Saturday, May 11, 2024

పరకాల ఎవరికి పట్టం కడుతుందో..!?

- Advertisement -
- Advertisement -

వరంగల్ : వరంగల్, హనుమకొండ జిల్లాలో పరిధిలో విస్తరించి ఉన్న నియోకవర్గం పరకాల. జనరల్ స్థానమైన పరకాల నియోజకవర్గంలో 7 మండలాలున్నాయి. ఖిలా వరంగల్, గీసుకొండ, సంగెం మండలాలు వరంగల్ జిల్లాలో పరకాల, నడికూడ, ఆత్మకూర్, దామెర మండలాలు హనుమకొండ జిల్లాలో ఉన్నవి. మొత్తం 2,21,436 మంది ఓటర్లుగా నమోదై ఉన్నారు. వీరిలో 1,08,280 మంది పురుష ఓటర్లు, 1,13,154 మంది మహిళా ఓటర్లు ఉన్నారు. ప్రధాన రాజకీయ పార్టీలు సహా ఇండిపెండెంట్ అభ్యర్థులు 28 మంది పోటీ పడుతుండగా బిఆర్‌ఎస్, కాంగ్రెస్, బిజెపిల మధ్య త్రిముఖ పోటీ నెలకొన్నది. బిఆర్‌ఎస్ నుండి సిట్టింగ్ ఎంఎల్‌ఏ చల్లా ధర్మారెడ్డి, కాంగ్రెస్ నుండి రేవూరి ప్రకాష్‌రెడ్డి, బిజెపి నుండి డాక్టర్ కాళీ ప్రసాదరావులు హోరాహోరీగా తలపడుతున్నారు.

అభివృద్ధినే నమ్ముకున్న బిఆర్‌ఎస్ అభ్యర్థి చల్లాః
రెండు పర్యాయాలు ఎంఎల్‌ఏగా గెలుపొంది మూడవ న్యాయం అదృష్టాన్ని పరీక్షించుకుంటున్న బిఆర్‌ఎస్ అభ్యర్థి ధర్మారెడ్డి ప్రచారంలో దూసుకుపోతున్నారు. 2008 నుండి పరకాల నియోజకవర్గ ప్రజల మధ్యనే ఉంటూ 2014 నుండి ఎంఎల్‌ఏగా చేసిన అభివృద్ధి పనులను వివరిస్తూ ముఖ్యమంత్రి కెసిఆర్ అమలు చేసిన సంక్షేమ పథకాలను నమ్ముకొని మూడవ సారి అవకాశం ఇవ్వాలని ఓటర్లను అభ్యర్థిస్తున్నారు. ఉమ్మడి రాష్ట్రంలో ఎంతో వెనుకబాటుకు గురైన పరకాల నియోజకవర్గాన్ని తొమ్మిదిన్నరేళ్లలో రూ.5500 కోట్లతో అభివృద్ధి చేశానని ప్రచారంలో ప్రధానంగా ప్రస్తావిస్తున్నారు. చేసిన అభివృద్ధి కండ్ల ముందున్నది…చేయించిన అభ్యర్థి మీ ముందున్నడు…మళ్లీ ఒకసారి అవకాశం ఇవ్వాలని కోరుతున్నారు. సంస్థాగత పటిష్టత, ఆర్థికంగా బలవంతుడు కావడం, చేసిన అభివృద్ధి పనులు ధర్మారెడ్డికి కలిసొచ్చే అంశాలుగా ఉన్నాయి.

ప్రభుత్వ వైఫల్యాలు, 6 గ్యారంటీలను నమ్ముకొని కాంగ్రెస్ అభ్యర్థి.
కాంగ్రెస్ అభ్యర్తిగా రంగంలో ఉన్న రేవూరి ప్రకాష్‌రెడ్డికి మొదట్లో కొంత ప్రతికూల వాతావరణం కనిపించింది. కాంగ్రెస్ మేనిఫెస్టో అభయహస్తం, ఆరు గ్యారంటీలను ప్రజల్లోకి విస్రృతంగా తీసుకెళ్తుండడం ఆ పార్టీకి పొలిటికలవ మైలేజిని ఇస్తుంది. ప్రభుత్వ వైఫల్యాలను, సిట్టింగ్ ఎంఎల్‌ఏ పనితీరును విమర్శిస్తూ రేవూరి ప్రచారం సాగిస్తున్నారు. నర్సంపేట నుండి గతంలో మూడు పర్యాయాలు టిడిపి ఎంఎల్‌ఏగా చేసి బిజెపిలోకి వెళ్లి అనూహ్య పరిణామాల్లో కాంగ్రెస్‌లో చేరి పరకాల టికెట్‌ను తెచ్చుకున్న రేవూరికి పరకాల ప్రజలతో పెద్ద సంబంధాలు లేకపోయిన కాంగ్రెస్ అనుకూల పవనాలను నమ్ముకొని ప్రచారాన్ని ఉదృతం చేస్తున్నారు. బిఆర్‌ఎస్ పార్టీ అభ్యర్థికి ధీటుగా ఆర్థికంగా కూడా బలవంతుడు కావడంతో కాంగ్రెస్ శ్రేణులు ఉత్సాహంగా పనిచేస్తున్నారు.

బిసి నినాదంతో బిజెపి అభ్యర్థి..
బిజెపి అభ్యర్థి డాక్టర్ కాళీ ప్రసాదరావు ప్రధానంగా బిసి నినాదాన్ని నమ్ముకున్నారు. బిఆర్‌ఎస్, కాంగ్రెస్ అభ్యర్థులు ఇరువురు రెడ్డి సామాజిక వర్గానికి చెందినవారు కావడంతో బిసి సామాజిక వర్గానికి చెందిన కాళీ ప్రసాదరావు బిసిల ఓట్లపై ఆశలు పెట్టుకున్నారు. ఇటీవల కాలంలో విద్యార్థులు, యువతలో బిజెపి గ్రాఫ్ కొంత మేరకు పెరిగిందని అంచనా వేసుకున్న ఆ పార్టీ ఆర్థికంగా బలవంతుడైన కాళీ ప్రసాదరావును దింపి బిసి నినాదంతో ప్రచారాన్ని హోరెత్తిస్తోంది. విద్యార్థులు, నిరుద్యోగులు, యువత ఓట్ల పైనే ప్రధానంగా గురి పెట్టి ప్రచారం కొనసాగిస్తున్నారు. బిజెపి శ్రేణులు తమ ప్రచారంలో ప్రభుత్వ వైఫల్యాలను, సిట్టింగవ ఎంఎల్‌ఏ అవినీతికి పాల్పడ్డానని ఎండగడుతున్నారు.

టఫ్ ఫైట్..గెలుపుపై ఎవరి ధీమా వారిదే..
బిఆర్‌ఎస్, కాంగ్రెస్, బిజెపి ల మధ్య టఫ్ ఫైట్ కొనసాగుతుండగా పరకాల ఉత్కంఠ పోరుకు వేదికగా నిలిచింది. ముగ్గురు అభ్యర్థులు ఎక్కడా తగ్గకుండా పోటాపోటీగా ఎన్నికల ప్రచారం సాగిస్తూ మెజార్టీ ఓటర్లను రాబట్టేందుకు వ్యూహ ప్రతి వ్యూహాలను పన్నుతున్నారు. ఇప్పటికే ఆయా పార్టీ అగ్ర నేతలు కెసిఆర్, కెటిఆర్, రేవంత్‌రెడ్డి, అమిత్ షా, ఈటల రాజేందర్‌ల ప్రచార సభలతో కేడర్‌లో ఉత్సాహాన్ని నింపారు. ప్యాకేజీలు, తాయిలాలు, హామీలు గుప్పిస్తూ ఓటర్లను ఆకర్షించుకుంటున్న అభ్యర్థులు ముగ్గురు గెలుపుపై పూర్తి ధీమాను వ్యక్తం చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News