Wednesday, May 14, 2025

నట్టింట్లోకి వెళ్లి నడ్డివిరిచాం

- Advertisement -
- Advertisement -

వీర సైనికులకు సెల్యూట్ చేస్తున్నా.. మీ పరాక్రమంతో ఆపరేషన్ సిందూర్ ప్రపంచమంతా మార్మోగుతోంది. భారత్ మాతాకీ జై నినాదం శత్రువుల చెవుల్లో గింగిరాలు తిరుగుతోంది.
ప్రధాని మోడీ

త్రివిధ దళాల
దెబ్బతో శత్రు స్థావరాలు మట్టికరిచాయి
ఉగ్రవాదులకు ఊపిరిపీల్చుకునే జాగ
లేకుండా చేశాం పౌర విమానాలను
అడ్డుపెట్టుకుని పాక్ కుయుక్తులు మన
శక్తిని చూసి దాయాదికి నిద్ర కరువైంది
యుద్ధ క్షేత్రంలోనూ భారత్ మాతాకీ జై
నినాదాలు చేశాం ఆపరేషన్ సిందూర్
భారత కొత్త సాధారణ విధానం త్రివిధ
దళాల సమన్వయం త్రివేణి సంగమం
అదంపూర్ ఎయిర్‌బేస్‌లో ప్రధాని మోడీ
వ్యాఖ్యలు నేవీపై ప్రశంసల జల్లు

న్యూఢిల్లీ : టెర్రరిస్ట్‌లకు పాకిస్తాన్‌లో తలదాచుకునేందుకు ఇక చోటు లేదని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. ముష్కరులు ఎక్కడ దాగున్నా, చివరికి ఇళ్లలో నక్కినా మన సాయు ధ బలగాలు వెతికి వేటాడి దాడి చేస్తాయని ఆయన హెచ్చరించారు. మన అక్కాచెల్లెళ్ల నుదుటి సిందూరం తుడిచినవాడి నట్టింట్లోకి వెళ్లి నాశనం చేశామని గుర్తు చేశారు. మీరు గురిచూసిన కొట్టిన దెబ్బతో శత్రు స్థావరాలు మట్టిలో కలిసిపోయాయన్నారు. ‘ఘర్ మే ఘుస్‌కే మారేంగే’ అని మోడీ పిలుపునిచ్చారు. ఉగ్రవాదులకే కాక, వారికి మద్దతు ఇచ్చే పాక్ సైన్యానికి కూడా గట్టి సమాధానం ఇవ్వడం ద్వారా భారతదేశం తమ శక్తి సామర్థ్యాలను ప్రదర్శించిందని ప్రధాని అ న్నారు. మంగళవారంనాడు పంజాబ్ లోని అదంపూర్ ఎయిర్ బేస్‌లో వైమానిక యోధులను ఉద్దేశించి మోడీ ప్రసంగించారు.

ఏ పాకిస్తానీ సైన్యంపై భరోసాతో టెర్రరిస్ట్ లు రెచ్చిపోతున్నారో అలాంటి వారిని భారత సైనిక దళాలు తుడిచి పెట్టాయన్నారు. పాక్ సైన్యాన్ని మట్టి కరిపించాయని ప్రధా ని వెల్లడించారు. సాయుధ దళాల సాహసాలను ప్రశంసిస్తూ ప్రధాని పాకిస్తాన్‌లో టెర్రరిస్ట్‌లు ప్రశాంతంగా కూర్చుని ఊపిరి పీల్చుకునే జాగా కూడా లేదని పాకిస్తాన్ సైన్యానికి స్పష్టం చేశారని అన్నారు. సీమాంతర ఉగ్రవాదంపై భారతదేశం దూకుడు విధానాన్ని పునరుద్ఘాటిస్తూ, మళ్లీ టెర్రరిస్ట్‌లు తల ఎత్తుకుంటే వారిని వారి ఇళ్లలోనే మట్టుపెడతాం, తప్పించుకునే ఛాన్స్ కూడా ఇవ్వం అని ప్రధాని అన్నారు.

భారత ఆధునిక సైనిక సామర్థ్యాన్ని గుర్తు చేస్తూ, మన డ్రోన్లు, క్షిపణుల గురించి ఆలోచిసే పాకిస్తాన్ కు కంటిమీద కునుకు కరవవుతుందని స్పష్టం చేశారు. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా భారతదేశం గీసిన లక్ష్మణరేఖ ఏమిటో ఇప్పుడు స్పష్టమైందన్నారు. ఇప్పుడు మరో సారి టెర్రరిస్ట్ లు దాడి జరిపితే, చావు కొని తెచ్చుకున్నట్లేనన్నారు. భారత్ సైన్యం దాడితో శత్రువు డీలా పడిపోయిందన్నారు. ఎప్పుడు దాడి జరిగిందో కూడా కనిపెట్టలేక పోయిందని ప్రధాని మోడీ చెప్పారు. ఎంతో కచ్చితత్వంతో ఎంతో నైపుణ్యంతో చేసిన దాడి ఇదని ఆయన గుర్తు చేశారు. పౌర విమానాలను అడ్డు పెట్టుకుని పాక్ కుయుక్తులు పన్నిందన్నారు. భారత త్రివిధదళాల శక్తి సామర్థ్యాలను ప్రధాని ఎంతగానో ప్రశంసించారు.

అది త్రివేణి సంగమం..

ఆపరేషన్ సిందూర్ సమయంలో త్రివిధ దళాల సమన్వయం అద్భుతమన్నారు. నావికాదళం సముద్రంపై తన ఆధిపత్యాన్ని ప్రదర్శించిందని, సైన్యం సరిహద్దులను బలోపేతం చేసింది, వైమానిక దళం దాడులతో పాటు రక్షణనూ సాధించిందన్నారు. బీఎస్‌ఎఫ్, ఇతర దళాలు అద్భుతమైన సామర్థ్యాలను ప్రదర్శించాయ న్నారు. మన సైన్యం చేపట్టిన పరాక్రమం భారత్ సామర్థ్యానికి ప్రతి రూపమని పేర్కొన్నారు. భారత్ చూపిన ఈ పరాక్రమం త్రివిధ దళాల త్రివేణీ సంగమమని ఆయన వ్యాఖ్యానించారు. పాకిస్థాన్‌కు భారత వాయుసేన తన సత్తా చాటిందంటూ సైనికులపై ఆయన ప్రశంసల జల్లు కురిపించారు. యుద్ధ క్షేత్రంలోనూ భారత్ మాతాకీ జై నినాదాలు చేశామని ఈ జయ జయ ద్వానాలు ప్రపంచమంతా విన్నదని ఆయన గుర్తు చేశారు. అణు బాంబు హెచ్చరికలను సైతం చిత్తు చేశామని చెప్పారు. దేశంలోని ప్రతీ పౌరుడూ గర్వపడేలా మీరు చేశారంటూ సైనికులను ఈ సందర్భంగా ప్రధాని మోదీ అభినందించారు.

మీరందరూ చరిత్ర సృష్టించారంటూ సైనికులను ఆయన వెన్ను తట్టి ప్రోత్సహించారు. మీ కోసమే నేను ఇక్కడికి వచ్చానని చెప్పారు. వీరులను చూసినప్పుడు జీవితం ధన్యమవుతోందని ప్రధాని మోదీ ఈ సందర్భంగా పేర్కొన్నారు. మన డ్రోన్లు, క్షిపణులు పాక్ భూభాగంలోకి చొచ్చుకెళ్లి విధ్వంసం సృష్టించాయని తెలిపారు. ఇంకా చెప్పాలంటే.. పాక్ సైన్యానికి నిద్ర లేని పరిస్థితి సృష్టించామన్నారు.

పాక్ భూభాగంలో ఏ స్థావరాన్ని అయినా.. గురి చూసి కొట్టగలమని నిరూపించామని చెప్పారు. ఆపరేషన్ సిందూర్ భారత్ ఆత్మ విశ్వాసాన్ని కొత్త ప్రమాణాలు లిఖించిందని ప్రధాని మోడీ స్పష్టం చేశారు. ఇక మన స్థావరాలపై దాడి చేసేందుకు పాక్ ఎంతో ప్రయత్నించిందన్నారు. కానీ పాక్ విమానాలు, క్షిపణులు మన ముందు చిత్తయిపోయాయన్నారు

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News