Monday, April 29, 2024

మమత ప్రభుత్వంపై మోడీ ఫైర్

- Advertisement -
- Advertisement -

అణచివేత, వంచన, ఆనువంశిక రాజకీయాలకు ప్రతీక
పథకాలను కుంభకోణాలుగా మలచడంలో ‘మాస్టర్’
మమత ప్రభుత్వంపై మళ్లీ మోడీ విమర్శలు
బెంగాల్‌లో మొత్తం 42 సీట్లు గెలవాలి
రాష్ట్ర బిజెపికి లక్షం నిర్దేశం
కృష్ణనగర్ (పశ్చిమ బెంగాల్): ప్రధాని నరేంద్ర మోడీ శనివారం మమతా బెనర్జీ ప్రభుత్వంపై మళ్లీ విరుచుకుపడ్డారు. మమత ప్రబుత్వం ‘అణచివేత, ఆనువంశిక రాజకీయాలు, వంచనకు’ ప్రతీక అని మోడీ విమర్శించారు. పథకాలను కుంభకోణాలుగా మలచడంలో తృణమూల్ కాంగ్రెస్ (టిఎంసి) ‘పరిపక్వత’ సాధించిందని ఆయన ఆరోపించారు. నాడియా జిల్లా కృష్ణనగర్‌లో ఒక ర్యాలీలో మాట్లాడిన ప్రధాని మోడీ పశ్చిమ బెంగాల్‌లో గల మొత్తం 42 లోక్‌సభ సీట్లను గెలవాలని బిజెపికి ఆశావహ లక్షాన్ని నిర్దేశించారు. పశ్చిమ బెంగాల్ పురోగతి, దేశ ప్రగతికి మధ్య సన్నిహిత సంబంధం ఉందని ఆయన ఉద్ఘాటించారు. రాష్ట్రంలో ప్రతి లోక్‌సభ నియోజకవర్గంలో బిజెపి ఎన్నికల చిహ్నం ‘కమలం ప్రతి చోట విజయానికి దోహదం చేసేలా కృషి చేయాలి’ అని పార్టీ మద్దతుదారులకు మోడీ పిలుపు ఇచ్చారు.

సందేశ్‌ఖలిలో సంఘటనలను మోడీ ప్రస్తావిస్తూ, రాష్ట్ర ప్రభుత్వం బాధిత మహిళలను వారి మానాన వారిని వదలివేసి నిందితులకు దన్నుగా నిలచిందని ఆరోపించారు. సందేశ్‌ఖలిలో టిఎంసి నేతలు లైంగిక అత్యాచారాలకు పాల్పడ్డారని మహిలలు ఆరోపించిన విషయం విదితమే. ‘రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుకు ప్రజలు నిరాశ చెందారు. ఎన్నో ఆశలతో టిఎంసికి అనుకూలంగా వారు పదే పదే తీర్పు ఇస్తూ వచ్చారు. కాని ఆ పార్టీ దౌర్జన్యానికి, ఆనువంశిక రాజకీయాలకు, నయవంచనకు మారు పేరుగా తయారైంది. టిఎంసికి అవినీతి, ఆశ్రిత పక్షపాతం తప్ప రాష్ట్ర అభివృద్ధి ప్రధానం కాదు’ అని ప్రధాని విమర్శించారు. టిఎంసిపై మోడీ ఇంకా విరుచుకుపడుతూ ‘తూ, మైఁ, కరప్షన్ హీ కరప్షన్’ (మీరు, నేను, అవినీతి)’ అనే పదాలకు ఇప్పుడు మారుపేరుగా మార్చుకుందని అన్నారు.

కేంద్ర పథకాలను టిఎంసి దుర్వినియోగం చేస్తున్నదని, వాటిని తమ సొంత పథకాలుగా చెప్పుకుంటున్నదని, ‘అవినీతి, ఆశ్రిత పక్షపాతం’ సంస్కృతిని పెంచి పోషిస్తోందని మోడీ విమర్శించారు. ‘పశ్చిమ బెంగాల్ ప్రతిష్ఠను టిఎంసి మసకబార్చింది. ప్రతి పథకాన్నీ కుంభకోణంగా మార్చడంలో మాస్టర్‌గా ఎదిగింది. వారు కేంద్ర పథకాలపై ఒక స్టిక్కర్ అంటించి తమవిగా చెప్పుకుంటున్నారు’ అని ఆయన ఆరోపించారు. టిఎంసి ‘తొలబాజ్’ (దోపిదీదారులు) పశ్చిమ బెంగాల్‌లో ఆధిపత్యం వహిస్తున్నారని, ‘కేంద్ర పథకాల అమలును అడ్డుకుంటూ రాష్ట్రంలో తమ పలుకుబడి వినియోగిస్తున్నారు’ అని మోడీ విమర్శించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News