Thursday, November 30, 2023

నేనంటే… నేనే!

- Advertisement -
- Advertisement -

సంగారెడ్డి బిఆర్‌ఎస్ నేతలతలో మాట
అసెంబ్లీ టికెట్ ప్రకటించినా..ఆగని వాక్కులు
మాణిక్యం వ్యాఖ్యలతో మరింత గందరగోళం

మన తెలంగాణ/సంగారెడ్డి బ్యూరో: సంగారెడ్డి బిఆర్‌ఎస్ అభ్యర్థిని నేనంటే.. నేనే..! అంటూ నేతలు చెబుతున్న మాటలు ఆ పార్టీలో కొంత గందరగోళానికి దారి తీస్తున్నాయి. ఈ సారి ఖచ్చితంగా సంగారెడ్డి అసెంబ్లీ నియోజకవర్గంలో భారీ మెజార్టీతో గెలవాలన్న అధిష్టానం ఆలోచనకు ఈ వ్యాఖ్యలు గండి కొడుతున్నాయి. అంతిమంగా ఈ పరిణామాలు ఎక్కడికి దారి తీస్తాయోనన్న చర్చ జరుగుతోంది. కార్యకర్తలకు, నేతలకు ఈ పరిణామాలు ఇబ్బందికరంగా మారుతున్నాయి. సంగారెడ్డి బిఆర్‌ఎస్ అభ్యర్థిగా చింత ప్రభాకర్‌ను సిఎం కేసీఆర్ కొద్ది రోజుల క్రితం ప్రకటించారు. దీంతో ఆయన ప్రజల్లోకి మరింత దూ కుడుగా వెళ్తున్నారు.

ఈ తరుణంలో చివరి క్షణంలోనయినా పార్టీ టికెట్ తనకు వస్తుందని సిడిసి మాజీ చైర్మన్ మాణిక్యం అంటున్నారు. శుక్రవారం తన పుట్టిన రోజును భారీగా నిర్వహించడమే కాకుండా తానే బిఆర్‌ఎస్ అభ్యర్థినని ప్రకటించారు. ఇప్పటికే చింత ప్రభాకర్ సంగారెడ్డి అసెంబ్లీ అభ్యర్థిగా అన్ని వర్గాల ప్రజల్లోకి వెళ్లారు. అందరినీ కలుస్తున్నారు. ముఖ్యులు, అసంతృప్తనేతలతో మంతనాలు జరుపుతున్నారు. వివిధ వర్గాలు, గ్రూపుల వారితో సమావేశాలు నిర్వహిస్తున్నారు. పోయిన సారి స్వల్ప ఓట్ల తేడాతో ఓడిపోయిన కారణంగా…ఈ సారి అలాంటి ఫలితంగా తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నారు. కొన్ని సామాజిక వర్గాలు పార్టీకి దూరంగా ఉన్న సంగతిని గ్రహించి, వారితో సఖ్యతకు ప్రయత్నిస్తున్నారు. ప్రత్యేక వ్యూహం ద్వారా ఈ సారి ఖచ్చితంగా గెలిచేందుకు అనారోగ్యాన్ని కూడా పక్కన పెట్టి పర్యటిస్తున్నారు.

ఆర్థిక, వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు ఆదేశాలను పాటిస్తూ.. ఎప్పటికప్పుడు తగిన ప్రణాళికతో కదులుతున్నారు. ఈ తరుణంలో డిసిసిబి వైస్ ఛైర్మన్ మాణిక్యం చర్యలు చర్చనీయాంశంగా మారాయి. కొద్ది నెలలుగా ఆయన సంగారెడ్డి బిఆర్‌ఎస్ టిక్కెట్ తనకే ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. నియోజకవర్గ వ్యాప్తంగా పర్యటిస్తున్నారు. వివిధ వర్గాల వారిని కలుస్తున్నా రు. చింత ప్రభాకర్ వ్యతిరేకులను కూడగడుతున్నారు. గుడులకు, బడులకు, జాతరలకు, బాధితులకు ఆర్థిక సాయాన్ని ప్రకటిస్తున్నారు. పుట్టిన రోజు వేడుకలను భారీ ఎత్తున నిర్వహించారు. మంత్రి హరీష్‌రావును ఆహ్వానించారు. చింత ప్రభాకర్‌కు కూడా ఆఖరి నిమిషంలో ఆహ్వా న పత్రికను అందించారు.

పెద్ద ఎత్తున ఊరేగింపు నిర్వహించడంతో పాటు తానే సంగారెడ్డి బిఆర్‌ఎస్ అభ్యర్థినని మరో సారి ప్రకటించారు. దీంతో పార్టీ శ్రేణులు నివ్వెర పోయా యి. చింత ప్రభాకర్‌ను పార్టీ అభ్యర్థిగా ప్రకటించిన తర్వాత కూడా మాణిక్యం ఇంకా గట్టిగా మాట్లాడిన తీరు చర్చకు దారి తీస్తోంది.ఈ మాటల కారణంగానే మంత్రి హరీశ్‌రావు మాణిక్యం పుట్టిన రోజు వేడుకలకు హాజరు కాలేదని తెలుస్తోంది. కొద్ది దూరం వచ్చిన తర్వాత మాణిక్యం వ్యాఖ్యల సంగతి తెలియడంతో మంత్రి వెను తిరిగి వెళ్లిపోయారని, మాణిక్యం వ్యాఖ్యల పట్ల ఒకింత అసహనానికి గురయ్యారని తెలిసింది. తాను ఈ వేడుకలకు హాజరయినట్లయితే,పార్టీ శ్రేణులకు తప్పుడు వెళతాయన్న అభిప్రాయంతో మంత్రి ఉన్నారని తెలుస్తోంది. అన్ని విధాలుగా ఆలోచించిన తర్వాతనే, ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఒక బిసి అభ్యర్థిని, అది కూడా బలమైన వ్యక్తిని బరిలోకి దింపాలన్న లక్షంతోనే చింత ప్రభాకర్‌ను ఎంపిక చేశారని ఆయన అభిమానులు అంటున్నారు. మంత్రి హరీశ్‌రావు ఆశీస్సులతోనే ప్రభాకర్ పేరు ఖరారయిందని,అలాంటప్పుడు భిన్నాభిప్రాయాలు ఎందుకు వస్తున్నాయని మరి కొందరు చర్చించుకుంటున్నారు.

పోయిన సారి సంగారెడ్డిలో ఓడిపోయామని, ఈ సారి జిల్లాలోని మిగతా స్థానాలతో పాటు ఖచ్చితంగా సంగారెడ్డిలో కూడా గెలవాలన్న కసితో మంత్రి హరీష్‌రావు ఉన్నారు. వివిధ సందర్భాల్లో ఆయన ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.ఇటీవల కొందరు ఉద్యమ కారులు మంత్రిని కలిసిన సందర్భంలో కూడా వారికి అర్థమయ్యేలా వివరించడంతో పాటు చింత ప్రభాకర్ గెలవాల్సిన అవసరాన్ని… స్పష్టంగా వెల్లడించారు.

దీంతో ఉద్యమ కారులు కూడా సరే అన్నారని తెలిసింది.ఇంకో వైపున యువ నేత ఆత్మకూరు నగేష్ కూడా అసెంబ్లీ టికెట్‌పై భరోసాతో ఉన్నారు.ఎన్నికల నోటిఫికేషన్ వచ్చి, నామినేషన్ సమర్పించే నాటికి ఏమైనా జరగవచ్చని అంటున్నారు. బిఫామ్ ఇచ్చిన తర్వాత సిఫామ్ కూడా ఉంటుందని చెబుతున్నారు. ఆఖరి నిమిషం వరకు తన ప్రయత్నాలు కొనసాగుతాయని , ఈ విషయంలో వెనకడుగు వేసే ప్రసక్తే లేదని అంటున్నారు.పరిస్థితులు చాలా మారుతాయని, తనకు అవకాశం వస్తుందని ఆయన దీమా వ్యక్తం చేస్తున్నారు.

జిమ్మిక్కులు సాగవంటున్న బుచ్చిరెడ్డి..
ఇదిలా ఉంటే…ఎవరు ఎన్ని జిమ్మిక్కులు చేసినప్పటికీ..సంగారెడ్డి బిఆర్‌ఎస్ అభ్యర్థిగా చింత ప్రభాకర్ మాత్రమే ఉంటారని, ఈ విషయంలో ఎలాంటి సందేహం అక్కర్లేదని సిడిసి ఛైర్మన్ కాసాల బుచ్చిరెడ్డి అన్నారు. సదాశివపేటలో నిర్వహించిన గురుపూజోత్సవం కార్యక్రమంలో బుచ్చిరెడ్డి మాట్లాడుతూ సిఎం కేసీఆర్ అన్ని రకాలుగా ఆలోచించిన తర్వాతనే మాజీ ఎమ్మెల్యే చింత ప్రభాకర్ పేరును ప్రకటించినారని అన్నారు.

అయినప్పటికీ కొందరు నాయకులు ప్రజల్లో అనుమానాలు కలిగిస్తున్నారని అన్నారు. ప్రజలను కన్పూజ్ చేయడం సరి కాదన్నారు. ఒక్క సారి అభ్యర్థిని ప్రకటించిన తర్వాత మార్పులు అసాధ్యమని అన్నారు. ఎలాంటి జిమ్మిక్కులు పనికి రావన్నారు. సంగారెడ్డికి సరైన అభ్యర్థి చింత ప్రభాకర్ అని ఆయన స్పష్టం చేశారు. చేనేత కార్పొరేషన్ చైర్మన్ చింత ప్రభాకర్ సమక్షంలోనే ఆయన ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News