కొండా సురేఖ వార్నింగ్ ఇచ్చారు. సోషల్ మీడియాలో ట్రోలింగ్‌పై సైబర్ క్రైం అధికారులకు ఫిర్యాదు చేశామని ఆమె పేర్కొన్నారు. సోషల్ మీడియాలో పోస్టులు పెట్టి బిఆర్‌ఎస్ నాయకులు నేతన్నలను అవమానించారన్నారు. తెలంగాణ భవన్ ఎదుట పద్మశాలి సోదరులు నిరసన తెలిపితే బిఆర్‌ఎస్ గుండాలు దాడి చేశారని మంత్రి మండిపడ్డారు. బిఆర్‌ఎస్ ఇకనైనా చిల్లర రాజకీయాలు మానుకోవాలని మంత్రి కొండా హెచ్చరించారు. కెటిఆర్ క్షమాపణ చెప్పకపోతే బట్టలిప్పించి ఉరికిస్తామని ఆమె వార్నింగ్ ఇచ్చారు. అనుచిత కామెంట్లు పెట్టి తనను ఆవేదనకు గురిచేసిన బిఆర్‌ఎస్‌కు నా శాపం తప్పకుండా తగులుతుందన్నారు. అధికారం కోల్పోయిన బాధలో బిఆర్‌ఎస్ నేతలు ఏం చేస్తున్నారో వారికే తెలియడం లేదని మంత్రి విమర్శించారు. డబ్బులు ఇచ్చి మరీ ట్రోల్స్ చేస్తున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.

ఒక మహిళను నేరుగా టార్గెట్ చేసి
రాష్ట్ర మహిళలకు ఆర్టీసి బస్సుల్లో ఉచిత ప్రయాణం కల్పిస్తే బస్సుల్లో డిస్కో డ్యాన్సులు చేస్తున్నారని కూడా బిఆర్‌ఎస్ నాయకులు అవమానించారని మంత్రి గుర్తుచేశారు. చేనేత కార్మికులకు కెటిఆర్, బిఆర్‌ఎస్ చేసిందేమిటని మంత్రి ప్రశ్నించారు. ప్రభుత్వ విధానాల పరంగా ఎన్ని విమర్శలు చేసినా తట్టుకుంటాం, కానీ, ఒక మహిళను నేరుగా టార్గెట్ చేసి వ్యక్తిగతంగా అవమానించడం సరికాదని మంత్రి హితవు పలికారు. ఇటీవల సిద్దిపేట జిల్లాలో జరిగిన ఓ కార్యక్రమంలో స్థానిక ఎంపి రఘునందన్ రావుతో కలిసి కొండా సురేఖ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రికి స్వాగతం పలుకుతూ రఘునందన్ రావు ఆమె మెడలో నూలుదండ వేశారు. దీనిపై సోషల్ మీడియా వేదికగా బిఆఎస్ నేతలు ట్రోల్స్ చేశారు. తాజాగా ఈ ట్రోలింగ్‌పై కొండా సురేఖ సోమవారం స్పందించారు. ఈ సమావేశంలో కాంగ్రెస్ మీడియా కమిటీ చైర్మన్ సామ రాంమ్మోహన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

బిఆర్‌ఎస్ సోషల్ మీడియా దిగజారుతోంది: పిసిసి అధ్యక్షుడు
మంత్రి కొండా సురేఖపై ట్రోలింగ్‌పై పిసిసి చీఫ్ మహేశ్‌కుమార్ గౌడ్ సీరియస్ అయ్యారు. బిఆర్‌ఎస్ సోషల్ మీడియా దిగజారుతోందన్నారు. బిఆర్‌ఎస్ నాయకులు మనుషుల మాదిరిగా వ్యవహారించడం లేదన్నారు. మహిళా మంత్రులపై అంత ట్రోలింగ్ చేస్తుంటే కెటిఆర్, హరీష్‌రావుల హెచ్చరించరా? అని ప్రశ్నించారు. ఈ ట్రోలింగ్‌తో రాష్ట్రంలో ఉన్న పద్మశాలి గుండెలు బాధపడుతున్నాయన్నారు. ఉద్యమాలు చేసి మంత్రిగా ఎదిగిన ఒక పద్మశాలి బిడ్డను ఇంత అవమానుపరిస్తారా? అని ఆయన బిఆర్‌ఎస్ నాయకులను పిసిసి అధ్యక్షుడు ప్రశ్నించారు. ఎస్సీ, ఎస్టీ, బిసిలం కన్నెర్ర చేస్తే బిఆర్‌ఎస్ ఉంటుందా? అని ఆయన ప్రశ్నించారు.

కెటిఆర్ స్థానంలో తాను ఉంటే ఇప్పటికే మంత్రికి క్షమాపణ చెప్పేవాడిని పిసిసి అధ్యక్షుడు అన్నారు. రాజకీయంగా విమర్శ చేయాలి, కానీ, ఒక బిసి బిడ్డను ఇంత అవమానపరుస్తారా అని పిసిసి అధ్యక్షుడు ప్రశ్నించారు. కవిత లిక్కర్ స్కాం లో అరెస్ట్ అయితే కేసు గురించి మాత్రమే మాట్లాడామని ఆయన తెలిపారు. మహిళా నాయకులపై బిఆర్‌ఎస్ నాయకులు చేస్తున్న ట్రోలింగ్‌పై కెటిఆర్, హరీష్ స్పందించాలని ఆయన డిమాండ్ చేశారు. బిఆర్‌ఎస్ నాయకులు మహిళలకు ఇస్తున్న గౌరవం ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చని, మహిళకు మంత్రి పదవి ఇవ్వని బిఆర్‌ఎస్ పార్టీ మహిళలకు ఏం గౌరవం ఇస్తుందో అందరికీ అర్ధమవుతుందన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News