Monday, June 3, 2024

విసిలు నేటితో ఆఖరు

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలోని పది యూనివర్సిటీల వైస్ చాన్స్‌లర్ల పదవీకాలం మంగళవారం(మే 21)తో ముగియనున్నది. ఈ నెలఖరుకు లేదా వచ్చే నెల మొదటి వారంలో ఉస్మానియా యూనివర్సిటీ, జెఎన్‌టియుహెచ్, పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీ, మహాత్మాగాంధీ యూనివర్సిటీ, శాతవాహన యూనివర్సిటీ, తెలంగాణ యూనివర్సిటీ, పాలమూరు యూనివర్సిటీ, జవహర్ లాల్ నెహ్రూ ఆర్టికల్చర్ అండ్ ఫైన్ ఆరట్స్ యూనివర్సిటీ (జెఎన్‌ఎఎఫ్‌ఎయు), డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ ఒపెన్ యూనివర్సిటీలకు కొత్త వైస్ ఛాన్స్‌లర్ల నియామకం పూర్తయ్యే అవకాశం కనిపిస్తోంది. ప్రస్తుత విసిల పదవీకాలం ముగిసే లోపే కొత్త విసిల నియామకానికి రాష్ట్ర ప్రభుత్వం జనవరి నుంచే కసరత్తు చేపట్టింది. అర్హులైన వారి నుంచి దరఖాస్తులను కూడా స్వీకరించగా, అర్హులైన 312 మంది ప్రొఫెసర్లు 1,382 దరఖాస్తులు సమర్పించారు. కొందరు ఒకటికి మించి వైస్ ఛాన్స్‌లర్ పోస్టులకు దరఖాస్తు చేసుకున్నారు.

బిఆర్ అంబేడ్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయానికి 208 దరఖాస్తులు, ఉస్మానియా యూనివర్సిటీకి 193, శాతవాహనకు 158, మహాత్మా గాంధీకి 157, కాకతీయకు 149, పాలమూరుకు 159, తెలంగాణ వర్సిటీకి 135, జెఎన్‌టియుహెచ్‌కు 106, తెలుగు వర్సిటీకి 66, జవహర్‌లాల్ నెహ్రూ ఆర్కిటెక్చర్, ఫైన్ ఆర్ట్ వర్సిటీకి 51 దరఖాస్తులు వచ్చాయి. దరఖాస్తుల స్వీకరణ అనంతరం అర్హులైన ప్రొఫెసర్ల గురించి ఇంటెలిజెన్స్ వర్గాల ద్వారా ప్రభుత్వం సమాచారం సేకరించింది.ఈ ఏడాది మార్చిలో ఎన్నికల కోడ్ అమలులోకి రావడంతో ఎంపిక ప్రక్రియ నిలిచిపోయింది. ఇటీవల వైస్ ఛాన్స్‌లర్ల నియామకానికి ఇసి అనుమతిచ్చిన నేపథ్యంలో ప్రభుత్వం విసిల నియామక ప్రక్రియను వేగవంతం చేసింది. అందులో భాగంగా ఒక్కో విశ్వవిద్యాలయానికి ముగ్గురితో కూడిన సెర్చ్ కమిటీలను ప్రభుత్వం నియమించింది.

త్వరలో సెర్చ్ కమిటీ సమావేశాలు
ప్రభుత్వం నియమించిన సెర్చ్ కమిటీలు త్వరలోనే సమావేశాలు నిర్వహించనున్నారు. విసి పోస్టులకు దరఖాస్తు చేసుకున్న వారి బయోడేటాలను సెర్చ్ కమిటీలు పరిశీలించి, వైస్ ఛాన్స్‌లర్‌గా నియామకానికి మూడు పేర్లు సూచిస్తాయి. విసిలుగా నియమితులు కావాలంటే కనీసం పదేళ్లు ప్రొఫెసర్‌గా పనిచేసి ఉండాలి. లేదా పరిశోధన, అకడమిక్ అడ్మినిస్ట్రేషన్‌లో పదేళ్ల అనుభవం ఉండాలి. ఉపకులపతులను మూడేళ్ల కాలపరిమితికి నియమిస్తారు. ఈ వారంలోనే సెర్చ్ కమిటీ సమావేశాలు నిర్వహించి, విసిల ఎంపికకు సిఫార్సులు అందించనున్నాయి. సెర్చ్ కమిటీల సిఫార్సుల మేరకు ప్రభుత్వం ఆయా వర్సిటీలకు వైస్ ఛాన్స్‌లర్లను నియమించనున్నది. అయితే ఈ ప్రక్రియ పూర్తి కావడానికి కనీసం వారం నుంచి రెండు వారాల సమయం పట్టే అవకాశం కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో ఈ నెలాఖరులో లేదా వచ్చే నెల మొదటి వారంలో యూనివర్సిటీలకు ప్రభుత్వం కొత్త విసిలను నియమించనున్నది. అయితే కొత్త వైస్ ఛాన్స్‌లర్ల నియామకం పూర్తయ్యే వరకు ప్రస్తుతం ఉన్న విసిలను కొనసాగిస్తారా..? లేక ఇంఛార్జ్‌లను నియమిస్తారా..? తెలియాల్సి ఉన్నది.

పకడ్బందీగా ఎంపిక ప్రక్రియ
గతంలో తెలంగాణ యూనివర్సిటీ వైస్ ఛాన్స్‌లర్ తీరు వివాదాస్పదంగా మారడం, కాకతీయ యూనివర్సిటీ విసిపై పలు ఆరోపణల నేపథ్యంలో విజిలెన్స్ విచారణకు ప్రభుత్వం ఆదేశించిన నేపథ్యంలో కొత్త వైస్ ఛాన్స్‌లర్ల నియామకాలను పకడ్బందీగా చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. ఈసారి ఎలాంటి విమర్శలకు తావులేకుండా అర్హులైన ప్రొఫెసర్లలో సమర్థులైన వారిని ఎంపిక చేసేలా చర్యలు తీసుకుంటోంది. వైస్ ఛాన్స్‌లర్ పదవికి వయోపరిమితి, ఒక ప్రొఫెసర్ ఎన్ని దఫాలుగా విసిగా బాధ్యతలు నిర్వహించారనే నిబంధనలు లేనప్పటికీ 70 ఏళ్ల గరిష్ఠ వయోపరిమితిని, పదవిని రెండు దఫాలు బాధ్యతలు నిర్వహించిన వారికి విసిగా నియమించాలా..? వద్దా..? అనే అంశాన్ని ప్రభుత్వం పరిశీలిస్తున్నట్లు తెలిసింది.

ఆలస్యం కానున్న కెయు విసి నియామకం..?
కాకతీయ యూనివర్సిటీకి విసి నియామకం ఆలస్యమయ్యే అవకాశం కనిపిస్తోంది. మిగతా యూనివర్సిటీలతోపాటే కెయుకు కూడా కొత్త విసిని నియమిస్తారని భావిస్తుండగా, ఆ వర్సిటీకి సెర్చ్ కమిటీ ఏర్పాటు కాకపోవడంతో కొత్త విసి నియామకం ఆలస్యం కావచ్చనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కెయుకు గత సంవత్సరం అక్టోబర్‌లో పూర్తిస్థాయి పాలకమండలి సభ్యుల పదవీకాలం ముగిసింది. ఎక్స్ అఫిషియో సభ్యులు మాత్రమే కొనసాగుతున్నారు. కెయుకు పూర్తిస్థాయి పాలకమండలి లేకపోవడం వల్లనే సెర్చ్ కమిటీ నియామకం చేపట్టలేదు. ఈ నేపథ్యంలో త్వరలో కాకతీయ యూనివర్సిటీకి పూర్తిస్థాయి పాలకమండలిని నియమించి ఆ తర్వాత సెర్చ్ కమిటీని నియమించనున్నట్లు తెలుస్తోంది. మిగతా యూనివర్సిటీలకు విసిల నియామకం పూర్తయ్యేలోపే కెయుకు సెర్చ్ కమిటీని నియమించి విసి నియామక ప్రక్రియ పూర్తవుతుందా..? లేక ఆలస్యమవుతుందా..? వేచిచూడాలి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News