Saturday, April 13, 2024

తమిళనాడు వెనుకంజ యుపిఎ పాపమే: ప్రధాని మోడీ

- Advertisement -
- Advertisement -

తమిళనాడు వెనుకంజ యుపిఎ పాపమే
తరాల అన్యాయాన్ని సరిదిద్దేది ఈ సేవకుడే
కేంద్రం పథకాల ప్రచారానికి డిఎంకె అడ్డంకులు
పలు కార్యక్రమాలలో ప్రధాని మోడీ స్పందన
ఇస్రో ప్రయోగాల వేదికకు పునాదిరాయి

తూత్తుకూడి : ప్రధాని నరేంద్ర మోడీ బుధవారం తమిళనాడులో పర్యటించారు. మొత్తం రూ 17,000 కోట్ల విలువైన ప్రాజెక్టుల ప్రారంభోత్సవాలు, శంకుస్థాపన కార్యక్రమాలలో పాల్గొన్నారు. యుపిఎ హయాంలో తమిళనాడు భారీ స్థాయి నిర్లక్ష్యానికి గురైందని బుధవారం సంబంధిత సభలలో విమర్శించారు. తమిళ ప్రజలను గాలికొదిలి పెట్టిన అక్రమం గతంలో కేంద్రంలో పరిపాలన సాగించిన కాంగ్రెస్ మిత్రపక్షాల ప్రభుత్వానిదే అని మండిపడ్డారు.

ఇప్పుడు తమిళనాడులో నూతన అధ్యాయం ఆవిష్కృతమవుతోంది. కేంద్ర ప్రభుత్వ చొరవ, ప్రయత్నాలతో తమిళనాడులో ఆధునికతల అనుసంధాన ప్రక్రియ వేగవంతం అయిందని వివరించారు. తమిళనాడుకు కేంద్రం ఎంతో చేస్తోంది. వీటిని టీవీ ఛానల్స్, పత్రికల ద్వారా ప్రజల్లో తెలియచేసేందుకు జరిగే ప్రయత్నాలను కూడా ఇక్కడి పాలకులు అడ్డుకుంటున్నారని విమర్శించారు. అయితే ఇవేవీ తమిళనాడు ప్రగతి పనులకు ఆటంకం కాబోవని స్పష్టం చేశారు. తమిళనాడులోని ట్యూటికొరిన్‌లో తొట్టతొలి దేశీయ హరిత హైడ్రోజన్ వాటర్‌వే వెసల్‌ను ప్రధాని పచ్చజెండాతో ప్రారంభించారు. కేంద్రం చేపడుతున్న పలు పథకాలు, సరికొత్త సాంకేతిక వ్యవస్థలతో తమిళనాడులో జనజీవనంలో సరికొత్త హంగులు వచ్చి చేరాయని వివరించారు. ఇవి కేవలం ఇక్కడి ప్రాంతానికే కాకుండా మొత్తం భారతదేశ ప్రగతికి పనికి వస్తాయని తెలిపారు.

తాను ఇక్కడ చెపుతున్నది ఓ రాజకీయ సిద్ధాంతాల ప్రాతిపదికన కాదని, తన సూత్రీకరణల ఆధారంగా కాదని, ఇదంతా కూడా ప్రగతి పథం సంబంధిత ప్రసంగం అని తేల్చిచెప్పారు. డిఎంకె కాంగ్రెస్ పక్షాలపై ప్రధాని మోడీ ఘాటైన విమర్శలకు దిగారు. స్థానికుల నుంచి తరాలుగా డిమాండ్లుగా ఉన్న వాటిని తాను ఇప్పుడు కార్యరూపంలోకి తీసుకువచ్చానని, ఇది కొందరికి చేదైన నిజంగా ఉంటుందని, అయితే తప్పదని తేల్చిచెప్పారు. యుపిఎ హయాంలో ఇక్కడి డిఎంకె కేంద్రంలో అధికారం పంచుకున్నది, అయితే రాష్ట్రానికి అవసరం అయిన కార్యక్రమాలను అమలు చేయించిందా? అని ప్రశ్నించారు. వారికి తమ పవర్ తప్పితే జనం బాధల గురించి ఆలోచించే తీరిక లేకుండా పోయిందని, దీనితో రాష్ట్రం నానాటికి దిగజారిందని విమర్శించారు. ఇక ఇప్పుడు ఇక్కడ చేపట్టిన ఈ ప్రగతి కార్యక్రమాలన్నింటిని ఈ సేవకుడు తీసుకువచ్చినవే అని తమిళులకు మోడీ తెలిపారు.

కులశేఖరపట్టియణంలో ఇస్రో కేంద్రం
ప్రధాని మోడీ బుధవారం ఇక్కడ కులశేఖరపట్టియణంలో ఇస్రో నూతన ప్రయోగ వేదికకు పునాదిరాయి వేశారు. దీని నిర్మాణ వ్యయం రూ 986 కోట్లు. కాగా ఇక్కడ నిర్మాణం పూర్తయితే ఈ వేదిక నుంచి ఏడాదికి 24 ప్రయోగాలు నిర్వహించే సత్తా ఇస్రో సంతరించుకుంటుంది. ఈ కొత్త కాంప్లెక్స్‌లో 35 ఏర్పాట్లు ఉంటాయి. ప్రత్యేకించి ఎంఎల్‌ఎస్ నిర్మాణం కీలకమైనది. ఇక్కడ ఈ అంతరిక్ష ప్రయోగాల కేంద్రం ఏర్పాటుతో భారత అంతరిక్ష కేంద్రం(ఇస్రో) విస్తరణ, అన్వేషణలు, ప్రయోగాల సామర్థం మరింత పెరుగుతుంది. ఇటీవలి కాలంలో ఇస్రో ప్రయోగాలు విజయవంతం అవుతున్న దశలో సంస్థ ద్వారా శాటిలైట్లు నింగిలోకి పంపించేందుకు వివిధ దేశాల నుంచి డిమాండ్లు పెరుగుతున్న దశలో ఈ ప్రయోగ కేంద్రం ఏర్పాటు ఈ దిశలో కీలక పరిణామం అవుతుంది. ఈ విషయాలను కూడా ప్రధాని తమ ప్రసంగంలో ప్రత్యేకించి ప్రస్తావించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News