Tuesday, May 21, 2024

91% పాస్

- Advertisement -
- Advertisement -

మనతెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలో పదవ తరగతి ఫలితాలలో బాలికలు పైచేయి సాధించారు. ఈ ఫలితాలలో మొత్తం ఉత్తీర్ణత 91.31 శాతం నమోదైంది. బాలికల ఉత్తీర్ణత 93.23 శాతం నమోదు కాగా, బాలుర ఉత్తీర్ణత 89.42 శాతంగా నమోదైంది. బాలికల ఉత్తీర్ణత, బాలుర కంటే 3.81 శాతం అధికంగా నమోదైంది. రాష్ట్ర విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి బుర్రా వెంకటేశం మంగళవారం ఎస్‌సిఇఆర్‌టి కార్యాలయంలో పదవ తరగతి ఫలితాలను విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల విద్యాశాఖ సంచాలకులు శ్రీదేవసేన, ఎస్‌ఎస్‌సి బోర్డు డైరెక్టర్ ఎ.కృష్ణారావు, ఇతర అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా బుర్రా వెంకటేశం మాట్లాడుతూ, పదవ తరగతిలో ఉత్తీర్ణులైన విద్యార్థులకు శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా 3,927 పాఠశాలల్లో 100 శాతం ఉత్తీర్ణత నమోదు కాగా, ఆరు పాఠశాలల్లో జీరో శాతం ఉత్తీర్ణత నమోదయ్యిందని అన్నారు. తెలంగాణ గురుకుల పాఠశాలలు, బిసి, ఎస్‌సి, ఎస్‌టి, మైనార్టీ మోడల్ స్కూల్స్,ప్రైవేట్, కెజిబివి పాఠశాలల్లో రాష్ట్ర సగటు ఉత్తీర్ణత శాతం కంటే అధిక ఉత్తీర్ణత శాతం నమోదయ్యిందని తెలిపారు.

ఫలితాల పట్ల ఆందోళన వద్దు : బుర్రా వెంకటేశం
పదో తరగతి ఫలితాల పట్ల విద్యార్థులు, తల్లిదండ్రులు ఒత్తిడికి గురికావద్దని విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి బుర్రా వెంకటేశం తెలిపారు. ఈ పరీక్షల ఫలితాలు జీవితంలో ఒక భాగం మాత్రమేనని, ఫలితాలే జీవితం కాదని అన్నారు. పరీక్షల్లో ఫెయిలైనా జీవితంలో అద్భుతాలు చేసినవారు ఎంతోమంది ఉన్నారని చెప్పారు.
నిర్మల్ ఫస్ట్ .. వికారాబాద్ లాస్ట్
టెన్త్ ఫలితాల్లో నిర్మల్ జిల్లా 99.05 శాతం ఉత్తీర్ణతతో మొదటి స్థానంలో నిలవగా, 98.65 శాతం ఉత్తీర్ణతతో సిద్దిపేట రెండవ స్థానంలో, 98.27 శాతం ఉత్తీర్ణతతో రాజన్న సిరిసిల్ల జిల్లా మూడో స్థానంలో ఉన్నాయి. 65.10 శాతం ఉత్తీర్ణతతో వికారాబాద్ జిల్లా చివరి స్థానంలో నిలిచింది. రాష్ట్రవ్యాప్తంగా 3,927 పాఠశాలల్లో 100 శాతం ఉత్తీర్ణత నమోదు కాగా, 6 స్కూళ్లలో ఒక్కరూ పాస్ కాలేదు. మార్చి 18 నుంచి ఏప్రిల్ 2 వరకు నిర్వహించిన పదవ తరగతి పరీక్షలకు రాష్ట్ర వ్యాప్తంగా 5,05,813 మంది విద్యార్థులు హాజరయ్యారు. రెగ్యులర్‌లో 4,94,207 మంది విద్యార్థులకు 4,51,272 మంది(91.31 శాతం) ఉత్తీర్ణులు కాగా, ప్రైవేట్ 11,606 మంది విద్యార్థులకు 5,772 మంది ఉత్తీర్ణులయ్యారు.

జూన్ 3 నుంచి అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ
పదవ తరగతి అడ్వాన్స్‌డ్ సప్టిమెంటరీ పరీక్షలు జూన్ 3 నుంచి 13 వరకు ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు
అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించనున్నట్లు బుర్రా వెంకటేశం వెల్లడించారు. ఫెయిలైన విద్యార్థుల కోసం విద్యార్థులకు రీకౌంటింగ్, రీవెరిఫికేషన్‌కు అవకాశం ఉంటుందని, అవసరమైతే విద్యార్థులు రాసిన పరీక్ష పేపర్ల జిరాక్స్ ఇస్తామని తెలిపారు. రీ- కౌంటింగ్‌కు రూ. 500, రీ-వెరిఫికేషన్‌కు రూ. వెయ్యి ఫీజు చెల్లించాలని అన్నారు. పాఠశాలల్లో మే 16వ తేదీ లోపు అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ ఫీజు చెల్లించాలని పేర్కొన్నారు.

 

పదవ తరగతి పరీక్షలకు హాజరైన విద్యార్థులు : 4,94,207
ఉత్తీర్ణత సాధించవారు : 4,51,272
ఉత్తీర్ణత శాతం : 93.31
పరీక్షలకు హాజరైన బాలికలు : 2,45,208
ఉత్తీర్ణత సాధించిన బాలికలు : 2,28,616
బాలికల ఉత్తీర్ణత శాతం : 93.23
పరీక్షలకు హాజరైన బాలురు : 2,48,999
ఉత్తీర్ణత సాధించిన బాలురు : 2,22,656
బాలుర ఉత్తీర్ణత శాతం : 89.42

 

సబ్జెక్టుల వారీగా ఉత్తీర్ణత

సబ్జెక్ట్ హాజరైన విద్యార్థులు ఉత్తీర్ణత శాతం

ఫస్ట్ లాంగ్వేజ్ 4,79,634 97.12
సెకండ్ లాంగ్వేజ్ 4,92,665 99.87
థర్డ్ లాంగ్వేజ్ 4,85,016 98.30
మ్యాథమెటిక్స్ 4,76,513 96.46
జనరల్ సైన్స్ 4,77,255 96.60
సోషల్ స్టడీస్ 4,89,276 99.05

మీడియం వారీగా ఉత్తీర్ణత

మీడియం హాజరైన విద్యార్థులు ఉత్తీర్ణులైన విద్యార్థులు ఉత్తీర్ణత శాతం
తెలుగు 84,790 68,437 80.71
ఇంగ్లీష్ 4,01,458 3,76,317 93.74
ఉర్దూ 7508 6119 81.50
ఇతర మీడియం 451 399 88.47

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News