ఉగ్రవాదం ..సుంకాల అతివాదం చెల్లనేరదు
పహల్గామ్ ఘటన అత్యంత అమానుషం
బ్రిక్స్ సంయుక్త తీర్మానంలో కీలక అంశాలు
భద్రతా మండలిలో గ్లోబల్ సౌత్‌కు స్థానం
రియో డి జనీరో: పహల్గామ్ ఉగ్రదాడులను ఖండిస్తూ బ్రిక్స్ సదస్సు సంయుక్త తీర్మానం వెలువరించింది. కశ్మీర్‌లోని పహల్గామ్‌లో జరిగిన దాడి అత్యంత అమానుషం అనే ప్రధాని నరేంద్ర మోడీ స్పందనతో ఏకీభవిస్తూ బ్రిక్స్ దేశాల రెండు రోజుల సమావేశంలో ఈ తీర్మానం వెలువరించారు. ఉగ్రవాదం నిర్మూలన విషయంలో ఏ అంతర్జాతీయ సంస్థ అయినా , ప్రామాణిక రీతిలో వ్యవహరించాలి. ఈ విషయంలో ద్వంద్వ ప్రమాణాలు, డొంక తిరుగుళ్లు పనికిరావని పిలుపు నిచ్చారు. ఉగ్రవాదం ఏ రూపంలో ఉన్నా, దీనికి ఏ దేశం ఏ రీతిలో సహకరించినా, అణువంత కూడా సహించరాదని తెలిపారు. బ్రిక్స్ వేదికగా భారతదేశం ఉగ్రవాద నిర్మూలనకు చేసిన ప్రతిపాదన సమర్థనీయం అని పేర్కొన్నారు. సీమాంతర ఉగ్రవాదం ఆటకట్టుకు, ఉగ్ర నిధుల చేరవేతకు కళ్లెం వేయాల్సి ఉందని సూచించారు.
సముద్ర తీరపు నగరం రియో డి జనీరోలో బ్రిక్స్ దేశాల అగ్రనేతల సదస్సు జరిగింది. తరువాత మొదటిరోజు చర్చల అనంతరమే సమగ్ర తీర్మానం వెలువడింది. పలు అంతర్జాతీయ విషయాలను కూడా ఇందులో ప్రస్తావించారు. అమెరికా ఇటీవలి కాలంలో ఏకపక్షంగా టారీఫ్‌లు పెంచుతూ పోవడం వల్ల ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో గందరగోళ పరిస్థితులు నెలకొంటున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. పరోక్షంగా ట్రంప్ నిర్ణయాలను తప్పుపట్టారు. ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక అయిన సుంకాల విషయంలో ఇష్టారాజ్యం పరిస్థితిని దిగజారుస్తుందని తెలిపారు. ఇక ప్రపంచ స్థాయిలో తలెత్తుతున్న పలు సవాళ్ల నడుమ మరింత కలిసికట్టుగా వ్యవహరించాల్సి ఉందని అభిప్రాయపడ్డారు. ఉగ్రవాదం, పశ్చిమాసియాలో ఘర్షణలు ప్రత్యేకించి ఐరాస భద్రతా మండలిలో తీవ్రస్థాయి సంస్కరణల అవసరం గురించి తీర్మానంలో ప్రస్తావించారు. మండలి, బ్రెట్టన్‌వుడ్స్ సంస్థలలో కీలక మార్పులు అవసరం అని స్పష్టం చేశారు.