Sunday, April 14, 2024

12 రాష్ట్రాల్లో మోడీ సుడిగాలి పర్యటన

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : లోక్‌సభ ఎన్నికల షెడ్యూల్ రావడానికి ముందే వచ్చే పది రోజుల్లో తెలంగాణతోపాటు మొత్తం 12 రాష్ట్రాలు/ కేంద్ర పాలిత ప్రాంతాల్లో ప్రధాని మోడీ సుడిగాలి పర్యటనలకు షెడ్యూల్ ఖరారైంది. మొత్తం 29 అభివృద్ధి కార్యక్రమాలకు ఆయన ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేయనున్నారు. ఏప్రిల్ మే నెలలో సార్వత్రిక ఎన్నికలు జరగనుండడంతో అభివృద్ధి , సంక్షేమ అజెండాపై దృష్టి సారించిన ప్రధాని , దేశం లోని పలు రాష్ట్రాల్లో రూ. లక్షల కోట్ల విలువైన అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొననున్నారు.

తెలంగాణ, తమిళనాడు, ఒడిశా, పశ్చిమబెంగాల్, బీహార్, జమ్ముకశ్మీర్, అస్సాం, అరుణాచల్ ప్రదేశ్, ఉత్తరప్రదేశ్, గుజరాత్, రాజస్థాన్, ఢిల్లీల్లో ప్రధాని పర్యటించనున్నట్టు అధికారులు వెల్లడించారు. మార్చి 4న సోమవారం తెలంగాణ లోని ఆదిలాబాద్‌లో పలు అభివృద్ధి ప్రాజెక్టులను ప్రారంభించనున్న ప్రధాని, ఆ తర్వాత తమిళనాడు లోని కల్పక్కమ్‌లో భారతీయ నభికియా విద్యుత్ నిగం లిమిటెడ్‌ను సందర్శించనున్నారు. మార్చి 5న తెలంగాణ లోని సంగారెడ్డిలో పలు ప్రాజెక్టులను ప్రారంభించి సభలో ప్రసంగిస్తారు.

అక్కడ నుంచి ఒడిశాకు వెళ్లి చండీఖోలేలో బహిరంగ సభలో ప్రసంగించిన తరువాత అక్కడి నుంచి బీహార్‌కు వెళ్లి బెట్టియాలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు ప్రారంభోత్సవాలు , శంకుస్థాపనలు చేస్తారని అధికారులు తెలిపారు. మార్చి 7న జమ్ముకశ్మీర్‌లో పర్యటించి సాయంత్రం తిరిగి ఢిల్లీకి చేరుకుంటారు. ఢిల్లీలో ఓ మీడియా ఈవెంట్‌లో పాల్గొంటారు. మార్చి 8న ఢిల్లీలో తొలిసారి జరిగే నేషనల్ క్రియేటర్స్ అవార్డుల కార్యక్రమంలో పాల్గొని, అదే రోజు సాయంత్రం అస్సాం వెళ్తారు. అస్సాం లోని జోర్హాట్‌లో లెజెండరీ అహోం ఆర్మీ కమాండర్ లచిత్ బోర్ఫుకాన్ విగ్రహాన్ని మోడీ ఆవిష్కరించనున్నారు. ఆ తరువాత జోర్హాట్‌లో బహుళ అభివృద్ధి ప్రాజెక్టుల ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేస్తారు.

అరుణాచల్ ప్రదేశ్ లోని వెస్ట్ కమెంగ్‌లో సెలా టన్నెల్‌ను ప్రారంభించిన తరువాత ఇటానగర్‌లో బహుళ అభివృద్ధి ప్రాజెక్టులను ప్రారంభిస్తారు. ఆ తరువాత పశ్చిమబెంగాల్ లోని సిలిగురిలో పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించి బహిరంగ సభల్లో ప్రసంగిస్తారు. మార్చి 10న ఉత్తరప్రదేశ్ లో పర్యటించనున్న మోడీ , అజంగఢ్‌లో పలు ప్రాజెక్టును జాతికి అంకితం చేయనున్నారని అధికారులు తెలిపారు.

ఆ మరుసటి రోజు ఢిల్లీలో పలు కార్యక్రమాల్లో పాల్గొంటారు. అనంతరం ద్వారకా ఎక్స్‌ప్రెస్ లోని హర్యానా సెక్షన్‌ను ప్రధాని ప్రారంభిస్తారు. అదే రోజు సాయంత్రం డిఫెన్స్ రీసెర్చి అండ్ డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్ కార్యక్రమంలో పాల్గొంటారు. మార్చి 12న గుజరాత్ లోని సబర్మతి , రాజస్థాన్ లోని పోఖ్రాన్‌ల్లో పలు కార్యక్రమాల్లో ప్రధాని పాల్గొంటారు. మార్చి 13న గుజరాత్, అస్సాంలో మూడు ముఖ్యమైన సెమీకండక్టర్ల ప్రాజెక్టును వీడియో కాన్ఫరెన్స్ ద్వారా శంకుస్థాపన చేస్తారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News