Tuesday, May 14, 2024

రాజులు, మహారాజులను అవమానించిన ‘యువరాజు’

- Advertisement -
- Advertisement -

రాహుల్‌పై మోడీ ధ్వజం
నవాబులు, సుల్తాన్ల అరాచకాలపై మౌనంగా ఉన్నారు
బుజ్జగింపు రాజకీయాల కోసమే రాహుల్ ఆరాటమని మండిపాటు
కర్నాటకలో ఎన్నికల ప్రచారంలో ప్రధాని విమర్శలు

బెళగావి (కర్నాటక) : కాంగ్రెస్ ‘యువరాజు’ రాహుల్ గాంధీ భారత రాజులు, మహారాజులను అవమానించారని, కానీ బుజ్జగింపు రాజకీయాల కోసం నవాబులు, నిజామ్‌లు, సుల్తాన్లు, బాద్షాల అరాచకాలపై మౌనం పాటిస్తున్నారని ప్రధాని నరేంద్ర మోడీ ఆదివారం ఆరోపించారు. ‘వారసత్వం పన్ను’ గురించి కూడా కాంగ్రెస్‌పై తన విమర్శలను మోడీ కొనసాగించారు. శాంతి భద్రతల పరిస్థితిపై కర్నాటక ప్రభుత్వాన్ని ఆయన లక్షంగా చేసుకున్నారు. ప్రధాని మోడీ కర్నాటకలోని బెళగావిలో ఒక మెగా బహిరంగ సభలో ప్రసంగిస్తూ, ప్రజల ఆస్తులు పెంచేందుకు బిజెపి పని చేస్తున్నదని, కానీ కాంగ్రెస్ యువరాజు (రాహుల్ గాంధీ), ఆయన సోదరి (ప్రియాంక గాంధీ) తాము అధికారంలోకి వస్తే దేశాన్ని ‘ఎక్స్‌రే’ తీసుకుంటామని ప్రకటిస్తున్నారని చెప్పారు.

‘వారు మీ ఆస్తి, బ్యాంకు లాకర్లు, భూములు, వాహనాలు, ‘స్త్రీధన్’, మహిళల ఆభరణాలు, బంగారం, మంగళసూత్రం ఎక్స్‌రే తీసుకుంటారు. వారు ప్రతి ఇంటిపై దాడి చేసి మీ ఆస్తులు లాక్కుంటారు. లాక్కున్న తరువాత దానిని తిరిగి పంచడం గురించి వారు మాట్లాడుతున్నారు, తమ ప్రియతమ వోటు బ్యాంకుకు దానిని ఇవ్వాలని కోరుకుంటున్నారు’ అని మోడీ చెబుతూ, ఆ లూటీని మీరు అనుమతిస్తారా అని అడిగారు. ‘కాంగ్రెస్‌ను అలర్ట్ చేయాలని అనుకుంటున్నా. ఆ ఉద్దేశాన్ని మానుకోండి. మోడీ జీవించి ఉన్నంత వరకు దానిని అనుమతించేది లేదు’ అని మోడీ స్పష్టం చేశారు. ‘బుజ్జగింపులు, వోటు బ్యాంకుపై దృష్టితోనే కాంగ్రెస్ మన చరిత్ర, మన స్వాతంత్య్ర ఉద్యమం గురించి రచన సాగేలా చూసింది.

ఇప్పటికీ కాంగ్రెస్ ‘యువరాజు’ ఆ పాపాన్ని కొనసాగిస్తున్నారు. కాంగ్రెస్ యువరాజు ఇటీవలి ప్రకటనను మీరు వినే ఉండాలి. భారత రాజులు, మహారాజులు అణచివేతకు పాల్పడ్డారు. వారు (రాజులు, మహారాజులు) ప్రజల ఆస్తులు, భూములు కబళించారని ఆయన (రాహుల్) ఆరోపించారు. ఛత్రపతి శివాజీ మహారాజ్, కిట్టూర్ రాణి చిన్నమ్మ వంటి మహామహులలను కాంగ్రెస్ యువరాజు అవమానించారు. శివాజీ, చిన్నమ్మ పాలన, దేశభక్తి ఈనాటికీ మనకు స్ఫూర్తిదాయకంగా ఉంటున్నాయి’ అని ప్రధాని చెప్పారు. ఈనాటికీ దేశవ్యాప్తంగా మన్ననలు అందుకుంటున్న పూర్వపు మైసూరు రాజకుటుంబం సేవలను మోడీ గుర్తు చేస్తూ, ‘కాంగ్రెస్ యువరాజు ప్రకటనలు ఉద్దేశపూరితమైనవి, వోటు బ్యాంకు, బుజ్జగింపు రాజకీయాలే లక్షంగా ఉన్నవి’ అని ఆరోపించారు.

‘యువరాజుల రాజులు, మహారాజుల గురించి చెడుగా మాట్లాడుతుంటారు, కానీ భారత చరిత్రలో నవాబులు, నిజాములు, సుల్తాన్లు, బాద్షాలు సాగించిన ‘అణచివేతల’ గురించి యువరాజు నోరు మూతపడింది, ఆయన నోరు వారిపై మూతపడింది. కానీ, రాజులు, మహారాజులను ఆయన అవమానించారు’ అని మోడీ విమర్శించారు. మొఘల్ చక్రవర్తి ఔరంగజేబు అణచివేత చర్యలు రాహుల్ కు గుర్తు ఉండవని మోడీ ఆరోపిస్తూ, ‘అతను (ఔరంగజేబు) మన ఆలయాలు పెక్కింటిని అపవిత్రం చేశాడు, వాటిని ధ్వంసం చేశాడు. ఔరంగజేబును కొనియాడే పార్టీలతో కాంగ్రెస్ ఆనందంగా పొత్తులు పెట్టుకుంటోంది& మన మత ప్రదేశాలను ధ్వంసం చేసిన, గోవులను చంపిన వారిని అవి గుర్తు పెట్టుకోవు. భారత విభజనలో పాత్ర ఉన్న నవాబు కూడా వారికి గుర్తు రాడు’ అని ఆక్షేపించారు.

బెనారస్ హిందు విశ్వవిద్యాలయం ఏర్పాటులో బెనారస్ రాజు, ఆలయాల పునర్నిర్మాణంలో మహారాణి అహల్యాబాయి హోల్కర్ చేసిన కృషిని మోడీ గుర్తు చేశారు. ‘అంబేద్కర్ ప్రతిభను గుర్తించింది బరోడా మహారాజు& కాంగ్రెస్ యువరాజుకు రాజులు, మహారాజుల సేవలు గుర్తు ఉండవు. వోటు బ్యాంకు కోసం వారు ధైర్యంగా రాజులు, మహారాజులకు వ్యతిరేకంగా మాట్లాడగలరు కానీ నవాబులు, సుల్తాన్లు, బాద్షాలకు వ్యతిరేకంగా మాట్లాడే సాహసం చేయరు’ అని ఆయన అన్నారు. కాంగ్రెస్ ‘బుజ్జగింపు మనోభావనలు’ దేశం ముందు బహిర్గతం అయ్యాయి, అదే వారి మేనిఫెస్టోలో ప్రతిబింబిస్తోందని మోడీ ఆరోపించారు. కాంగ్రెస్ కర్నాటకలో అధికారంలోకి వచ్చినప్పటి నుంచి మొత్తం రాష్ట్రంలో శాంతి భద్రతల పరిస్థితి అధ్వానం అయిందని మోడీ ఆరోపించారు.

బెళగావిలో ఆదివాసీ మహిళపై అత్యాచారం, చిక్కోడిలో ఒక జైన మత గురువు హత్య గురించి ఆయన ఈ సందర్భంగా ప్రస్తావించారు. కర్నాటక పరువుకు భంగం కలిగించిన సిగ్గుచేటు ఘటనలు అవి అని ఆయన పేర్కొన్నారు. కాంగ్రెస్‘వారసత్వ పన్ను’ కోసం ‘ప్రమాదకర’ సూత్రంతో వచ్చిందని, ఆ పన్ను కింద ఆ పార్టీ అధికారంలోకి వస్తే తమ పిల్లల కోసం జనం ఆదా చేసే డబ్బు లేదా ఆస్తిపై పన్ను వేస్తుందని మోడీ ఆరోపించారు. వెటరన్ బిజెపి నేత, బెళగావిలోని పార్టీ అభ్యర్థి బిఎస్ యెడ్యూరప్ప, కర్నాటక మాజీ ముఖ్యమంత్రి జగదీస్ శెట్టార్, చిక్కోడి అభ్యర్థి అన్నాసాహెబ్ శంకర్ జోల్లె కూడా సభలో పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News