Monday, April 29, 2024

హౌతీల అంతు చూడగలరా?

- Advertisement -
- Advertisement -

అంతర్జాతీయ సరఫరాలపై ఆధారపడి ప్రపంచం మనుగడ సాగిస్తున్నప్పుడు ఏ మూల ఏ సంక్షోభం తలెత్తినా లోక శోకం పెరిగి జనజీవితం మరింత దుర్భరమవుతుంది. ఎర్ర సముద్రంలో వాణిజ్య నౌకలపై హౌతీల దాడుల నేపథ్యంలో యెమెన్‌లోని వారి మూలాలపై అమెరికా, బ్రిటన్ యుద్ధ విమానాలు సంయుక్తంగా విరుచుకుపడడం వల్ల ఆయిల్ ధరలు 4% ఎగబాకాయి. బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ధర బ్యారెల్ 80 డాలర్లు దాటిపోయింది. అమెరికా, బ్రిటన్ సంయుక్త దాడుల్లో తమ వారు అయిదుగురు మరణించారని యెమెన్ రాజధాని సనాలో హౌతీలు ప్రకటించారు. తమ దళాలు ఇందుకు తగిన ప్రతీకారం తీసుకొంటాయని హెచ్చరించారు. అందుచేత ఎర్ర సముద్రం మరింత ఎర్రబారడం అనివార్యం. ఎర్ర సముద్రంలో ఇజ్రాయెల్‌కు వెళ్లే దారిలో మాటువేసి నౌకలపై డ్రోన్లతో, రాకెట్లతో హౌతీలు దాడులు చేస్తున్నారు. ఇజ్రాయెల్‌పై గత అక్టోబర్ 7న హమాస్ విరుచుకుపడిన తర్వాత నౌకలపై హౌతీల దాడులు ముమ్మరమయ్యాయి. హమాస్‌కు మద్దతుగా తాము దాడులకు తలపడుతున్నట్టు వారు ప్రకటించారు. అయితే హౌతీలు లక్ష్యంగా చేసుకొంటున్న నౌకలన్నీ ఇజ్రాయెల్‌వి కావు.

ప్రపంచ నౌకా రవాణాలో 15% ఎర్ర సముద్రం గుండానే సాగుతుంది. గత నవంబర్, డిసెంబర్ మాసాల్లో హౌతీల దాడులు 500% పెరిగాయంటే నౌకా వాణిజ్యానికి ఎంతటి అంతరాయం కలుగుతున్నదో ఊహించవచ్చు. ఎర్ర సముద్రం రవాణా మార్గం ఆసియా -యూరోప్‌ల మధ్య దగ్గరి దారి. సూయజ్ కాలువ ద్వారా మధ్యధరా సముద్రాన్ని కలుపుతుంది. హౌతీల దాడులు ముమ్మరమైన తర్వాత పెద్ద పెద్ద షిప్పింగ్ కంపెనీలు ఈ మార్గంలో నౌకలను నడపడం మానుకొన్నాయి. వాటిని ఇతర మార్గాలకు మళ్ళించాయి. హౌతీల భయం వల్ల ఎర్ర సముద్రం ద్వారా రవాణా జరిపే ఓడల్లో బీమా చార్జీలు పెంచేశారు. ఈ భారాలన్నీ వినియోగదార్ల నడ్డి విరుస్తాయి. యెమెన్ మీద పట్టు ప్రాబల్యం సంపాదించుకొన్న హౌతీలకు ఇరాన్ దన్ను విశేషంగా ఉంది. ఎర్ర సముద్రంలో వాణిజ్య నౌకలపై హౌతీ దాడులను ఒక పద్ధతి ప్రకారం జరిపిస్తున్నదని ఇరాన్‌ను అమెరికా తప్పుపట్టింది. యెమెన్‌లోని హౌతీల మూలాలపై అమెరికా, బ్రిటన్ల దాడుల్లో కెనడా, ఫ్రాన్స్, బహ్రెయిన్, నార్వే, స్పెయిన్ సేనలు పాల్గొంటున్నాయి. ఎర్ర సముద్రం గుండా వెళ్లే తమ నౌకలపై హౌతీల దాడులను ఇంకెంత మాత్రం సహించబోమని ఈ దేశాలు హెచ్చరించాయి.

యెమెన్‌లోని జైదిస్ అనే షియా ముస్లిం మైనారిటీకి చెందిన హౌతీల మూల పురుషుడు హుస్సేన్ అల్ హౌతీ1990 లో ఏర్పాటైన ఈ గ్రూపు అప్పటి యెమెన్ అధ్యక్షుడు అలీ అబ్దుల్లాహ్ సాలెహ్ అవినీతి మీద పోరాటం చేపట్టారు. వీరిని అంతమొందించడానికి అధ్యక్షుడు సౌదీ అరేబియా సైనిక సహకారంతో 2003లో విఫలమయ్యాడు. దానితో సౌదీ అరేబియాకు సైతం హౌతీలు కొరకరాని కొయ్యలయ్యారు. యెమెన్ ప్రభుత్వంపై హౌతీలు సుదీర్ఘ అంతర్యుద్ధం చేశారు. లెబానాన్‌లోని మరో షియా మిలిటెంట్ సంస్థ హెజ్బొల్లాతోనూ హౌతీలకు మంచి సంబంధాలున్నాయి. ఎర్ర సముద్ర తీరమంతా హౌతీల అదుపులో ఉండడం గమనించవలసిన అంశం. 2014- 2022 మధ్య యెమెన్ అంతర్యుద్ధంలో 37,7000 మంది మరణించారు. నలభై లక్షల మంది స్వస్థలాలు విడిచిపోయారు. హౌతీలకు లక్ష నుంచి లక్ష ఇరవై వేల మంది ఉన్నట్టు అంచనా. యెమెన్‌లోని కనీసం డజను లక్ష్యాలపై దాడులు జరిపినట్టు, హౌతీల ఆయుధాగారాలను, ఇతర ముఖ్యమైన పట్టుగొమ్మలను ధ్వంసం చేశామని ఆమెరికా ప్రకటించింది. గత ఏడాది ఇరాన్ సౌదీ అరేబియాల మధ్య చైనా కుదిర్చిన సఖ్యత హౌతీల విషయంలో ఎటువంటి సానుకూల పరిణామానికి దారి తీయలేదని బోధపడుతున్నది.

హౌతీలకు ఆయుధ సాయాన్ని మానుకొంటానని ఇరాన్ మాట ఇచ్చినట్టు చెప్పుకొన్నారు. అదేమీ ఆచరణలో రుజువు కాలేదు. హెజ్‌బొల్లా నుంచి హౌతీలకు ఆయుధ, శిక్షణ సాయం అందుతున్నది. ఇరాన్ మద్దతు గల సాయుధ శక్తులన్నింటి లక్ష్యం అమెరికా, ఇజ్రాయెల్‌లే. గాజాపై ఇజ్రాయెల్ అమానుష దాడులు అక్కడి మిలిటెంట్ శక్తులను రెచ్చగొడుతున్నాయి. పశ్చిమాసియా అగ్ని గుండాలను మండించే పాత్ర నుంచి, ముఖ్యంగా ఇజ్రాయెల్ దుర్మార్గాలన్నిటినీ సమర్ధించడం అమెరికా మానుకోనంత వరకూ అక్కడ శాంతి స్థాపన జరగదు. బలవంతులను అంతకుమించిన బలంతో అదుపు చేయడం, అందుకు అవసరమైన ఆయుధ ఉత్పత్తి పరిశ్రమను ప్రోత్సహించడం అమెరికా అంతర్జాతీయ విధానంగా కొనసాగినంత కాలం ప్రపంచానికి మంచి జరగదు. మానవాళికి మంచి మనుగడ దేశాల మధ్య ప్రజాస్వామిక సంబంధాలు నెలకొన్నప్పుడే సాధ్యం. సైన్యం అవసరం తొలగాలి. ఆయుధాలతో సహజీవనం నెత్తుటి కూడునే తినిపిస్తుంది. ఉక్రెయిన్‌కు ఆయుధ, ఆర్ధిక సహాయం అందించి పుతిన్ అంతు చూడడమే లక్ష్యంగా అమెరికా నడిపిస్తున్న యుద్ధం చాలదని పశ్చిమాసియాను మండుతున్న మందుపాతర చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News