Saturday, August 2, 2025

మీ ఆలోచనలే మిమ్మల్ని నిర్దేశిస్తాయి

- Advertisement -
- Advertisement -

మీకు వచ్చే ఆలోచనలే మిమ్మల్ని ఉన్నతమైన స్థానంలో నిలబెడతాయి. అంటే మీ జీవితకాలంలో మీరు నేర్చుకున్న పాఠాలు, విలువలు, మీరు బాల్యంలో తీసుకున్న శిక్షణ మొదలైనవన్ని మీ జీవితకాలంలో ఎదో ఒక సందర్భంలో మిమ్మల్ని ఉన్నతమైన స్థానంలోకి తీసుకొని వెళతాయి. ఒకవేళ మీరు అలాంటి స్థానంలో లేరు అంటే అది మీ అభ్యాసన లోపం కాదు. మీరు శిక్షణను సరిగ్గా ఉపయోగించుకోలేదని అర్థం. ఓ జాలరి నివసించే ఊరిలో ఒక కోటీశ్వరుడు కూడా ఉండేవాడు. జాలరి ప్రతిరోజు సముద్రంలో వేటకి వెళ్ళి వలకి చిక్కిన చేపలను అమ్ముకొని వచ్చిన డబ్బులతో పిల్లల్ని పోషించుకునేవాడు. అలాగే కోటీశ్వరుడు తన దగ్గర వున్న డబ్బుమీద నియంత్రణ లేకుండా విపరీతంగా ఖర్చుపెట్టి వున్నదంతా పోగొట్టుకొని జాలరి ఇంటి పక్కన వున్న ఓ ఇంట్లోకి మారుతాడు.

ఆ పేదరికంలో వున్న జాలరితోపాటు ఇతను కూడా రోజు సముద్రంలో చేపల వేటకి వెళ్ళేవాడు. పేదజాలరి వలకి చిక్కిన చేపల్ని తన దినచర్యలో భాగంగా అమ్ముకొని కాలం వెళ్ళదీసేవాడు. అతని ఇంటి పక్కన వున్న మరొక జాలరి మాత్రం తన వలకు చిక్కిన చేపల్ని అమ్ముకొని (Selling caught fish) వాటి ద్వారా వచ్చిన డబ్బుల్ని తన కుటుంబ అవసరాలుపోను మిగిలినవి పొదుపు చేసుకునేవాడు. ఇలా రోజులు గడుస్తున్న కొద్దీ పేదజాలరి పేదవాడిలాగే ఉండిపోయాడు. పేదజాలరి ఇంటి పక్కకు మారిన మరొక జాలరి మాత్రం తను పోగేసుకున్న డబ్బులతో చిన్న చిన్న పడవలను, మరబోట్లను కొని ఇంకా ఎక్కువగా చేపలు పట్టి కోట్లకు అధిపతిగా మారుతాడు. చూశారా పేదరికంలో వున్న జాలరి పేదవాడిగానే మిగిలిపోతే కోటీశ్వరుడిగా వుండి డబ్బు మీద నియంత్రణలేక పేదవాడిగా మారి జాలరి ఇంటి పక్కకు వెళ్ళి మళ్ళీ కోటీశ్వరుడిగా మారతాడు.

ఇక్కడ కోటీశ్వరుడు తన స్వయం కృతాపరాధం వల్ల పేదవాడిగా మారి మళ్ళీ తను సంపాదించిన చిన్న మొత్తంలో దాచుకొని వ్యాపారాన్ని విస్తృతం చేసి రెండోసారి మళ్ళీ ధనవంతుడయ్యాడు. మరి పేద జాలరి మాత్రం అలా ఆలోచించలేకపోయాడు. అలా మీరు కూడా పేదజాలరి లాగే ఆలోచించాలనుకుంటే అది మీ ఇష్టం. కానీ అలాంటి జీవితంలో ఎలాంటి మార్పు, అనుభూతి ఉండదు. రోజులు గడుస్తాయ్ తప్ప. మీరు, మీ పిల్లలు మళ్ళీ పేదరికంలోనే మగ్గుతారా? మీరు అలా ఉండటానికి ఇష్టపడినా మీ తర్వాత తరం వారు అలాగే బతకాలని కోరుకుంటారా ఓసారి ఆలోచించండి? మీరు ఎలా బతికారన్నది ముఖ్యం కాదు. కానీ మీ తర్వాతి తరం వారు కూడా అలాగే బతకాలని కోరుకోవడం అవివేకపు ఆలోచనే అవుతుంది.

ఎందుకంటే ఓ బిచ్చగాడి కుమారుడు బిచ్చగాడిగానే జీవితాన్ని ప్రారంభించాలని కోరుకోడు. మరి మీరు ఎలా ఆలోచిసున్నారనేది మీ ప్రణాళికలపై, మీ ఆలోచనలపై ఆధారపడి వుంటుంది. అందుకే మీ జీవితంలో నిస్సారమైన రోజుల్ని పక్కకుపెట్టి ఆలోచనలకు వైవిధ్యాన్ని జోడించండి. అప్పుడే మీరు మీ తర్వాత తరం వారు ఉన్నతంగా బతకటానికి మీరు మార్గం వేసినవారు అవుతారు. ఒక ప్రయోగంలో సంచలనమైన నిజాలు బయటపడ్డాయి. అవి ఏంటంటే కొద్దిమంది చిన్న పిల్లల్ని ఒక గదిలోకి పంపి అందులోకి విష సర్పాలను వదులుతారు. ఆ పిల్లల తల్లిదండ్రులందరూ భయపడుతారు. (బహుశా మీరు కూడా ఏం జరిగిందోనని భయపడ్తూ ఉండొచ్చు) పిల్లలు భయపడలేదు పైగా వాటితో ఆడుకున్నారు కూడా.

వాటిని బొమ్మలుగా భావించి సరదాగా కాలక్షేపం చేశారు. ఈ ప్రయోగం ద్వారా మనస్తత్వవేత్తలు తెల్సుకున్నదేమిటంటే మనం పుట్టింది రెండే రెండు భయాలతో అందులో ఒకటి పెద్ద పెద్ద శబ్దాలతో వచ్చే భయం, రెండోది ఎత్తుగా వున్న ప్రదేశాలు, ఇవే మనల్ని సహజంగా భయపెడ్తాయి. ఇక మిగిలిన భయాలన్ని మనం నేర్చుకున్నవే. అందులో నిబంధనలు (Conditions), రెండోది కార్యక్రమాల (Programmes) ద్వారా వచ్చే భయాలు. నిబంధనల ద్వారా వచ్చే భయం ఏమిటంటే పాము కరుస్తుందని, పులి చంపుతుందని, నిప్పుకాలుతుందని ఇవి మనం మన పూర్వీకుల ద్వారా తెల్సుకున్నవి. రెండోది కార్యక్రమం ద్వారా వచ్చే భయం ఇవి అసహజాలు, యుద్ధాలు, వరదలు, సునామీలు మొదలైన వాటి వల్ల వచ్చే ప్రమాధాలు మొదలైనవి. భయం అనేది కేవలం మనం వ్యక్తం చేసే స్పందన (Response) Action, చర్య మాత్రమే. అందుకే అందరూ ఒకే విషయానికి భయపడరు.

Fear of Failure, Fear of Judgement అసలు ఏదైనా పనిని ప్రారంభించాలంటే భయం. వాస్తవానికి మన జీవిత అనుభవాల్నించి మనం చాలా నేర్చుకుంటాం. ఆ అనుభవాలోంచి వారసత్వంగా (అప్పుగా) వచ్చిందే భయం (Fear). కాబట్టి భయం అనేది కూడా మన ఆలోచనల్లోంచి వచ్చేదే. దానికి అతిగా భయపడితే మనం ఏమీ సాధించలేం. పైగా ప్రతీచోట ఎదో జరుగుతుందనే భయం వెంటాడుతుంది కూడా. ఒకే పేరున్న ఇద్దరు వ్యక్తులు జనరల్ చెకప్ చేయించుకోవాలని హాస్పిటల్ కి వెళ్తారు. డాక్టర్ వారిద్దరికీ రకరకాల పరీక్షలు చేసి ఆ ఇద్దరిలో ఒకరిని పిలిచి నీకు కేన్సర్ సోకింది త్వరలో నువ్వు చనిపోతావు. ఎలాంటి ఆలోచనలు చేయకుండా మిగిలిన సమయాన్ని ప్రశాంతంగా భార్యాపిల్లలతో గడపు అంటాడు. రెండో వ్యక్తిని పిలిచి మీకు చేసిన పరీక్షలు అన్నీ నార్మల్ గానే వచ్చాయి.

మీరు సంపూర్ణ ఆరోగ్యంతో వున్నారు అని చెప్పి పంపిస్తాడు. వాస్తవంగా జరిగినదేమంటే డాక్టర్ వద్ద వున్న రిపోర్టులు తారుమారై (పేర్లు ఇద్దరివి ఒకటే కావడం వల్ల) ఆరోగ్యంగా వున్న వ్యక్తికి కేన్సర్ అని చెప్తాడు. కేన్సర్‌తో వున్న వ్యక్తికి ఆరోగ్యంగా ఉన్నావని చెప్తాడు. చివరికి జరిగినదేమిటంటే ఆరోగ్యంగా వున్న వ్యక్తికి డాక్టర్ ఎప్పుడైతే కేన్సర్ అని చెప్పాడో ఆ క్షణం నుండే అతడిలో భయంతో కూడిన నెగెటివ్ ఆలోచనలు మొదలైనవి. అతడు ప్రతిరోజు భయంతోనే గడిపి వారం రోజుల్లోనే చనిపోతాడు. వాస్తవంగా కేన్సర్ వున్న వ్యక్తి డాక్టర్ ఆరోగ్యంగా వున్నావని ఎప్పుడైతే చెప్పాడో ఆ క్షణం నుండే అతడిలో ఆత్మవిశ్వాసం రెట్టింపుగా పనిచేసింది.

అతడు ఇంకా జీవించే వున్నాడు. కానీ మొదటి వ్యక్తి మాత్రం ఇతని కన్నా ముందే చనిపోయాడు. చూశారా దీని ద్వారా మీకు ఏం అర్ధమై వుంటుంది. మీ ఆలోచనలే మిమ్మల్ని ప్రతిక్షణం మార్గదర్శనం చేస్తాయి. అవి నెగెటివ్ ఆలోచనలైతే వాటి ఫలితం కూడా అలాగే వుంటుంది. పాజిటివ్ ఆలోచనలైతే వాటి ద్వారా వచ్చే ఫలితం మిమ్మల్ని ఇంకా ముందకు నడుపుతుంది. కాబట్టి స్వార్ధం, అసూయ, ఈర్ష్యా, భయం, కోపం, ద్వేషం, పగ, ప్రతీకారం, మొదలైనవన్నీ మనిషి సహజ ఉద్వేగాలు వీటిని నియంత్రించుకొని గొప్పవారిగా ఎదగాలి. అలాంటి ఆలోచనలు పక్కనపెట్టి మన ఆలోచనలు కార్యరూపం దాల్చాలని ఆలోచించేవాడే ఉన్నతుడు. మీరు అలాగే ఉండటానికి ప్రయత్నం చేయండి.

  • డాక్టర్ మహ్మద్ హసన్, 99080 59234
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News