Sunday, June 4, 2023

విదేశీ విపక్షాలను చూసైనా నేర్చుకోండి: మోడీ

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : ఆస్ట్రేలియాలోని ప్రతిపక్షాలను చూసైనా సవ్యంగా నడవడం నేర్చుకుంటే మంచిదని ప్రధాని నరేంద్ర మోడీ భారత విపక్షాలపై ఘాటుగా విరుచుకుపడ్డారు. ఆరురోజుల విదేశీ పర్యటను ముగించుకుని వచ్చిన ప్రధాని మోడీ గురువారం ఢిల్లీలో ఏర్పాటు అయిన ఓ కార్యక్రమంలో మాట్లాడారు. ఈ నెల 28న నూతన పార్లమెంట్ భవనం ప్రధాని మోడీ ద్వారా ఆవిష్కృతం అవుతోంది. దీనిని నిరసిస్తూ , ప్రజాస్వామ్య పద్ధతులను మోడీ కాలరాస్తున్నారని పేర్కొంటూ ప్రతిపక్షాలు కార్యక్రమాన్ని బహిష్కరించేందుకు సిద్ధం అయ్యాయి. దీనిని ప్రధాని మోడీ తీవ్రంగా తప్పుపట్టారు. దేశంలోని విపక్షాలకు గులాంగిరీ పద్థతి పోవడం లేదని విమర్శించారు. కాంగ్రెస్ వైపు విపక్షాలు మొగ్గు చూపుతున్న అంశాన్ని పరోక్షంగా ప్రస్తావించారు.

ఓ పెద్ద పార్టీ చెప్పినట్లు నడుచుకునే పాతబానిస వైఖరి ఇప్పుడు తిరిగి తలెత్తిందని తెలిపారు. తాను ఇటీవల ఆస్ట్రేలియాకు వెళ్లినప్పుడు అక్కడి ప్రతిపక్షాల వైఖరిని గమనించానని, ఆ పార్టీలు జాతీయ విషయాలలో కనబరుస్తున్న నిర్మాణాత్మక వైఖరి ఆకట్టుకుందని, అక్కడి ప్రతిపక్షాలను ఇక్కడి ప్రతిపక్షాలతో ఇప్పుడు పోల్చుకోవల్సి వస్తోందన్నారు. అక్కడి విపక్షాలు దేశానికి తొలి ప్రాధాన్యత ఇస్తారని, రాజకీయాలుతరువాతి అంకం అని తెలిపిన ప్రధాని తాను సిడ్నీ శివార్లలో ప్రవాసభారతీయుల సమావేశంలో పాల్గొన్న విషయాన్ని ప్రస్తావించారు. దేశ ప్రధాని ఆంథోనీ అబ్బనీస్, మాజీ ప్రధాని, విపక్ష ఎంపిలు పలువురు తరలివచ్చారని, వేరే దేశ ప్రతినిధి ముందు తమ దేశ కార్యక్రమంలో వారు కనబర్చిన సంఘీభావం తనకు సంతోషం కల్గించిందన్నారు, కలిసికట్టుతనం, ప్రజాస్వామ్య స్ఫూర్తి ద్యోతకం అయిందని చెప్పిన ప్రధాని మరి ఇప్పుడు ఇక్కడ జరుగుతున్నదేమిటి? అని ప్రశ్నించారు.

కరోనా వ్యాప్తిదశలో భారతదేశం నుంచి పెద్ద ఎత్తున ఇతర దేశాలకు టీకాలు, ఇతరత్రా సాయాన్ని తమ ప్రభుత్వం మానవీయ కోణంలో అందించిందని, అయితే మన గురించి ఆలోచించకుండా ప్రతిష్ట కోసం ఇతరదేశాలకు సాయం చేయడం ఏమటని ప్రతిపక్షాలు తప్పుపట్టాయని తెలిపారు. ఇది బుద్ధుడు, గాంధీ నడయాడిన నేల మనం శత్రువుల బాగోగుల గురించి కూడా ఆలోచించే కరుణతో ఉన్నాం. కష్టకాలంలో ఎదుటి వ్యక్తి ఎవరనేది చూడకుండా మనం వ్యవహరించిన తీరు దేశదేశాలలో భారత్ ప్రతిష్ట ఇనుమడింపచేసిందని, మరి ప్రతిపక్షం గతంలో కానీ ఇప్పుడు మరో రెండు రోజులలో జరిగే కార్యక్రమం నేపథ్యంలో కానీ అనుసరించే పాత్ర వల్ల ఎటువంటి సంకేతాలు ఇతర దేశాలకు వెళ్లుతాయని ప్రశ్నించిన ప్రధాని దీని పట్ల తమ ఆవేదన వ్యక్తం చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News