Wednesday, July 24, 2024

రెండు, మూడు రోజుల్లో రైతు రుణమాఫీ మార్గదర్శకాలు: పొంగులేటి

- Advertisement -
- Advertisement -

ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న కెసిఆర్ అసెంబ్లీకి రావాలి…
ఈనెలాఖరులో రాష్ట్ర బడ్జెట్‌కు ఆమోదం తెలుపుతాం
బిఆర్‌ఎస్‌ఎల్పీని కాంగ్రెస్‌లో విలీనం చేసే వరకు చేరికలు…!
రెండు, మూడురోజుల్లో రైతు రుణమాఫీ మార్గదర్శకాలు విడుదల
ప్రజాభిప్రాయ సేకరణ తరువాతే రైతు భరోసా
గత ప్రభుత్వంలో రైతుబంధు పక్కదారి…
జర్నలిస్టులకు కచ్చితంగా ఇళ్ల స్థలాలను కేటాయిస్తా
ఆఫీస్‌స్పేస్‌కు విపరీతమైన డిమాండ్ పెరిగింది
5 సంవత్సరాల్లో 20 లక్షల ఇందిరమ్మ ఇళ్లను పేదలకు పంపిణీ చేస్తాం

మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి చిట్‌చాట్

మనతెలంగాణ/హైదరాబాద్: రెండు, మూడురోజుల్లో రైతు రుణమాఫీకి సంబంధించి మార్గదర్శకాలను విడుదల చేస్తామని రెవెన్యూ, హౌసింగ్, సమాచార పౌరసంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి పేర్కొన్నారు. సుమారుగా రుణమాఫీకి రూ.30 వేల కోట్ల పైచిలుకు నిధులు అవసరమని ఆగష్టు 15వ తేదీ లోపు దీనిని అమలు చేస్తామని ఆయన తెలిపారు. ఇప్పటికే రూ.8 నుంచి రూ.9 వేల కోట్ల నిధులను సమకూర్చుకున్నామని మిగతా నిధులను వివిధ మార్గాల్లో సేకరించడానికి ప్రయత్నిస్తున్నామని ఆయన తెలిపారు. మంగళవారం మంత్రి పొంగులేటి సచివాలయంలోని ఆయన చాంబర్‌లో విలేకరులతో చిట్‌చాట్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతు భరోసాకు సంబంధించి ప్రజాభిప్రాయ సేకరణను ఖమ్మం నుంచి చేపడుతున్నామని ప్రజలు, మేథావుల నుంచి వారి అభిప్రాయాలను సేకరించి విధి, విధానాలను రూపొందిస్తామని ఆయన తెలిపారు. ఉమ్మడి 10 జిల్లాలో ప్రజాభిప్రాయ సేకరణ నిర్వహించి అనంతరం దానిని అమలు చేస్తామని మంత్రి పేర్కొన్నారు.

రైతుభరోసా పేదలకు అందాలి…
ముఖ్యంగా రైతుభరోసా పేదలకు అందాలని, గత ప్రభుత్వంలో ఇది పక్కదారి పట్టిందని ఆయన పేర్కొన్నారు. తాను గత పదేళ్లలో ఎన్నడూ (గత ప్రభుత్వంలో రైతుబంధు) తీసుకోలేదని ఒకవేళ అధికారులు చెక్కులు ఇచ్చినా తాను వాటిని రిటర్న్ చేసినట్టు ఆయన తెలిపారు. అలా వందల ఎకరాల రైతులు చేస్తే పేద రైతులకు ఉపయోగకరంగా ఉంటుందని ఆయన పేర్కొన్నారు. గత ప్రభుత్వంలో 6 లక్షల ఎకరాలకు పైగా భూములకు రైతుబంధును అప్పటి ప్రభుత్వం ఇచ్చిందని, అసలు ఆ భూములకు రైతుబంధు ఇవ్వడం తప్పని, తాము అధికారంలోకి రాగానే ఈ విషయాన్ని గుర్తించామని ఆయన తెలిపారు.

ఈ 6 లక్షల ఎకరాల పనికిరాని భూముల్లో ప్రాజెక్టుల కోసం ప్రభుత్వం సేకరించిన భూములతో పాటు నేషనల్ హైవే, రాష్ట్ర హైవేల కోసం సేకరించిన భూములు, వ్యవసాయానికి యోగ్యం కాని భూములు, నాలా కన్వర్షన్ అయిన భూములు ఉన్నాయని, అయినా అప్పటి ప్రభుత్వం ఆ భూములకు రైతుబంధును చెల్లించి ప్రభుత్వాన్ని అప్పుల పాలు చేసిందని ఆయన ఆరోపించారు. దీనివల్ల అప్పటి ప్రభుత్వం సంవత్సరానికి సుమారుగా రూ.600 కోట్ల వరకు అదనంగా అనర్హులకు రైతుబంధును చెల్లించిదని, ప్రస్తుతం ఈసారి అలా జరగకుండా తాము అన్ని భూముల వివరాలను సేకరించిన తరువాతే రైతుభరోసాను అమలు చేస్తామని ఆయన తెలిపారు. ప్రస్తుతం తమ ప్రభుత్వం కౌలు రైతులను కాపాడుకునేందుకు కృతనిశ్చయంతో ముందుకు వెళుతుందని మంత్రి తెలిపారు.

రానున్న రోజుల్లో అప్పులు, వడ్డీలపై ఎలా ముందుకెళ్లాలన్న….
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటివరకు గత ప్రభుత్వం చేసిన అప్పులు రూ.7 లక్షల కోట్లకు సుమారుగా రూ.26 వేల కోట్లను అప్పులు, వడ్డీలకు కలిపి చెల్లించామని మంత్రి పొంగులేటి తెలిపారు. గత ప్రభుత్వం తెచ్చిన అప్పులకు రానున్న రోజుల్లో అసలు, వడ్డీలు ఎలా చెల్లించాలి, ప్రతినెలా ఈ చెల్లించడం వల్ల మిగతా పథకాలు, అభివృద్ధి పనులకు ఇబ్బంది కలుగుతుందని అలా కాకుండా ఎలా వ్యవహారించాలన్న దానిపై కూలకుషంగా చర్చిస్తున్నామని ఆయన తెలిపారు.

త్వరలోనే రెవెన్యూ చట్టాన్ని సవరిస్తాం
త్వరలోనే రెవెన్యూ చట్టాన్ని సవరిస్తామని, ధరణిలో పలు మార్పులు తీసుకొస్తామని మంత్రి పొంగులేటి తెలిపారు. గత ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ ధరణిలో చాలావరకు తప్పులు ఉన్నాయని దీనివల్ల అనేకమంది ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని ఆయన పేర్కొన్నారు. ప్రస్తుతం ధరణిలో 33 మ్యాడ్యూల్స్ ఉన్నాయని, ఒకదాంట్లో దరఖాస్తు చేస్తే మరో దాంట్లో తెలియదని దీనివల్ల అధికారులు ఆ దరఖాస్తులను రిజెక్ట్ చేస్తున్నారని అధికారుల నిర్లక్షం వల్ల రైతులకు ఇబ్బంది కలుగుతుందని మంత్రి పేర్కొన్నారు. రానున్న రోజుల్లో అలా కాకుండా అన్నింటికి ఒకే దరఖాస్తు పెట్టి ఆ దరఖాస్తును ఎలా చేయాలన్న దానిపై తహసీల్దార్, ఆర్‌డిఓలు నిర్ణయం తీసుకునేలా రూపొందిస్తున్నామని ఆయన తెలిపారు.

రైతు కచ్చితంగా అప్పీల్ చేసుకునేలా తాము చూస్తామని, ఒకవేళ అధికారులు దరఖాస్తులను తిరస్కరిస్తే దానికి కచ్చితమైన కారణాలు వివరించాలని అధికారులకు సూచించామని మంత్రి తెలిపారు. ఇలా రెవెన్యూ చట్టంలో సవరణలు చేసి సరికొత్తగా దానిని అమల్లోకి తీసుకొస్తామని ఆయన పేర్కొన్నారు. ప్రస్తుతం తాము అధికారంలోకి వచ్చే నాటికి సుమారుగా 2,60,000ల ధరణి దరఖాస్తులు పెండింగ్ ఉన్నాయని లోక్‌సభ ఎన్నికల నాటికి లక్ష దరఖాస్తులను అధికారులు పరిష్కరించారని, లోక్‌సభ ఎన్నికలు రావడం కోడ్ ఉండడంతో మరో లక్ష దరఖాస్తులు పెరిగాయని మళ్లీ అన్ని దరఖాస్తులను పరిష్కరించేలా అధికారులు నిరంతరం కృషి చేస్తున్నారని, ఎప్పటికప్పుడు దానిపై సమీక్షలు నిర్వహిస్తున్నామని మంత్రి పొంగులేటి తెలిపారు.

రెవెన్యూ వ్యవస్థను కాపాడుకుంటాం..
ధరణిలో రిజిస్ట్రేషన్ కోసం రైతులు డబ్బులు చెల్లించి ఆ రిజిస్ట్రేషన్ రద్దు చేసుకున్నప్పుడు వారికి తిరిగి ఇవ్వాల్సిన డబ్బులు నాలుగేళ్లుగా పెండింగ్‌లో ఉన్నాయని, త్వరలోనే వాటిని ఆయా రైతులకు తిరిగి చెల్లిస్తామని మంత్రి పేర్కొన్నారు. రానున్న రోజుల్లో ఆరునెలల్లోపే తిరిగి ఈ రిజిస్ట్రేషన్ డబ్బులను చెల్లించేలా విధి, విధానాలను రూపొందిస్తామని ఆయన తెలిపారు. గత ప్రభుత్వం విఆర్‌ఏ, విఆర్‌ఓలను వేర్వేరు శాఖల్లోకి బదిలీ చేసిందని దానివల్ల చాలామంది ఉద్యోగులు ఇబ్బందులు పడుతున్నారన్నారు. దీంతోపాటు ప్రతి రెవెన్యూ గ్రామంలో ప్రభుత్వ భూములను కాపాడుకోవడంలో ప్రస్తుతం ఇబ్బందులు తలెత్తుతున్నాయని వాటి పరిరక్షణకు సమస్యలు తలెత్తుతున్నాయని ఆయన తెలిపారు. ఈ నేపథ్యంలోనే రెవెన్యూ వ్యవస్థను కాపాడుకునేలా ప్రభుత్వం చర్యలు చేపడుతోందని ఆయన తెలిపారు.

రెసిడెన్షియల్ అమ్మకాల్లో వృద్ధి పెరగాలి
ఓఆర్‌ఆర్, ఆర్‌ఆర్‌ఆర్ రోడ్లకు అన్ని రోడ్లను అనుసంధానం చేసేలా చర్యలు చేపట్టామని మంత్రి పొంగులేటి పేర్కొన్నారు. రోడ్ల కనెక్టివిటీ వల్ల పెట్టుబడులు సైతం వస్తాయని, రానున్న రోజుల్లో ట్రాఫిక్‌కు ఇబ్బందులు తలెత్తకుండా చూసుకోవచ్చని ఆయన తెలిపారు. తాము అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటివరకు ఆఫీస్‌స్పేస్‌కు విపరీతమైన డిమాండ్ పెరిగిందని, రెసిడెన్షియల్‌లో మాత్రం వృద్ధి పెరగాల్సి ఉందని ఆయన పేర్కొన్నారు. గత సంవత్సరం కన్నా ప్రస్తుతం ఆఫీస్‌స్పేస్ లీజుకు డిమాండ్ పెరగడం విశేషమన్నారు. రాష్ట్రం నలువైపులా మరింత అభివృద్ధి చేస్తే పెట్టుబడులు అధికంగా వస్తాయని ఆయన తెలిపారు. అమ్మ ఆదర్శ పాఠశాలల కోసం ప్రభుత్వం ఇప్పటికే రూ.683 కోట్లను విడుదల చేసిందని మంత్రి పేర్కొన్నారు. టీచర్ల బదిలీలను పారదర్శకంగా నిర్వహించామని ఆయన తెలిపారు.

సర్వే నెంబర్‌ల వారీగా మార్కెట్ విలువలను పునఃసమీక్షిస్తాం
భూముల మార్కెట్ విలువలకు సంబంధించి 2021, 2022 ఆర్థిక సంవత్సరంలో రెండుసార్లు గత ప్రభుత్వం భూముల విలువలను అడ్డగోలుగా పెంచిందని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు. తాము ఈసారి అలా కాకుండా శాస్త్రీయ పద్ధతిలో భూముల విలువలను పెంచాలని నిర్ణయించామని ఆయన తెలిపారు. కొన్నిచోట్ల ఎక్కువ ధరలు ఉండగా మరికొన్ని చోట్ల తక్కువ ధరలు ఉన్నాయని అలా కాకుండా అసలు ఆయా ప్రాంతాల్లో ఎంత ధర ఉండాలి, ఎంత పెంచాలన్న దానిపై అధికారులు కసరత్తు చేస్తున్నారని మరోసారి దానిపై చర్చించిన తరువాత భూ విలువలను పెంచుతామని మంత్రి పొంగులేటి తెలిపారు. ఈ నేపథ్యంలో సర్వే నెంబర్‌ల వారీగా భూముల విలువలను పునఃసమీక్షిస్తామని ఆయన తెలిపారు. వ్యవసాయ భూములకు సంబంధించి గతంలో ఎకరానికి లక్ష రూపాయలు ఉండేదని, ప్రస్తుతం కొన్ని చోట్ల కోటి రూపాయలు ఉందని, అలాంటి చోట్ల ఎంత పెంచితే బాగుంటుంది, పేదలకు ఇబ్బంది కలగకుండా చూడడంతో పాటు ప్రభుత్వానికి ఆదాయం వచ్చేలా తాము ఈసారి చర్యలు చేపట్టామని ఆయన తెలిపారు.

ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి పలు రాష్ట్రాల్లో అధికారుల అధ్యయనం
ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి పలు రాష్ట్రాల్లో అధికారుల బృందం అధ్యయనం చేస్తోందని మంత్రి పొంగులేటి తెలిపారు. ఇప్పటికే ఎపి, ఉత్తరప్రదేశ్‌లో అధికారులు పర్యటించారని, మరో మూడు రాష్ట్రాల్లో అధికారుల బృందం అధ్యయనానికి వెళ్లిందని త్వరలోనే అధికారుల బృందం ఇచ్చే నివేదిక ఆధారంగా తాము విధి, విధానాలను రూపొందిస్తామని ఆయన తెలిపారు. ప్రతి సంవత్సరం 4,50,000 ఇందిరమ్మ ఇళ్లను ఇవ్వాలని నిర్ణయించామని, రానున్న 5 సంవత్సరాల్లో 20,00,000 ఇళ్లను పేదలకు ఇవ్వాలని నిర్ణయించామని ఆయన పేర్కొన్నారు.

అనర్హులకు రేషన్‌కార్డులు
ప్రజావాణీలో ఎక్కువగా ఆసరా పింఛన్‌లు, రేషన్ కార్డుల గురించే దరఖాస్తులు వస్తున్నాయని మంత్రి పొంగులేటి పేర్కొన్నారు. లక్షల్లో అనర్హులకు గతంలో రేషన్‌కార్డులు ఇచ్చారని, చాలామంది ఆరోగ్యశ్రీ కార్డు గురించే తెల్లరేషన్ కార్డులను తీసుకున్నారని దీనివల్ల పేదలకు పంపిణీ చేసే రేషన్ పక్కదారి పడుతుందని తాము గుర్తించామని మంత్రి పొంగులేటి తెలిపారు. ఈసారి అలా కాకుండా తెల్లరేషన్ కార్డుకు, ఆరోగ్యశ్రీకి సంబంధం లేకుండా దీనిని జారీ చేయాలని నిర్ణయించామని, వేరే రాష్ట్రాల్లో కార్డుల జారీ వేర్వేరుగా ఉందని మంత్రి తెలిపారు. ఆ దిశగా ప్రభుత్వం ఆలోచిస్తుందని దీనిపై త్వరలోనే ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని ఆయన పేర్కొన్నారు. ఒకవేళ ఆరోగ్య శ్రీ గురించి కార్డును జారీ చేస్తే ప్రస్తుతం కేంద్రంలో ఉన్న ఆయుష్మాన్ భారత్‌తో కలిసి దీనిని ఉపయోగించుకునేలా చూస్తామని ఆయన తెలిపారు. దీంతోపాటు ఆయుష్మాన్ భారత్‌లో కొన్ని వ్యాధులకు చికిత్స లేదని, దీనిపై చర్చించి నిర్ణయం తీసుకుంటామని ఆయన పేర్కొన్నారు.

గత ప్రభుత్వం తప్పిదం వల్ల మిషన్ భగీరథకు ఇబ్బందులు….
భేషజాలకు వెళ్లకుండా కేంద్ర ప్రభుత్వంతో తాము కలిసి వెళుతున్నామని మంత్రి పొంగులేటి తెలిపారు. గత ప్రభుత్వం మిషన్ భగీరథ విషయంలో కేంద్రం నుంచి నిధులు తీసుకోలేదని దీనివల్ల ప్రస్తుతం చాలా గ్రామాల్లోని ప్రజలు ఇబ్బంది పడుతున్నారని తాము ఇదే విషయాన్ని ప్రస్తుతం కేంద్రం దృష్టికి తీసుకెళ్లామని ఆయన తెలిపారు.
రాజీవ్ స్వగృహ, డబుల్ బెడ్‌రూం ఇళ్ల విషయంలో టెండర్‌లను…
పంపిణీ కాని డబుల్ బెడ్‌రూం ఇళ్ల విషయంలో త్వరలోనే ప్రభుత్వం ఓ నిర్ణయం తీసుకుంటుందని మంత్రి పొంగులేటి తెలిపారు. కొన్ని చోట్ల కాంట్రాక్టర్‌లు ముందుకు రావడం లేదని ఈ నేపథ్యంలోనే దీనిపై సమీక్ష చేసి టెండర్‌లను పిలుస్తామని ఆయన పేర్కొన్నారు. రాజీవ్ స్వగృహ విషయంలోనూ కమిటీ వేశామని, త్వరలోనే కొన్ని చోట్ల స్వగృహ ఇళ్లకు మరమ్మతులు చేపట్టాలని నిర్ణయించామని ఆయన తెలిపారు. వాటికి సంబంధించి కూడా త్వరలోనే టెండర్‌లను పిలుస్తామని ఆయన పేర్కొన్నారు. సామాన్యులకు ఇంటికల నెరవేర్చేలా హౌసింగ్‌బోర్డు లాంటి కట్టేలా ప్రభుత్వం ప్రణాళికలు రూపొందిస్తుందని ఆయన తెలిపారు.

కొంతవరకే చేరికలు…
2018 ఎన్నికల్లో బిఆర్‌ఎస్‌కు 88 సీట్లు రాగా, కాంగ్రెస్‌కు సుమారుగా 19 సీట్లు వచ్చాయని, ఆ సమయంలో ప్రజలు బిఆర్‌ఎస్‌కు అధికారాన్ని అప్పగించారని అయినా తృప్తి చెందని మాజీ సిఎం కెసిఆర్ అప్పటి కాంగ్రెస్ ఎమ్మెల్యేలను బిఆర్‌ఎస్ విలీనం చేసుకున్నారన్నారు. ప్రస్తుతం తమను 64 స్థానాల్లో గెలిపించి తమకు ప్రజలు అధికారం కట్టబెట్టారని దీనిని జీర్ణించుకోలేని మాజీ సిఎం కెసిఆర్ తమ ప్రభుత్వాన్ని కూలగొడతానని మాట్లాడుతున్నారని ఇది ఎంతవరకు సమంజసం అని మంత్రి పొంగులేటి ప్రశ్నించారు.

తాము ప్రజాస్వామ్య బద్ధంగా ముందుకెళుతున్నామని తమది నేషనల్ పార్టీ అని తాము ఒక్క డోర్ మాత్రమే తెరిచామని, తాము చేపట్టిన అభివృద్ధిని చూసి బిఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌లో చేరుతున్నారని ఆయన తెలిపారు. ఈ చేరికలను కొంతవరకు తాము ప్రోత్సహిస్తామని, అనంతరం ఫుల్‌స్టాప్ పెడతామని ఆయన పేర్కొన్నారు. అయితే ఈ చేరికలను కొంత కట్టడి చేయాలని భావించినా పార్టీలో చేరేవారు ఢిల్లీ పెద్దలతో వివిధ వర్గాలతో చెప్పించుకొని పార్టీలోకి వస్తున్నారని మంత్రి తెలిపారు. ఈ చేరికలు బిఆర్‌ఎస్‌ఎల్పీని విలీనం చేసే వరకు ఉంటాయా అని విలేకరులు అడగ్గా మంత్రి నవ్వి ఊరుకున్నారు.

ఈనెల 24వ తేదీ తరువాత అసెంబ్లీ సమావేశాలు….
ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న కెసిఆర్ అసెంబ్లీకి రావాలని కోరుకుంటున్నానని ఆయన తెలిపారు. ఆయన చాలా సీనియర్ అని, ఆయన ఇచ్చే సలహాలు, తనలాంటి వారికి ఎంతో ఉపయోగపడుతాయని ఆయన పేర్కొన్నారు. ప్రతిపక్ష నాయకుడు ప్రజాస్వామ్య బద్ధంగా వ్యవహారించాలని మంత్రి పొంగులేటి సూచించారు. ఈనెలాఖరులో రాష్ట్ర బడ్జెట్‌కు ఆమోదం తెలుపుతామని, ఈనెల 24వ తేదీ తరువాత అసెంబ్లీ సమావేశాలను ప్రారంభిస్తామని ఆయన తెలిపారు.
100 గజాల లోపు ఎల్‌ఆర్‌ఎస్ దరఖాస్తులు క్లియర్
ఎల్‌ఆర్‌ఎస్ దరఖాస్తులను క్లియర్ చేయాలని అధికారులను ఇప్పటికే ఆదేశించామని, అందులో భాగంగా అనుమతులు లేని లే ఔట్‌లో ఇప్పటికే రిజిస్ట్రేషన్ అయిన వాటితో పాటు 100 గజాల లోపు ఉన్న స్థలాలకు రిజిస్ట్రేషన్ చేయాలని అధికారులను ఆదేశించినట్టు మంత్రి పొంగులేటి తెలిపారు. వచ్చేనెలలోగా ధరణికి సంబంధించిన పనులు అయిపోగానే ఈ ఎల్‌ఆర్‌ఎస్ దరఖాస్తులపై పూర్తిస్థాయి నిర్ణయం తీసుకుంటామని ఆయన పేర్కొన్నారు.

జిఓ 59 కింద వేల కోట్ల భూములు స్వాహా
గత ప్రభుత్వ హయాంలో 59 జిఓ కింద చేసిన రిజిస్ట్రేషన్‌లలో చాలా అక్రమాలు జరిగాయని మంత్రి పొంగులేటి తెలిపారు. ముఖ్యగా శివార్లలో ఎక్కువగా అవినీతి జరిగిందని తమ ప్రభుత్వం గుర్తించి ఆయా రిజిస్ట్రేషన్‌లను ఆపివేసిందన్నారు. వేల కోట్ల ఆస్తులను స్వాహా చేశారని ఆయన తెలిపారు. ఈ అవినీతిలో భాగంగా ఎకరాల్లో ఉన్న భూమిని 999 గజాలు, 990 గజాలు, 850 గజాల్లో రిజిస్ట్రేషన్ చేయించి వందల ఎకరాల భూమిని 59 జిఓ కింద క్రమబద్ధీకరించుకున్నారని మంత్రి పేర్కొన్నారు. పేదలు తమకు ఉన్న స్థలంతో పాటు ప్రభుత్వ భూమిలో కట్టడం నిర్మించుకుంటే దానిని జిఓ 59 కింద క్రమబద్ధీకరించాలని నిబంధనలు ఉన్నా గత ప్రభుత్వంలో చాలామంది ఎలాంటి కట్టడాలు లేకుండానే వాటిని రిజిస్ట్రేషన్ చేసుకున్నారని ఆయన తెలిపారు. శేరిలింగంపల్లి సబ్ రిజిస్ట్రార్‌తో పాటు మరికొన్ని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలు, తహసీల్దార్‌ల పరిధిలో ఇలాంటి అక్రమాలు జరిగినట్టు గుర్తించామని, కొందరు తహసీల్దార్‌లు ఈ అక్రమాల్లో భాగస్వామ్యం అయ్యారని గుర్తించామని ఆయన పేర్కొన్నారు.

సిఎస్‌ఆర్ ఫండ్ కింద సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల నిర్మాణం
ప్రస్తుతం స్టాంపులు, రిజిస్ట్రేషన్ శాఖలో 32 నుంచి 36 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో ఆదాయం బాగా వస్తుందని తాము గుర్తించామని ఈ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలకే అధికంగా డిమాండ్ ఉందని, చాలామంది సబ్ రిజిస్ట్రార్‌లు ఈ కార్యాలయాల్లో పనిచేయడానికి సిఫారసు లేఖలను తీసుకొస్తారని మంత్రి పొంగులేటి తెలిపారు. ఈసారి స్టాంపులు, రిజిస్ట్రేషన్ శాఖలో జరిగే బదిలీలు పారదర్శకంగా చేపడుతామని, సిఫారసు లేఖలను తీసుకొచ్చినా, ఎవరితోనైనా ఫోన్ చేయించినా వారిని దూరప్రాంతాలకు బదిలీ చేస్తానని మంత్రి హెచ్చరించారు.

చాలామంది 36 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో పనిచేయడానికే ఆసక్తి చూపతున్నారని మిగతా కార్యాలయాల్లో ఎవరూ పనిచేయాలని ఆయన అన్నారు. దీంతోపాటు చాలా సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలకు సొంత భవనాలు లేవని దీనికోసం సిఎస్‌ఆర్ ఫండ్ ఆ భవనాలను నిర్మించేలా పలు కార్పొరేట్ సంస్థలతో చర్చలు జరుపుతున్నామని మంత్రి తెలిపారు. వారే భవనాలు నిర్మించడంతో పాటు ఆ భవనాల మెయింటెన్స్ కూడా చూసుకునేలా ఎంఓయూ చేసుకుంటామని మంత్రి పేర్కొన్నారు.

అర్హులైన జర్నలిస్టులకు న్యాయం
జర్నలిస్టులకు కచ్చితంగా ఇళ్ల స్థలాలను కేటాయిస్తామని మంత్రి పొంగులేటి హామీనిచ్చారు. త్వరలోనే దీనిపై అధికారులతో చర్చిస్తానని అర్హులకు కచ్చితంగా అందేలా చర్యలు చేపడుతానని ఆయన తెలిపారు. అర్హులను ఎలా గుర్తించాలన్న దానిపై మీడియా అకాడమీతోనూ చర్చలు జరుపుతున్నామని త్వరలోనే జర్నలిస్టులు శుభవార్త వింటారని ఆయన పేర్కొన్నారు. తాను మాట ఇస్తే తప్పనని, అర్హులైన జర్నలిస్టులందరూ సంతోషపడేలా తాను ఇళ్ల స్థలాలను కేటాయిస్తానని, ఎవరూ ఆ విషయంలో ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఆయన తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News