Friday, April 19, 2024

కొవిడ్‌పై పోరులో ప్రపంచానికి సాయం

- Advertisement -
- Advertisement -
PM Narendra Modi at G20 Summit
500 కోట్ల టీకాలతో ఇండియా రెడీ
జి 20 సదస్సులో ప్రధాని మోడీ
వ్యాక్సిన్లపై ఐరాస అనుమతికి అభ్యర్థన

రోమ్ : కొవిడ్‌పై పోరులో ప్రపంచానికి సాయం చేసేందుకు భారతదేశం ముందుకు వచ్చింది. ఈ దిశలో వచ్చే సంవత్సరం మొత్తం మీద 500 కోట్ల వ్యాక్సిన్ డోసులను ఉత్పత్తి చేస్తుంది. ఈ విషయాన్ని ఇక్కడ జరుగుతున్న జి 20 సదస్సులో భారత ప్రధాని నరేంద్ర మోడీ తెలిపారు. కరోనాను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు టీకానే అత్యుత్తమ సాధనం. దీనిని గుర్తించి భారతదేశం వ్యాక్సిన్లను అత్యధిక మోతాదులో శరవేగంతో ఉత్పత్తి చేస్తోందని ప్రధాని తెలిపారు. తమ దేశం నుంచి వచ్చే వ్యాక్సిన్లకు ప్రపంచ ఆరోగ్య సంస్థ సాధ్యమైనంత త్వరగా అనుమతులను అందించాలని ఆయన అభ్యర్థించారు. జి 20 సదస్సు శనివారం నాటి సెషన్‌లో గ్లోబల్ ఎకనామీ …గ్లోబల్ హెల్త్ అంశంపై చర్చ జరుగుతుండగా ప్రధాని జోక్యం చేసుకున్నారు. ప్రపంచ స్థాయిలో సాగుతోన్న కరోనాపై పోరులో భారతదేశం అన్ని విధాలుగా సాయం అందిస్తుందని ప్రకటించారు.

ట్రావెల్ ఈజీ పాలసీ

ఇక అంతర్జాతీయ ప్రయాణాలకు వీలు కల్పించాల్సి ఉంది. ఈ దిశలో టీకాల నమోదు పత్రాల సంక్లిష్టత లేకుండా చేయాల్సి ఉంటుందని అభిప్రాయపడ్డారు. ఒక దేశంలో పడ్డ టీకాలకు సంబంధించిన సర్టిఫికెట్లను అంతర్జాతీయ ప్రయాణాలకు ప్రాతిపదికగా అంగీకరించేందుకు సరైన అధికారిక అనుమతిని కల్పించేలా వ్యవస్థ ఉండాలని తెలిపారు. లేకపోతే అంతర్జాతీయ ప్రయాణాల క్రమంలో మునుపటి వాతావరణం నెలకొనడం అసాధ్యం అవుతుందన్నారు. సదస్సు దశలో ప్రస్తుత ప్రపంచ వ్యవస్థలో అమలుపర్చాల్సిన అంశాలపై పలు నిర్మాణాత్మక ప్రతిపాదనలు చేశారని ఆ తరువాత ప్రధాని కార్యాలయ వర్గాలు ప్రకటన వెలువరించాయి. భారతదేశంలో ఇప్పుడు సొంతంగా తయారు అవుతోన్న కొవాగ్జిన్, కొవిషీల్డ్‌లను విరివిగా వాడుతున్నారు. భారత్ బయోటెక్ ఉత్పత్తి అయిన కొవాగ్జిన్, సీరం ఇనిస్టూట్ తయారీ అయిన కొవిషీల్డ్‌లకు ప్రపంచ స్థాయి అత్యవసర వాడకానికి సంబంధించి ఐరాస దృష్టిసారించింది. నవంబర్ 3వ తేదీన ప్రపంచ ఆరోగ్య సంస్థ సాంకేతిక సలహా బృందం ఈ అంశంపై చర్చించేందుకు , ఒప్పు ముప్పుల అంచనాలపై తుది విశ్లేషణకు చేరేందుకు సమావేశం కానుందని విదేశాంగ కార్యదర్శి హర్షవర్థన్ శ్రింగాలా ప్రధాని హామీ నేపథ్యంలో తెలిపారు.

ఒన్ ఎర్త్ ..ఒన్ హెల్త్ విజన్

ప్రపంచవ్యాప్తంగా దేశాలు ఖండాలు లేకుండా కరోనా వైరస్ విస్తరించిపోయి అనారోగ్య తీవ్రతను పెంచింది. దీనిని ఓ గుణపాఠంగా తీసుకుని ప్రపంచ దేశాలన్ని కూడా ప్రపంచస్థాయి సార్వత్రిక ఆరోగ్య విధానాలను ఖరారు చేసుకోవాలని ప్రధాని మోడీ సూచించారు. దీని వల్ల ఇకపై భయానకంగా తలెత్తే ఎటువంటి వైరస్‌ను అయినా సకాలంలో గుర్తించేందుకు , వెంటనే స్పందించి నివారణ చర్యలు చేపట్టేందుకు ఆరోగ్యపరమైన జాగ్రత్తలు పాటించేందుకు వీలేర్పడుతుందని జి20 సదస్సు నేపథ్యంలో ప్రధాని తెలిపారు. కరోనా మహమ్మారి తీవ్రస్థాయి దశలోనే భారతదేశం 150కు పైగా దేశాలకు తగు ఔషధాల సరఫరా చేసిందని, ఈ విధంగా కరోనా దశలో అవసరం అయిన ప్రపంచ స్థాయి సరఫరాల వ్యవస్థ సక్రమంగా పనిచేసేందుకు దోహదపడిందని తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News