లండన్: విమాన ప్రయాణం జరుగుతున్న సమయంలో పైలట్‌లు (Pilot) అత్యంత అప్రమత్తంగా ఉండాలి. పైలట్లు ఏ మాత్రం ఏమరపాటుగా ఉన్న అది తీవ్ర ప్రమాదానికి దారి తీస్తుంది. కానీ, ఓ పైలట్ నిబంధనలు మరిచి అత్యుత్సాహం ప్రదర్శించాడు. దీంతో అతని ఉద్యోగానికి ముప్పు వచ్చింది. అసలేం జరిగిందంటే.. బ్రిటీష్ ఎయిర్‌వేస్‌కు చెందిన ఓ విమానం లడన్ హీత్రూ నుంచి న్యూయార్క్‌కి బయలుదేరింది. ఆ విమానంలో పైలట్ కుటుంబసభ్యులు, బంధువులు ప్రయాణిస్తున్నారు.
ఈ నేపథ్యంలో పైలట్ (Pilot) నిర్లక్ష్యంగా వ్యవహరించాడు. కుటుంబ సభ్యులు తాను విమానం ఎలా ఆపరేట్ చేస్తున్నాడో తెలుసుకునేందుకు కాక్‌పిట్ డోర్ చాలాసేపు తెరిచి ఉంచాడు. ఇది చూసిన ప్రయాణికులు, సిబ్బంది తొలుత ఆశ్చర్యపోయినా.. ఆ తర్వాత తీవ్ర ఆందోళనకు గురయ్యారు. ఆమెరికాలో విమానం ల్యాండ్ అవగానే ఈ విషయాన్ని అధికారుల దృష్టికి తీసుకువెళ్లారు.
ఈ విషయాన్ని తీవ్రంగా పరిగణించిన అధికారులు ఉగ్రవాద నిరోధక నిబంధనలు ఉల్లంఘించినందుకు సదరు పైలట్‌ని ఉద్యోగం నుంచి సస్పెండ్ చేశారు. న్యూయార్క్ నుంచి తిరిగి లండన్‌కి రావాల్సిన విమానాన్ని రద్దు చేసి.. ప్రయాణికులకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేశారు. ఈ భ్రదత ఉల్లంఘనకు సంబంధించి సివిల్ ఏవియేషన్ అథారిటీ కూడా అత్యవసర దర్యాప్తు చేపట్టినట్లు సమాచారం.