మన తెలంగాణ / హైదరాబాద్ : హైదరాబాద్ పరిసర ప్రాంతాలలో మరో ఐడిటిఆర్ ఏర్పాటుకు అనుమతివ్వాలని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ కేంద్రానికి విజ్ఞప్తి చేశారు. రవాణా శాఖకు సంబంధించి రాష్ట్రానికి రావాల్సిన పలు అంశాలపై మంత్రి పొన్నం ప్రభాకర్ కేంద్ర మంత్రికి లేఖ రాశారు. తెలంగాణలో రవాణా శాఖ వాహన్, సారథి సాఫ్ట్‌వేర్ అప్లికేషన్‌లకు రోల్-అవుట్, ఎ1 ఆధారిత ఇంటిగ్రేటెడ్ ఇంటెలిజెంట్ ట్రాన్స్‌పోర్ట్ మేనేజ్‌మెంట్ సిస్టమ్ , వెహికల్ స్క్రాపింగ్ సౌకర్యాలు , ఆటోమేటెడ్ టెస్టింగ్ స్టేషన్ల ఏర్పాటు, ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల్లో చిల్డ్రన్ ట్రాఫిక్ అవేర్‌నెస్ పార్కుల ఏర్పాటు, రోడ్ సేఫ్టీ ఆర్గనైజేషన్ కాలేజీలలో అవగాహన కల్పించడం వంటి అనేక కార్యక్రమాలను రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటోందని ఆ లేఖలో కేంద్ర మంత్రికి వివరించారు. తెలంగాణలో కొనుగోలు చేసిన, నమోదు చేసుకున్న ఎలక్ట్రిక్ వాహనాలకు రోడ్డు పన్ను, రిజిస్ట్రేషన్ ఫీజు రెండింటిపై 100 శాతం మినహాయింపును అందించడం ద్వారా ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం వేగవంతం చేసేందుకు రవాణా శాఖ చర్యలు చేపట్టిందన్నారు.
అదనంగా ఎలక్ట్రిక్ వెహికల్ ఛార్జింగ్ స్టేషన్ లు మౌలిక సదుపాయాలను అందించడంలో ప్రభుత్వం చురుకుగా పని చేస్తోందని వివరించారు. ఈ కార్యక్రమాలను మరింత వేగవంతం చేయడానికి, కేంద్ర ప్రభుత్వం సహాకరించాలని కోరారు. సిరిసిల్లలో ఒక ఐడిటిఆర్ ఉందని, ఇది పూర్వపు ఆదిలాబాద్, కరీంనగర్, వరంగల్ జిల్లాలను కవర్ చేసే గ్రామీణ ప్రాంతాలకు సేవలను అందిస్తోందన్నారు. సిరిసిల్లలోని కేంద్రం హైదరాబాద్‌కు 140 కిలోమీటర్ల దూరంలో ఉందని, డ్రైవింగ్ శిక్షణ కోరుకునే పట్టణ ప్రాంత యువత ఐడిటిఆర్ వద్ద శిక్షణ పొందేందుకు అంత దూరం వెళ్లలేకపోతున్నారని తెలిపారు. 2011 జనాభా లెక్కల ప్రకారం, తెలంగాణ జనాభా 3.5 కోట్లు, తెలంగాణలో ప్రస్తుత జనాభా 4 కోట్ల కంటే ఎక్కువ. దాదాపు సమాన జనాభా ఉన్న రాష్ట్రాలకు ఒకటి కంటే ఎక్కువ ఐడిటిఆర్‌లు మంజూరు చేయబడ్డాయన్నారు.
ఆంధ్రప్రదేశ్‌కు 3 ఐడిటిఆర్‌లు, మరియు హర్యానాకు 2, మంజూరు చేయబడ్డాయని తెలిపారు. తెలంగాణ లో దాదాపు 1.72 కోట్ల వాహనాలు ఉన్నాయని, దాదాపు 10 లక్షల మంది లైట్ మోటార్ వెహికల్స్ మరియు హెవీ డ్రైవింగ్ లైసెన్స్ హోల్డర్లు ఉన్నారని, తెలంగాణలో రవాణా రంగానికి డ్రైవర్ల అవసరం చాలా ఉందన్నారు. హైదరాబాద్ నగరానికి అతి సమీపంలో ఉన్న మేడ్చల్- మల్కాజిగిరి జిల్లాలో రవాణా శాఖకు 40 ఎకరాల ప్రభుత్వ భూమి ఉందని, ఐడిటిఆర్ కేంద్రాన్ని ఏర్పాటు చేయడానికి ఇది చాలా అనుకూలంగా ఉంటుందని తెలిపారు. హైదరాబాద్ మెట్రోపాలిటన్ ఏరియాలో మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా దుండిగల్‌లో డిపార్ట్‌మెంట్ ఆధీనంలో ఉన్న ప్రభుత్వ స్థలంలో ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ డ్రైవింగ్ ట్రైనింగ్ అండ్ రీసెర్చ్ ఏర్పాటుకు అనుమతివ్వాలని కోరారు.
ఇంటిగ్రేటెడ్ ఇంటెలిజెంట్ ట్రాన్స్‌పోర్ట్ మేనేజ్‌మెంట్ సిస్టమ్ ఏర్పాటు
అభివృద్ధి చెందుతున్న సాంకేతిక పరిజ్ఞానాన్ని దృష్టిలో ఉంచుకుని, తెలంగాణ ప్రభుత్వం వాహన అమలును మరింత ప్రభావవంతంగా, పారదర్శకంగా చేసే లక్ష్యంతో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌ని ఉపయోగించడం ద్వారా ఇంటిగ్రేటెడ్ ఇంటెలిజెంట్ ట్రాన్స్‌పోర్ట్ మేనేజ్‌మెంట్ సిస్టమ్ (ఐఐటిఎంఎస్)ని పరిచయం చేయాలనుకుంటోందని మంత్రి పొన్నం కేంద్రమంత్రికి రాసిన లేఖలో పేర్కొన్నారు. ఈ సిస్టమ్‌లో డేటాబేస్‌లు వివిధ వాటాదారుల విభాగాలతో అనుసంధానించబడతాయి. మేము ఇప్పటికే పోలీస్ , రవాణా శాఖల డేటాబేస్‌లను ఏకీకృతం చేసినట్లు తెలిపారు. అన్ని కాలుష్య పరీక్షా కేంద్రాలను కూడా ఏకీకృతం చేసామని, ఇన్సూరెన్స్ కంపెనీలు, ఫైనాన్షియర్‌లతో కలిసిపోవాలని ప్లాన్ చేస్తున్నామన్నారు. వివిధ క్రిటికల్ జంక్షన్లు, జాతీయ రహదారులపై ఎఎన్‌పిఆర్ కెమెరాల వంటి కృత్రిమ మేధస్సు ఆధారిత కెమెరాలను ఉపయోగించడం ద్వారా, హెల్మెట్ లేకుండా డ్రైవింగ్ చేయడం, స్టాప్ లైన్ దాటడం, సిగ్నల్ జంపింగ్, మోటార్ సైకిల్‌పై ట్రిపుల్ రైడింగ్ మొదలైన ట్రాఫిక్ ఉల్లంఘనలు గుర్తించబడతాయని, ఆటోమేటిక్‌గా జారీ చేయబడిన ఇ-చలాన్‌లు జారీచేయబడుతాయన్నారు.