Wednesday, May 1, 2024

నేపాల్ ప్రతిష్టంభన

- Advertisement -
- Advertisement -

Political stalemate in Nepal

 

ప్రజలు పువ్వుల్లో పెట్టి అధికారం అప్పగించినా నాయకులు వ్యక్తిగత స్వార్థ అహంకారాలతో దానిని బూడిదలో పోసిన పన్నీరుగా చేస్తున్న ప్రత్యక్ష ఘట్టం మన పొరుగునున్న నేపాల్‌లో కళ్లకు కడుతున్నది. అధికార నేపాల్ కమ్యూనిస్టు పార్టీలో చీలిక, ప్రధాని ఖడ్గ ప్రసాద్ శర్మ ఓలిపై అవిశ్వాస తీర్మానం నెగ్గడంతో అక్కడ కొత్త ప్రభుత్వం ఏర్పాటు ఘట్టం తీవ్ర ప్రతిష్టంభనకు గురి అవుతున్నది. కొవిడ్ సెకండ్ వేవ్ ఉద్ధృతితో దేశం అపూర్వ సంక్షోభంలో కూరుకుపోయిన వేళ సుస్థిర ప్రభుత్వం కరువైన దుస్థితి నెలకొన్నది. 275 స్థానాలున్న నేపాల్ పార్లమెంట్ (ప్రతినిధుల సభ) కు 2017 డిసెంబర్‌లో ఎన్నికలు జరిగాయి. కెపి శర్మ ఓలికి చెందిన కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ నేపాల్ (సిపిఎన్) యుఎంఎల్ 121 స్థానాలను గెలుచుకుంది. పూర్వపు అజ్ఞాత మావోయిస్టుల నేత పుష్పకమల్ దహాల్‌కు చెందిన సిపిఎన్ (మావోయిస్టు సెంటర్) పార్టీకి 49 సీట్లు వచ్చాయి. నేపాల్ కాంగ్రెస్ 63 స్థానాలు గెలుపొంది ప్రధాన ప్రతిపక్షంగా అవతరించింది. భారతీయ నేపథ్యం గల మధేశీలకు చెందిన పీపుల్స్ పార్టీ, నేపాల్ (జనతా సమాజ్ వాదీ పార్టీ, నేపాల్) 34 స్థానాలు సాధించుకుంది.

ఇండిపెండెంట్లు నాలుగు చోట్ల విజేతలయ్యారు. రెండు కమ్యూనిస్టు పార్టీలు 2018 మే నెలలో కలిసిపోయి నేపాల్ కమ్యూనిస్టు పార్టీగా అవతరించాయి. శర్మ ఓలి, పుష్ప కమల్ దహాల్ చెరి సగం పదవీ కాలం పాటు ప్రధానిగా ఉండాలని అంగీకారం కుదుర్చుకున్నారు. ముందుగా ప్రధాని అయిన శర్మ ఓలి ఈ ఒప్పందాన్ని ఉల్లంఘంచి సగ కాలం ముగిసిపోయిన తర్వాత కూడా అధికారంలో కొనసాగడంతో ఉమ్మడి పార్టీలో అసమ్మతి మొదలై పరాకాష్ఠకు చేరింది. చీటికీమాటికీ పార్టీలో వ్యతిరేకతను తట్టుకోలేక, అవిశ్వాస తీర్మానాన్ని ఎదుర్కొనే బలం కొరవడి ప్రధాని ఓలి మంత్రి వర్గం పార్లమెంటు (ప్రతినిధుల సభ) రద్దుకు, ఏప్రిల్, మే నెలల్లో ఎన్నికల నిర్వహణకు గత డిసెంబర్‌లో సిఫారసు చేసింది. దేశాధ్యక్షురాలు విద్యాదేవి భండారి వెనువెంటనే దానిపై ఆమోద ముద్రవేశారు. పార్లమెంటు రద్దు నియమ విరుద్ధమంటూ సుప్రీంకోర్టు కొట్టివేయడం ఖాయమని అప్పుడే అనుకున్నారు. అదే విధంగా గత ఫిబ్రవరి 23న నేపాల్ సుప్రీంకోర్టు పార్లమెంటు రద్దు నిర్ణయాన్ని తోసిపుచ్చి దానిని పునరుద్ధరించింది.

ఉభయ కమ్యూనిస్టు పార్టీలు కలిసిపోయిన తర్వాత అధికార నేపాల్ కమ్యూనిస్టు పార్టీ బలం 173కి పెరిగింది. కాని రెండు వర్గాలు శత్రు శిబిరాలుగా చీలిపోయి పార్టీ పేరు కోసం కాట్లాడుకోగా ఉమ్మడి పార్టీ పేరును ఓ వర్గానికి కేటాయించేది లేదని ఎన్నికల సంఘం తీర్పు ఇచ్చింది. దానితో ఐక్యతకు పూర్వ పరిస్థితి తిరిగి ఏర్పడింది. కమల్ దహాల్ వర్గం తన 49 మంది బలంతో వేరైపోయింది. ప్రధాని సొంత పార్టీలో కూడా తిరుగుబాటు జెండా ఎగిరింది. మాధవ్ నేపాల్ వర్గం ఆయనకు ఎదురు తిరిగింది. దీనితో ప్రతినిధుల సభలో శర్మ ఓలి బలం 93కి పడిపోయింది. మొన్న సోమవారం నాడు అవిశ్వాస తీర్మానం నెగ్గడంతో ఈ విషయం స్పష్టమైంది. శర్మ ఓలి ఇప్పుడు ఆపద్ధర్మ ప్రధానిగా కొనసాగుతున్నాడు. ప్రత్యామ్నాయ ప్రభుత్వం ఏర్పడాలంటే ప్రధాన ప్రతిపక్షం నేపాలీ కాంగ్రెస్, కమల్ దహాల్‌కు చెందిన సిపిఎన్ (మావోయిస్టు సెంటర్), మాధవ్ నేపాల్ వర్గం, జనతా సమాజ్ వాదీ పార్టీలు ఏకమవ్వాలి. జనతా సమాజ్‌వాదీ పార్టీలోని మహంత్ ఠాకూర్ వర్గం ప్రధాని శర్మ ఓలి పార్టీకి, నేపాల్ కాంగ్రెస్‌కు సమాన దూరం పాటిస్తున్నది. ఈ వర్గం భారత్ చెప్పుచేతల్లో ఉందని భావిస్తున్నారు.

వాస్తవానికి శర్మ ఓలి భారత వ్యతిరేక ఉన్మాదాన్ని పెంచి పోషించాడు. భారత భూభాగాన్ని నేపాల్ పటంలో చూపించి పార్లమెంటు చేత ఆమోదింప చేశాడు.త అయితే అక్కడున్న వివిధ రాజకీయ పక్షాల్లో ఓలి వర్గమే ఇప్పటి పరిస్థితుల్లో మేలైనదని భారత్ భావిస్తున్నట్టు కనిపిస్తున్నది. ఇంకొక వైపు చైనా తన ప్రయోజనాల కోసం నేపాల్ రాజకీయాల్లో మితిమించి తలదూర్చుతున్న సంగతి తెలిసిందే. త్వరగా ప్రత్యామ్నాయ ప్రథభుత్వం ఏర్పాటై ప్రతిష్టంభన తొలగకపోతే ఏకైక అతి పెద్ద పార్టీ నేత అయిన శర్మ ఓలినే అధికారంలో కొనసాగవలసిందిగా అధ్యక్షురాలు కోరే అవకాశాలున్నాయి. ఆయన తన నిరంకుశ, మొండి మనస్తత్వంతో నేపాల్ ప్రజల తీర్పుకి తూట్లు పొడిచాడు. ప్రజాస్వామ్యంలో ప్రజల నుంచి ఓటు ఆదేశాన్ని ఏదో ఒక విధంగా సాధించుకున్న తర్వాత వారి అభీష్టానికి, ఆంతర్యానికి బొత్తిగా విలువ ఇవ్వకుండా ఇష్టావిలాసంగా పరిపాలన సాగించడమనేది ఏ జాతికైనా ఎంత ముప్పు తెస్తుందో నేపాల్ ఉదంతం చాటి చెబుతున్నది. అక్కడ అధిక సంఖ్యాక పార్లమెంటు సభ్యుల మద్దతుతో ప్రత్యామ్నాయ ప్రభుత్వం వీలైనంత త్వరలో ఏర్పడాలని కోరుకుందాం. ప్రజలు విసిగిపోయి మళ్లీ రాచరిక పాలన పట్ల మోజు పెంచుకోకూడదని ఆశిద్దాం.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News