Thursday, April 18, 2024

ఎన్నికల కార్పొరేటీకరణ!

- Advertisement -
- Advertisement -

మన ప్రజాస్వామ్యానికి మూలస్తంభమైన ఎన్నికలు కార్పోరేటీకరణ చెంది గుత్త వ్యాపార సంస్థల విష కౌగిలిలోనికి జారిపోతున్నాయి. ఈనాడు తెలుగు నాట ఎంఎల్‌ఎగా ఎన్నిక అవ్వాలంటే రూ.100 కోట్లు, ఎంపిగా ఎన్నిక కావాలంటే కనీసం రూ. 300 కోట్లు ఖర్చు చేయాల్సిన దుస్థితికి జారిపోయాయి. ఎన్నికల సంఘం పెట్టిన రూ.20 లక్షలు ఖర్చు పరిమితిలో, ఖర్చు చేయాల్సిన తెల్లధనం స్థానంలో నల్లధన ప్రవాహం పరిమితి లేకుండా, ఎలాంటి ఆటంకాలు లేకుండా సులువైన మార్గాల్లో పేటియం, ఫోన్ పేం, గూగుల్ పే లాంటి యాప్‌ల ద్వారా ఓటర్లను ప్రలోభపెట్టే స్థాయికి దిగజారిపోయింది. గత అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికల్లో ఓటుకు ఒక్కో పార్టీ రూ.2 వేల నుంచి కొనుగోలు చేసిన పరిస్థితి నుండి ఇప్పుడు మునుగోడు ఉప ఎన్నికల తర్వాత ఆ రేటు 4 నుండి 5 వేల రూపాయలకు చేరిపోయింది.

నిరక్షరాస్యులు, రెక్కాడితే గాని డొక్కాడని పేదలకు ఓటుకు 10,000 రూపాయలు పెద్ద మొత్తమే మరి! ఇంకా దారుణమైన విషయం ఏమంటే కొందరు ఉద్యోగులు, ఉపాధ్యాయులు తమ పోస్టల్ బ్యాలెట్‌ను కూడా రాజకీయ పక్షాల వెంటబడి ఓటుకు 6000 రూపాయలకు అమ్ముకున్న దృష్టాంతాలు అనేకం చూశాం! ఖర్చును బట్టే ఆయా రాజకీయ పక్షాలకు ఓట్లు శాతం కూడా చూశాం. ఇక ప్రత్యర్థి కార్యకర్తల కొనుగోలు, తమ పార్టీ కార్యకర్తలను డబ్బుతో సంతృప్తి పరచడం, ప్రచారానికి, పాదయాత్రకు, సభలు, సమావేశాలు, ఊరేగింపులకు జనం తోలకం. ఇప్పుడు ఏ పార్టీకీ ఉచితంగా పని చేసే కార్యకర్తలు లేరంటే ఆశ్చర్యం లేదు? రోజుకు రూ. 500 నుండి రూ. 1000 నగదు, బిర్యానీ, మందు, రవాణా సమకూర్చనిదే జనం కదలని స్థితి ప్రస్తుతం ఉంది. ఇదే మునుగోడు మోడల్‌ను రానున్న శాసనసభ ఎన్నికల్లో అమలు జరిపేందుకు రాజకీయ పక్షాలు కొన్ని తొమ్మిది నెలల ముందు నుంచే మొదలు పెట్టాయి. ఆత్మీయ సమావేశాలు పేరుతో మందు, విందు రాజకీయాలు కొనసాగుతున్నాయి. ఈ తాయిలాలు ఇలా వుంటే రాజకీయ పక్షాలు పరోక్షంగా పెన్షన్లు, రుణమాఫీ, నగదు పంపిణీ పథకాలు రాష్ట్రాన్ని, దేశాన్ని రుణగ్రస్తం చేసి మరీ అమలు చేస్తున్నారు. ఇవి కూడా మరో రకమైన ప్రభావిత తాయిలాలుగా ఎన్నికల్లో మారిపోయాయి.

ఇప్పటికీ పాశ్చాత్య దేశాల్లో, సోషలిస్టు దేశాల్లో నాణ్యమైన ఉచిత విద్య, వైద్యం ప్రజలకు లభిస్తుంది. ఇవి ఆయా కుటుంబాలు ఎదుగుదలకు, రాష్ట్రం, దేశం అభివృద్ధికి మూలమైన అంశాలు. కానీ, మన దేశంలో ప్రభుత్వాలు వీటికి ప్రాధాన్యం ఇవ్వడం లేదు? కారణం ఇవి రెండూ ఇన్‌స్టంట్ ప్రయోజనాల జాబితాలో లేవు! పైగా ప్రభుత్వ రంగంలో ఉండాల్సిన ఈ రెండు రంగాలను మన పాలకులు బాధ్యతల భారాన్ని వదిలించుకొని కార్పొరేట్ శక్తులకు ఎప్పుడో ధారాదత్తం చేశారు. ఇప్పుడు విదేశాల్లో స్థిరపడాలని చూస్తున్న మన యువత ఆలోచన ఆయా దేశాల్లో విద్య, వైద్య రంగాల్లో నాణ్యమైన ఉచిత సేవలు లభించడమే ప్రథమ ప్రాధాన్యతగా ఆలోచిస్తున్నారు? తమ పిల్లల భవిష్యత్తుకు అవే కనీసం సోపానాలుగా భావిస్తున్నారు. యువత వలసల మూలంగా పరిస్థితి, దేశ భవిష్యత్తు అగమ్యగోచరంగా తయారైంది?.

ఈ స్థితిని పాలకులు ఎవరూ పట్టించుకోవడం లేదు? ఎన్నికల వ్యవస్థ ఇంతగా దిగజారటానికి ప్రధాన కారణం రాజకీయ పక్షాలు ఎన్నికల నిధులు, నల్లధనం సమకూర్చుకోవడంలో పొందిన నైపుణ్యమే అని చెప్పక తప్పదు! గతంలో రాజకీయ పక్షాలకు సింహ భాగం నిధులు స్థానిక వ్యాపారులు, కాంట్రాక్టర్లు నుండి సమీకరించుకునేవారు, ప్రస్తుతం వారిని స్థానిక నేతలకు ఆదాయ వనరుగా వదిలివేశారు. స్థానిక పోలీసు స్టేషన్, రెవెన్యూ, అభివృద్ధి శాఖలపై పట్టు, గుత్తాధిపత్యం వారి స్థానిక నేతలకు కట్టబెట్టారు. ప్రజలకు జవాబుదారీ కావలసిన ఆ సంస్థలు ఇప్పుడు అవినీతికరంగా మారటానికి, ఏకపక్షంగా వ్యవహరించడానికి పాలక పక్షాల నిరంకుశ అధికారాలే కారణం! ఇకపోతే రాజకీయ పక్షాలకు ఎన్నికల్లో ఖర్చు చేసే ఈ నల్లధన ప్రవాహం ఎక్కడిది అనే ప్రశ్నకు ఏకైక సమాధానం ఇప్పుడు కార్పొరేట్ శక్తులే! ప్రజలు దీర్ఘకాలిక పన్నులతో ఏర్పరచుకున్న వ్యవస్థలను లీజులు పేరుతో, అమ్మకం పేరుతో కార్పొరేట్ శక్తులకు ధారాదత్తం చేస్తున్నారు. లక్షల కోట్లు అప్పులు చేసి కడుతున్న కొన్ని ప్రాజెక్టులు, అభివృద్ధి పనుల్లో సింహభాగం కమీషన్లు రూపంలో తిరిగి నల్లధనంగా రాజకీయ పక్షాలు చేతికి, ఎన్నికల గెలుపుకి అవసరమైన నల్లధనం చేకూరుతుంది.

గతంలో మాదిరిగా చిల్లరగా చేయిచాచవలసిన పరిస్థితి రాజకీయ పక్షాలకు లేకుండా, ఎన్నికల్లో గట్టెక్కించే నమ్మకమైన మిత్రులను, కార్పొరేట్ శక్తులను రాజకీయ పక్షాలు సమీకరించుకుంటున్నారు. ఇప్పుడు మీడియా ప్రచారం నుండి, రాజకీయ పక్షాల ఆర్థిక అవసరాలు పరిపూర్ణం చేసే బాధ్యత కార్పొరేట్ సంస్థలు నెత్తికి ఎత్తుకుంటూ ఉన్నాయి. ఈ కుంభకోణాలు, రాజకీయ పక్షాల నీతి వాక్యాలు అన్నీ పైకి పరస్పరం కొట్లాడుతున్న డ్రామాలు మాత్రమే! రాజకీయ పక్షాలు తన వెనుక ఉన్న కార్పొరేట్ దిగ్గజాలు బలోపేతం చేయడానికి ప్రజల ఆస్తులు, అభివృద్ధిని సైతం పణంగా పెట్టడానికి వెనుకాడడం లేదు? ఇదంతా ప్రజలు గ్రహించిన రోజు మాత్రమే మార్పు సాధ్యం.

ఇక రాజకీయాలను కార్పొరేట్ మాయ కమ్మేస్తూ ఉంటే మన ప్రజాస్వామ్యం మనుగడ ఏమిటి అనే ప్రశ్న తలెత్త వచ్చును? దీనికి నేనో ఉదాహరణ వివరిస్తాను. బీమాకోరేగావ్ కేసులో దేశంలోని చాలా మంది మేధావులు అరెస్టు అయ్యారు. వారు విచారణ తంతు, అరెస్టు చేసిన విధానం చూసిన దేశంలో వివిధ రంగాల్లో నిష్ణాతులైన 56 మంది మేధావులు, వీరిలో అధికులు రాజ్యం గౌరవించి పద్మభూషణ్ లాంటి బిరుదులు పొందిన వారే! కేంద్ర హోం శాఖకు 56 మంది సంతకాలతో బీమాకోరేగావ్ అరెస్ట్‌లు అన్యాయం, వాటిని పరిశీలించి విడుదల చేయాలి అనే డిమాండ్‌తో వినతి పత్రం సమర్పించారు. అయితే, అవినీతి పత్రంలో సంతకాలు చేసిన వారిపై ఎఫ్‌ఐఆర్ నమోదుకు కేంద్ర హోం శాఖ ఆదేశించింది.
ఈ చర్యను నిరసిస్తూ ఖమ్మంలో వివిధ ఉద్యమాల్లో పాల్గొన్న ప్రముఖ ఉద్యమకారులు, ప్రజాస్వామ్యవాదులు స్థానిక అంబేడ్కర్ విగ్రహం చుట్టూ మూతికి నల్ల గుడ్డలు ధరించి ప్రజాస్వామ్యానికి సంకెళ్ళేనా? అనే పోస్టర్లు ప్రదర్శించి 10 నిముషాలు నిరసన తెలిపారు.

స్థానిక పోలీసు కానిస్టేబుల్ నుంచి ప్రజలకు ఈ ప్రజాస్వామ్యవాదులు అసౌకర్యం కల్పించారని ఫిర్యాదు తీసుకొని, కేసు నమోదు చేసి కోర్టు చుట్టు తిప్పుతున్నారు. ఇది నేటి ప్రజాస్వామ్యంలోని నేతిబీర ప్రజాస్వామ్యం! నిరసన తెలపడం నేరం, పోస్టర్ అంటించడం నేరం, చివరకు దిష్టిబొమ్మ దగ్ధం చేసినా నేరం, వ్యతిరేకంగా మాట్లాడినా నేరం, కేసులు పెట్టి జైళ్ళు, కోర్టుల చుట్టు తిప్పుతున్న స్థితిలో ప్రజాస్వామ్యం మనుగడ ఎలా? ప్రస్తుత ఎన్నికల్లో ఇలాంటి వారి పోటీని కూడా ఊహించే పరిస్థితి నేడు లేదు! చివరకు ఎన్నికల వ్యవస్థను, రాజకీయ పక్షాలు, దైనందిన అభివృద్ధి పేరుతో మొత్తం కార్పొరేట్ కనుసన్నల్లోకి మార్చి, పరోక్షంగా ఎన్నికల తెర మాటున వారే కీలకం కానున్నారు. ప్రజలారా! తస్మాత్ జాగ్రత్త! మీ ముందు కనిపించే వాగ్దానాసుర నేతలు కార్పొరేట్ శక్తుల ముందు మోకరిల్లిన తోడు దొంగలు! మన పిల్లలు, భవిష్యత్తు తరాలకు మనమిచ్చే రాజకీయ వారసత్వం ఓటు విలువ ఇది కాదని ఇదమిత్థంగా తేల్చి చెప్పాలసిన అవుసరం ఉంది. ఆ మంచి రోజులు కోసం ఆశతో ఎదురు చూద్దాం.

యన్.తిర్మల్
9441864514

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News