బిఆర్‌ఎస్‌కు ఏడాది క్రితమే ప్రజానీకం ఛార్జ్‌షీట్
ప్రజాస్వామ్య భారతంలో ఆధునిక తుగ్లక్‌కు మంచి
ఉదాహరణ కెసిఆర్ ఈ అసెంబ్లీ సమావేశాల్లోనే
నూతన రెవెన్యూ బిల్లు త్వరలో గ్రామానికో రెవెన్యూ
ఉద్యోగి నియామకానికి కార్యాచరణ జర్నలిస్టుల ఇళ్ల
స్థలాల సమస్యపై సిఎంతో మాట్లాడి త్వరలో నిర్ణయం
రెవెన్యూశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి
మన తెలంగాణ/హైదరాబాద్: బిఆర్‌ఎస్ పదేళ్ల పాలనపై ఏడాది క్రితమే తెలంగాణ ప్రజానీకం వారికి చార్జ్‌షీట్ ఇచ్చిందని రెవెన్యూ, హౌసింగ్ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పేర్కొన్నారు. మాజీమంత్రి హరీష్ రావుకు ఇంకా కూడా జ్ఞానోదయం కాకపోవడం విచారకరమని ఆయన తెలిపారు. వారి వాలకం దొంగే దొంగ అన్నట్లుగా ఉందని, పదేండ్ల పాలనలో వందేండ్లకు సరిపడా దోపిడీ చేసినవారే ఇవాళ చార్జ్‌షీట్ అంటున్నారని మంత్రి ఎద్దేవా చేశారు. రెవెన్యూ శాఖలో జరిగిన ఏడాది ప్రగతికి సంబంధించిన పలు అంశాల గురించి మంత్రి పొంగులేటి విలేకరుల సమావేశంలో పేర్కొన్నారు. ఈ సందర్భంగా బిఆర్‌ఎస్ చార్జ్‌షీట్, తుగ్లక్ పాలనపై రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.
స్వేచ్ఛను గత ప్రభుత్వం హరించింది
గత ప్రభుత్వ హయాంలో పోలీసులను పార్టీ కార్యకర్తలుగా వాడుకోవడం, ప్రతిపక్షాల ఫోన్లు ట్యాప్ చేయించడం, డబ్బు మూటలు పట్టుకొచ్చిన వారిని తప్ప ఎవరినీ కలవకపోవడం, ప్రజలు నోరు తెరవకుండా ధర్నాచౌక్ లను ఎత్తేయడం, ఎమ్మెల్యేలను మంత్రులను కలవకపోవడం, భారత రాజ్యాంగం ప్రకారం సంక్రమించిన స్వేచ్ఛను గత బిఆర్‌ఎస్ ప్రభుత్వం హరించి వేసిందని ఆయన ఆరోపించారు. ప్రశ్నించిన ప్రతివారిని పార్టీ నుంచి పోలీసుల నుంచి బెదిరించారని ఆయన అన్నారు. ఫాంహౌస్ నుంచి పాలన చేసిన వారిది తుగ్లక్ పాలననా ? సచివాలయం నుంచి ప్రజాపాలన నిర్వహిస్తూ ప్రజా సమస్యలను పరిష్కరిస్తున్న తమది తుగ్లక్ పాలననా ? అని మంత్రి పొంగులేటి ప్రశ్నించారు.
ఎర్రవెల్లిని రాజధానిగా చేసుకుని, ఫాంహౌస్‌ను సెక్రటేరియట్ చేసుకుని ఎవరి మాటా వినకుండా ఒక రాష్ట్రాన్ని తన ఇష్టం వచ్చినట్లు పాలించిన వారిది తుగ్లక్ పాలనా కాదా? అని ఆయన అన్నారు. మోడ్రన్ తుగ్లక్ మాత్రం ప్రజాస్వామ్య భారతదేశంలో ఈ శతాబ్దానికి కెసిఆర్ ఒక్కరేనని, తుగ్లక్ అంటే ఎవరో మన తరాలకు తెలియదని, తుగ్లక్ అంటే ఇలా ఉంటాడని ఒక పెద్దాయన పదేళ్లపాటు ప్రజలకు సినిమా వేసి మరీ చూపించారని మంత్రి పొంగులేటి ఎద్దేవా చేశారు. పదేళ్లు ప్రజల నెత్తిన టోపీ పెట్టిన అసలు సిసలు తుగ్లక్ మహారాజ్ కెసిఆర్ అని, ఆ టైటిల్ కు ఇప్పుడే కాదు మరో 50 ఏళ్ల వరకు కూడా ఎవరూ పోటీకి రారని ఆయన అన్నారు.
ఈ సమావేశాల్లో కొత్త రెవెన్యూ చట్టం బిల్లు
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో రెవెన్యూ శాఖలో పలు నిర్ణయాలను అమలు చేసి రెవెన్యూ సేవలను సామాన్యులకు అందుబాటులో ఉండేలా చర్యలు చేపట్టామని మంత్రి పొంగులేటి తెలిపారు. ఒక వైపు ధరణి పోర్టల్ ప్రక్షాళనకు అవసరమైన చర్యలు చేపడుతూనే మరోవైపు ధరణికి సంబంధించి గత ప్రభుత్వంలో వచ్చిన దరఖాస్తుల పరిష్కారానికి చర్యలు తీసుకున్నామన్నారు. ఇంకోవైపు కొత్త రెవెన్యూ చట్ట రూపకల్పనకు శ్రీకారం చుట్టి కొలిక్కి తీసుకువచ్చామన్నారు. ఈ శాసనసభ సమావేశాల్లో కొత్త రెవెన్యూ చట్టం బిల్లును ప్రవేశపెట్టబోతున్నామని ఆయన తెలిపారు. అలాగే టెర్రాసిస్ అనే విదేశీ సంస్ద నుంచి ధరణి పోర్టల్ నిర్వహణ బాధ్యతలను తప్పించి కేంద్ర ప్రభుత్వానికి చెందిన స్వదేశీ సంస్థ ఎన్‌ఐసికి అప్పగిస్తూ కీలక నిర్ణయం తీసుకున్నామని ఆయన తెలిపారు.
అధికారంలోకి రాగానే భూ నిపుణులతో కమిటీ
ధరణి వల్ల తరతరాలుగా తమ యజమాన్యంలో ఉన్న భూములపై సర్వ హక్కులు కోల్పోయారని మంత్రి పొంగులేటి తెలిపారు. భూముల వివరాలను ధరణి పోర్టల్ లో నమోదు చేసే సమయంలో జరిగిన లోపాలు, అక్రమాలు, అవకతవకల వల్ల లక్షలాది మంది రైతులు తీవ్ర మనోవేదనకు గురయ్యారని మంత్రి వాపోయారు. రైతులు తమ భూములను అమ్ముకోవడానికి, ఆ భూములపై బ్యాంకుల నుంచి రుణాలు పొందడానికి రైతుల పడ్డ కష్టాలు వర్ణణాతీతమన్నారు. ఈ పరిస్థితుల్లో మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే సామాన్యులకు రెవెన్యూ సేవలు అందేలా పలు కీలక నిర్ణయాలు తీసుకున్నామని మంత్రి తెలిపారు.
దరఖాస్తు తిరస్కరించాల్సి వస్తే…
ధరణి సమస్యలను పరిష్కరించేందుకు కేంద్రీకృతమై ఉన్న అధికారాలను వికేంద్రీకరించి, మండల స్థాయిలో తహసీల్దార్‌కు, డివిజన్ స్థాయిలో ఆర్డీఓలకు, జిల్లా స్థాయిలో అదనపు కలెక్టర్లు సమస్యలను పరిష్కరించే అధికారాన్ని అప్పగించామని మంత్రి తెలిపారు. ఒక్కప్పుడు ధరణీలో ఏ ఎంట్రీ మారినా ఎందుకు మారిందో తెలుసుకోవడానికి ధరణీ వెబ్‌సైట్‌లో కానీ, కాగితాలపైనా ఎలాంటి ఆధారం ఉండేది కాదని, కానీ, ఇప్పుడు ఈ విధానాన్ని మార్చి దరఖాస్తు వచ్చినప్పటి నుంచి సమస్య పరిష్కారం అయ్యే వరకు ప్రతిదానిని కంప్యూటర్‌లో ఉంచి ఎవరైనా, ఎప్పుడైనా చూసుకునేలా చేశామన్నారు.
అప్పటి ప్రభుత్వంలో ఏ కారణం చెప్పకుండానే దరఖాస్తులను తిరస్కరించే వారని, కానీ, ఇప్పుడు దరఖాస్తు తిరస్కరించాల్సి వస్తే దరఖాస్తు దారునికి తిరస్కరణకు గల కారణాలు వివరిస్తూ ప్రతి దరఖాస్తుపై నివేదికను తప్పనిసరి చేశామన్నారు. దరణి దరఖాస్తుల పరిష్కారం ధరణి సమస్యల పరిష్కారానికి 2024 మార్చి 1 నుంచి 15 వరకు స్పెషల్ డ్రైవ్ నిర్వహించా మని మంత్రి తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చే నాటికి 2.46 లక్షల దరఖాస్తుల్లో పెండింగ్‌లో ఉండగా స్పెషల్ డ్రైవ్ నిర్వహించి 1.38 లక్షల దరఖాస్తులను పరిష్కరించామని మంత్రి తెలిపారు.
గ్రామాల్లో రెవెన్యూ సేవలు పునరుద్ధరణకు….
గ్రామాల్లో రెవెన్యూ సేవలు పునరుద్ధరణకు చర్యలు గత ప్రభుత్వం విఆర్‌ఓ, విఆర్‌ఎ వ్యవస్థను రద్దుచేసి గ్రామీణ ప్రాంతాల్లో సామాన్యులకు రెవెన్యూ సేవలను దూరం చేసిందన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో రెవెన్యూ వ్యవస్థను పటిష్ట పరచడానికి రెవెన్యూ సేవల పునరుద్ధరణకు చర్యలు చేపట్టామని మంత్రి పొంగులేటి తెలిపారు. రాష్ట్రంలో 10,954 రెవెన్యూ గ్రామాల్లో రెవెన్యూ వ్యవహారాలను పర్యవేక్షించేందుకు ఒక రెవెన్యూ ఉద్యోగిని నియమించడానికి కార్యాచరణను రూపొందించామన్నారు.
నాలుగేళ్లలో 20 లక్షల ఇళ్లు
రాష్ట్రంలో ఏ గ్రామానికి పోయినా, ఏ తండాకు పోయినా ఇందిరమ్మ ఇళ్లే కనబడతాయని మంత్రి పొంగులేటి తెలిపారు. ఈ ప్రభుత్వం చేపట్టే అన్ని కార్యక్రమాలు ఒక వంతు అయితే, తాము కట్టించే ఇందిరమ్మ ఇళ్లు మరో వంతని ఆయన అన్నారు. వచ్చే నాలుగు సంవత్సరాల్లో దశల వారీగా సుమారు 20 లక్షల ఇందిరమ్మ ఇళ్లను నిర్మించేందుకు ప్రభుత్వం ప్రణాళికలు రూపొందించిందన్నారు. మొదటి విడతలో భాగంగా ఈ ఏడాది నియోజకవర్గానికి 3,500 ఇళ్ల చొప్పున రాష్ట్ర వ్యాప్తంగా ఐదు లక్షల ఇళ్లను నిర్మించాలని లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. ఒక్కో ఇంటి నిర్మాణానికి రూ.5 లక్షల ఆర్థిక సహాయం అందిస్తామని ఆయన తెలిపారు.
జర్నలిస్టుల ఇళ్ల సమస్యపై త్వరలోనే నిర్ణయం
జర్నలిస్టుల ఇళ్ల స్థలాలకు సంబంధించి త్వరలోనే సిఎం రేవంత్‌రెడ్డితో మాట్లాడి నిర్ణయం తీసుకుంటానని మంత్రి పొంగులేటి తెలిపారు. గతంలో ఆ సమస్య పరిష్కారం అయ్యిందన్న లోపే కొత్త సమస్య వచ్చిందని దాని పరిష్కారానికి సీనియర్ జర్నలిస్టులతో మాట్లాడి సిఎం దృష్టికి తీసుకెళతానని ఆయన తెలిపారు.