మౌలిక వసతుల కల్పనకు
కేంద్రం సంపూర్ణ సహకారం
వికసిత్ భారత్‌కు ఎపి గ్రోత్
ఇంజిన్‌గా ఎదగాలి
అమరావతి రీ లాంచింగ్
కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర
మోడీ 18 ప్రాజెక్టులకు ప్రధాని
శంకుస్థాపన రూ. 49,040
కోట్ల అంచనా వ్యయంతో
పనులు ప్రారంభం
మన తెలంగాణ/హైదరాబాద్: అమరావతి అంటే కేవలం ఒక నగరం కాదు..అమరావతి అంటే ఒక శక్తి.. ఆంధ్రప్రదేశ్ ను అధునాతన ఆంధ్రప్రదేశ్‌గా ఇది మారుస్తుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. అమరావతి పునర్నిర్మాణ శంకుస్థాపన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో మాట్లాడుతూ.. తల్లి దుర్గ భవాని.. కొలువైన పుణ్యభూమిలో మీ అందరినీ కలవడం తనకు ఎంతో ఆనందంగా ఉందని.. మోడీ తెలుగులో తన ప్రసంగాన్ని మొదలుపెట్టారు. అమరావతి అంటే సంప్రదాయం, పురోగతి అని అన్నారు. జూన్ 21న మళ్లీ ఏపీకి వస్తానన్న ఆయన ఆ రోజున యావత్ ప్రపంచం మనవైపు చూసి మాట్లాడుకునేలా చేయాలన్నారు. జూన్ 21న జరుపుకునే అంతర్జాతీయ యోగా దినోత్సవానికి ఇంకా 50 రోజులు ఉందని, ఈ 50 రోజుల్లో ఏపీలోని ప్రతి ఊరు, గ్రామం, వీధి, ఇంటిలో యోగాని ప్రచారం చేయాలని పిలుపునిచ్చారు.
అమరావతి… ఐదు కోట్లమంది సెంటిమెంట్: చంద్రబాబు
ఏపీ చరిత్రలో నేడు శాశ్వతంగా లిఖించదగ్గ రోజు అని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. గతంలో నరేంద్ర మోదీయే అమరావతి పనులకు శంకుస్థాపన చేశారని గుర్తు చేశారు. గత ఐదేళ్లు రాజధాని నిర్మాణ పనులు నిలిచిపోయాయని, మళ్లీ మోదీ చేతులమీదుగానే పనుల పునఃప్రారంభమయ్యాయని తెలిపారు. ఇటీవల మోదీని కలిసినప్పుడు ఆయన చాలా గంభీరంగా ఉన్నారని, పహల్గాంలో అమాయక ప్రజలు ప్రాణాలు కోల్పోయారన్న బాధలో ఉన్నారని చంద్రబాబు చెప్పారు. ఉగ్రవాదాన్ని అణచివేయడంలో కేంద్రం తీసుకునే ప్రతి చర్యకు అండగా ఉంటామని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. మోదీకి అండగా ఉంటామని ప్రతిజ్ఞ చేస్తున్నట్లు వివరించారు. వందేమాతరం భారత్‌మాతాకి జై అంటూ సీఎం నినాదాలు చేశారు.
రైతులు రాష్ట్రానికి భవిష్యత్తునిచ్చారు:పవన్ కల్యాణ్
రాజధాని రైతులు ధర్మ యుద్ధంలో విజయం సాధించారని ఎపి ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ అన్నారు. స్వచ్ఛందంగా భూములు ఇచ్చిన రైతులకు శిరసు వంచి నమస్కారం చేస్తున్నానన్నారు. రాజధాని లేకుండా చేసే ప్రయత్నాలను రైతులు విజయవంతంగా తిప్పికొట్టారని చెప్పారు. దేశమే ఇల్లుగా, ప్రజలే కుటుంబంగా భావించే ప్రధాని మోదీకి స్వాగతం పలుకుతున్నామన్నారు. అమరావతి మహిళా రైతుల పోరాడిన సాహసం ఎవరూ మర్చిపోలేదని తెలిపారు. రైతులు భూములు మాత్రమే కాదు యావత్ రాష్ట్రానికి ఓ విశ్వాసాన్ని ఇచ్చారన్నారు.