భారత భూభాగాలకు మళ్లించాలన్న ఆలోచనల్లో మార్పు లేదు
సింధు జలాలపై సంపూర్ణ అధికారం భారత్‌దే
ఆ ఒప్పందం పునరుద్ధరణ ఎప్పటికీ జరగదు
అణు బెదిరింపులకు ఎట్టి పరిస్థితిలోనూ బెదరం
దీపావళికి జిఎస్‌టి భారం తగ్గింపు
కొత్త సంస్కరణలతో సామాన్యులకు మేలు
త్వరలో హైపవర్డ్ డోమోగ్రఫీ మిషన్ అమలు
అవకాశాలను అక్రమ చొరబాటుదారులు లాక్కోకుండా చూడడమే లక్ష్యం
100ఏళ్లుగా ఆర్‌ఎఎస్‌ఎస్ చేస్తున్న దేశసేవ అద్భుతం
రైతులకు వ్యతిరేకంగా చేపట్టే ఎలాంటి చర్యలకైనా నేను అడ్డుగోడలా నిలబడుతా
స్వాతంత్య్ర దినోత్సవ సందేశంలో ప్రధాని నరేంద్ర మోడీ
న్యూఢిల్లీ : భారత 79వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రతిష్టాత్మకమైన ఎర్రకోట బురుజులు మీదుగా ప్రధాని నరేంద్రమోడీ దేశానికి కీలక సందేశాన్ని ఇచ్చారు. అన్నిరంగాల్లో స్వావలంబన సాధించే విధంగా సమగ్రాభివృద్ధికి కృషి, రక్షణ రంగంలో
స్వయం సమృద్ధి, దేశాన్ని ఎటువంటి ముప్పు నుంచి అయినా రక్షించేందుకు మిషన్ సుదర్శన్ చక్ర, దేశంలో యువతకు పలు అవకాశాలు కల్పించే యువశక్తి వంటి పలు పథకాలను ప్రకటించారు. 79వ భారత స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని శుక్రవారంనాడు ఎర్రకోటపై త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించిన అనంతరం దాదాపు 103 నిముషాలపాటు ప్రధాని మోడీ ప్రసంగించారు. పలు అంశాలను ఈ సందర్భంగా ప్రస్తావించారు. రాబోయే పదేళ్లలో అంటే 2035 నాటికి దేశ రక్షణ కోసం అపూర్వ రక్షణ కవచం సిద్ధం కాగలదని ప్రకటించారు.
అదే మిషన్ సుదర్శన్ చక్ర అన్నారు. మహాభారతంలోని శ్రీ కృష్ణుని స్ఫూర్తితో సుదర్శన్ చక్ర మార్గాన్ని ఎన్నుకున్నట్లు ప్రధాని తెలిపారు. ఆత్మనిర్భర్ భారత్ లక్ష్యాన్ని మరింత బలోపేతం చేసేదే సుదర్శన్ చక్ర ఆయుధ వ్యవస్థ అని, వచ్చే పదేళ్లలో దేశీయ సాంకేతిక నైపుణ్యంతో అభివృద్ధి చేయనున్న ఈ వ్యవస్థ దేశ సరిహద్దులతో పాటు, దేశంలోని కీలక ప్రాంతాలకూ కవచంలా కాపాడుతుందన్నారు. సుదర్శన్ చక్ర బహుళ అంచెల భద్రతా వ్యవస్థగా నిలుస్తుందని, అత్యాధునిక నిఘా, సైబర్, దేశంలో కీలక ప్రదేశాల రక్షణ తో పాటు రక్షణ రంగంలో ప్రభుత్వ రంగ సంస్థల పరిశోధనలు, హైబ్రీడ్ యుద్ధ తంత్రాలు కూడా దీనిలో భాగం కాగలవన్నారు. 2008 ముంబై దాడుల అనంతరం సమీకృత భద్రతా వ్యవస్థ అవసరం హెచ్చిందని ప్రధాని వివరించారు.
ప్రధాని తన ప్రసంగంలో ఆపరేషన్ సిందూర్ సందర్భంగా భారత సైనిక రంగాల కృషిని ప్రత్యేకంగా ప్రశంసించారు. ఏప్రిల్ 22న పహల్గాంలో టెర్రరిస్ట్‌ల దాడితో ప్రపంచం ఎలా దిగ్భ్రమకు గురైందో వివరించారు. పాకిస్తాన్ కు దీటుగా జవాబు ఇచ్చామని ఈ సందర్భంగా పేర్కొన్నారు. ఆపరేషన్ సిందూర్ సందర్భంగా రక్షణ దళాలకు పూర్చి స్వేచ్ఛ ఇచ్చిన విషయాన్ని వివరించారు. అణు బెదిరింపులు, బ్లాక్ మెయిల్ కు లొంగేదిలేదు పాకిస్తాన్ ను నేరుగా ప్రస్తావిస్తూ, భారతదేశం ఇకపై అణు బెదిరింపులకు, బ్లాక్ మెయిల్ హెచ్చరికలను సహించబోదని మోడీ హెచ్చరిక జారీ చేశారు. సింధు జలాల ఒప్పందం భారత దేశ ప్రయోజనాలకు, ముఖ్యంగా భారతీయ రైతుల ప్రయోజనాలకు వ్యతిరేకంగా ఉందని, ఈ విషయంలో భారత నిరంతర వైఖరి ఇదేనని పునరుద్ఘాటించారు.
అక్రమ వలసలతో ముప్పు
దేశంలోకి అక్రమ వలసలు పెరగడం వల్ల ఎదురవుతున్న ముప్పును నిర్ణయాత్మకంగా పరిష్కరించవలసిన అవసరాన్ని ప్రధాని మోడీ నొక్కి చెప్పారు. అక్రమ వలసలద్వారా దేశ జనాభాను మార్చేందుకు జరుగుతున్న కుట్ర పట్ల పౌరులను అప్రమత్తం చేశారు. దీనిని సహించబోమని స్పష్టంచేశారు. ఈ సమస్య పరిష్కారానికి భారతీయ పౌరుల జీవనోపాధిని కాపాడేందుకు ఒక హై-పవర్డ్ డెమోగ్రఫీ మిషన్ ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించారు. సరిహద్దు ప్రాంతాల్లో జనాభా మార్పులు జాతీయ భద్రతకు ముప్పు కలిగిస్తాయని, కొత్త ఘర్షణలకు బీజాలు వేస్తాయని, ఏదేశం కూడా చొరబాటుదారులముందు లొంగబోదని, మనం ఎలా లొంగుతామని ప్రధాని నిలదీశారు.
దేశ ప్రజలకు దీపావళి డబుల్ గిఫ్ట్
ప్రధాని మోడీ స్వాతంత్రదిన ప్రసంగం సందర్భంగా దేశ ప్రజలకు దీపావళి బహుమతిగా జీఎస్టీ వ్యవస్థలో భారీ సవరణలను ప్రకటించారు. దీనివల్ల చాలా వస్తువులుపై పన్ను పెద్దగా తగ్గడమే కాక, ఎన్నో ఉత్పత్తులపై పన్ను పూర్తిగా రద్దయ్యే అవకాశం ఉంది. ప్రస్తుతం జిఎస్టీ రేట్లు ఐదు ప్రధాన స్లాబ్ లలోకి వస్తాయి. వాటిలో 12 శాతం స్లాబ్ ను తొలగించి, అన్నివస్తువులను 5 శాతం, 18 శాతం వర్గాల మధ్య మారుస్తారు. త్వరలో వివరాలను ప్రభుత్వం ప్రకటిస్తుంది.
రైతుల ప్రయోజనాలు పణంగా పెట్టం
దేశంలో వ్యవసాయదారులు, పాడి పరిశ్రమకు చెందిన రైతులు, మత్స్య కారుల ప్రయోజనాలను రక్షించేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందని, వారి ప్రయోజనాలను తాకట్టు పెట్టే ప్రసక్తే లేదని ప్రధాని మోడీ ఎర్రకోట సాక్షిగా ప్రకటించారు. అమెరికాతో వాణిజ్య ఒప్పందంపై ప్రతిష్టంభన, అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ ధోరణి నేపథ్యంలో ప్రధాని ఈ విషయాన్ని ప్రస్తావించారు. భారత రైతులు, మత్స్యకారుల ప్రయోజనాలే మాకు ముఖ్యం ఈ విషయంలో రాజీ ప్రసక్తే లేదు. ఇందుకోసం మోడీ గోడలా నిలబడి ఉన్నారని స్వయంగా ప్రకటించారు అమెరికా బీజీ వ్యవసాయం, పాల ఉత్పత్తులకు భారతదేశీయ మార్కెట్ తెరవాలన్న ట్రంప్ ఒత్తిడికి లొంగక పోవడం వల్లనే వాణిజ్య ఒప్పందం నిలిచి పోయిన విషయాన్ని ఆయన పరోక్షంగా గుర్తుచేశారు.
ప్రధాన్ మంత్రి ధన్,ధాన్య కృషి యోజన
వ్యవసాయరంగంలో రైతులకు అదనపు మద్దతు అవసరమయ్యే దాదాపు 100 జిల్లాలను కేంద్ర ప్రభుత్వం గుర్తించిందని ప్రధాని పేర్కొన్నారు. వారిని బలోపేతం చేసేందుకు ప్రధాన్ మంత్రి ధన్, ధాన్య కృషి యోజన ను ప్రారంభిస్తున్నట్లు ప్రకటించారు.
భారతదేశంలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా ప్రజలు ఎదుర్కొంటున్న మరో సమస్య ఊబకాయం… అదే ఒబిసిటీ అని ప్రధాని పేర్కొన్నారు. దేశంలో ప్రతి కుటుంబం కనీసం పదిశాతం తక్కువగా వంటనూనెను కొనాలని, అలాగే రోజువారీ భోజనంలో పదిశాతం తక్కువ నూనె వాడాలని ప్రధాని కోరారు. ప్రజలు ఆరోగ్యం, ఫిట్ నెస్, ఊబకాయం పట్ల శ్రద్ధవహించని పక్షంలో 2050 నాటికి దేశ జనాభాలో మూడో వంతు మంది ఊబకాయం బారిన పడే ప్రమాదం ఉందని లాన్సెట్ సంస్థ అధ్యయనంలో తేలింది. ఉద్యోగ మార్కెట్‌లోకి ప్రవేశించే యువత కోసం రూ. లక్ష కోట్ల పథకం ప్రధాని మోడీ శుక్రవారం నాడు ప్రధాన మత్రి వికసిత్ భారత్ రోజ్ గార్ యోజన ప్రకటించారు. ప్రైవేటు రంగంలో మొదటి ఉద్యోగం పొందే వారికి కేంద్రం నుంచి రూ. 15,000 లభిస్తుందని ప్రకటించారు. లక్ష కోట్ల రూపాయల పథకం వెంటనే అమలులోకి వస్తుందని ప్రధాని ప్రకటించారు. ఈ పథకం వల్ల మూడున్నర కోట్ల మంది ప్రజలకు, ముఖ్యంగా యువతకు ప్రయోజనం కలుగుతుంది. 50 శాతం లావాదేవీలు ఇప్పుడు భారతదేశంలో యూపీఐ ద్వారానే సాగుతున్నాయన్నారు. ప్రపంచంలో ఇది అద్భుతం సృష్టించిందన్నారు. జులై 2025 నాటికి 1,947 కోట్ల టాన్సాక్షన్స్ జరిగాయని వివరించారు.
ఆర్‌ఎస్‌ఎస్ సేవ నిరుపమానం..
తయారీ రంగానికి భారత్ పుట్టిల్లులా మారుతోందని ప్రధాని మోడీ అన్నారు. సెమీకండక్టర్ చిప్ త్వరలో భారత మార్కెట్‌లోకి విడుదల కాబోతోందని, ఇండియాలోనే.. భారత ప్రజల చేతుల్లోనే తయారీ అయిన చిప్ ఈ ఏడాది చివరలో విడుదల కాబోతుందన్నారు. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్(ఆర్‌ఎస్‌ఎస్)పై ప్రధాని మోడీ ప్రశంసల జల్లు కురిపించారు. ప్రపంచంలోనే వందేళ్లు నిండియ అతి పెద్ద ఎన్‌జిఓగా దానిని అభివర్ణించారు. జాతికి ఆ సంస్థకు చెందిన వాలంటీర్లు అంకితభావంతో చేస్తున్న సేవ నిరుపమానమైనదన్నారు. కోట్లాది ప్రజలు, మత గురువులు, శాస్త్రవేత్తలు, ఉపాధ్యాయులు, రైతులు, సైనికులు, కూలీలు, వ్యక్తులు, సంస్థల శ్రమ ఫలితంగానే ఆర్‌ఎస్‌ఎస్ రూపుదిద్దుకున్నదని మోడీ పేర్కొన్నారు. ఆ సంస్థ 100 ఏళ్ల దేశ సేవ చూస్తుంటే ఎంతో గర్వంగా ఉందని, చరిత్ర పుటల్లో నిలిచిపోతుందన్నారు. నక్సలిజాన్ని రూపుమాపుతూ రెడ్ కారిడార్‌ను అభివృద్ధి పథంలో పయనింపజేస్తున్నామని, తద్వారా దాన్ని గ్రీన్ కారిడార్‌గా రూపాంతరం చెందేలా తమ ప్రభుత్వం కృష్టి చేస్తుందన్నారు.