Thursday, May 2, 2024

బాల్యానికి భరోసా ఏది?

- Advertisement -
- Advertisement -

మానవ జీవితంలో బాల్యం అత్యంత కీలక దశ. ఇది ఓ మధుర జ్ఞాపకం. జాతికి నిజమైన సంపద బాలలే. కావున వీరి భావితరానికి బాటలు వేయాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై వున్నది. అందుకు వారి ఎదుగుదలకు కావలసిన వనరులను సమకూర్చాలి. దీనికై బాలల హక్కుల సంరక్షణకు కృషి చేయడమే శరణ్యం.అప్పుడే ఉత్తమ పౌరసమాజం నిర్మితమవుతుంది. దీనికై ప్రతి ఒక్కరూ బాలల హక్కులను కాపాడుతూ వారి పట్ల బాధ్యతగా వ్యవహరించాల్సిన అవసరం ప్రతి ఒక్కరిపై వున్నది. పిల్లలను శారీరక, మానసిక ఒత్తిడి, హింస, దోపిడీ నుంచి రక్షణ కల్పించాలి. అంతేకాకుండా పౌర, సాంస్కృతిక, ఆర్థిక, సామాజిక, రాజకీయ హక్కులు కల్పించివారి ఉన్నతికి తోడ్పడాల్సిన బాధ్యత ప్రభుత్వాలపైన వుంది. బాలల మనుగడ వారికి లభించే నాణ్యమైన ఆహారం, ఆరోగ్యం, విద్య, వినోదం, అభివృద్ధి, కుటుంబ జీవనంపై ఆధారపడి వుంటుంది.

ప్రపంచ దేశాలు ఎంతో అభివృద్ధి సాధిస్తున్నప్పటికీ అనేక రూపాలలో పిల్లల హక్కులకు తీవ్ర విఘాతం ఏర్పడుతున్నది. ఇటీవల ఇజ్రాయెల్ పాలస్తీనా మధ్య జరుగుతున్న యుద్ధంలో ఆ దేశ బాలల పరిస్థితి భయానకంగా మారింది.కావున ఎలాంటి విపత్తులు ఎదురైనా బాలలు భరోసా కోల్పోకుండా ప్రభుత్వాలు చూడాలి. మరోవైపు యూనిసెఫ్ సైతం బాలల హక్కుల కోసం విశేషంగా కృషి చేస్తున్నది. ఈ నేపథ్యంలో భారత దేశం బాలల అభివృద్ధికి అనేక రూపాలలో కృషి చేస్తున్నది. భారత రాజ్యాంగం సైతం వాళ్ల హక్కులకు ప్రత్యేక రక్షణలను కల్పించింది. ఈ క్రమం లో 86వ రాజ్యాంగ సవరణ ద్వారా విద్య హక్కు చట్టాన్ని కూడా చేర్చింది. నేటి పోటీ ప్రపంచంలో ఇప్పటికీ పిల్లలపై ఒత్తిడి, వేధింపులు, దౌర్జన్యాలు, నిర్లక్ష్యం, అక్రమ రవాణా, వెట్టిచాకిరి ఇలాంటివి కొనసాగడం బాధాకరం. అంతేకాకుండా కనీసం అవసరాలను పొందలేని పిల్లల సంఖ్య కూడా నేటికీ తాండవిస్తోంది. దీని ప్రభావం పిల్లలపై తీవ్రంగా పడింది.

భారత్ లాంటి వర్ధమాన దేశాల్లో పిల్లలు విద్యకు దూరమవడంతో బాల్య వివాహాలు, బాల కార్మిక వ్యవస్థ లాంటి దుర్లక్షణాలు పెరుగుతున్నాయి. పిల్లల్లో నైతిక విలువలు, క్రమశిక్షణ లోపించి దుస్సంస్కృతి పెచ్చిరిల్లుతున్నది. ఫలితంగా పిల్లలు ఎదుర్కొనే శిక్షలు, వేధింపులు వారి మనసులపై ప్రతికూల ప్రభావం చూపిస్తాయని నిపుణులు పేర్కొంటున్నారు. భారత దేశ జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే (ఎన్‌ఎఫ్‌హెచ్‌ఎస్ -5) 2019 -20 ప్రకారం ఐదు సంవత్సరాల కంటే తక్కువ వయసు వున్న పిల్లలలో 35.5% ఎదుగుదల లోపం, 19.3% బలహీనంగా, 32.1% తక్కువ బరువుతో వున్నట్లు పేర్కొన్నది. అత్యధిక కేసులు ఉత్తరప్రదేశ్ (3,98,35 9), తరువాత బీహార్ (2,79,427) వున్నాయి. కావున బాలల శారీరక, మానసిక అభివృద్ధికి మరిన్ని చర్యలకు శ్రీకారం చుట్టి వారి భావిజీవితానికి బాటలు వేయాలి.

భారత దేశంలో మొత్తం జనాభాలో 37% బాలలున్నారు. వీరు ఎదుర్కొంటున్న సంక్షోభాన్ని అంతమొందించాడానికి భారత దేశం గట్టి కృషి చేయాలి. అంతర్జాతీయ బాలల హక్కుల ఒప్పందం అమలుకై ప్రభుత్వాలు నిబద్ధతతో కృషి చేయాలి. ముఖ్యంగా అందరికీ ఉచిత విద్య, వైద్య అవకాశాలు మెరుగుపరచడానికి ప్రస్తుతం ఉన్న చట్టాల, విధానాలను పునః సమీక్షించాలి. పిల్లలను పేదరికం నుండి విముక్తి చేయడానికి కుటుంబ సామాజిక భద్రత కార్యక్రమాలపై దృష్టి పెట్టాలి. ఆడపిల్లల అభివృద్ధికి ప్రత్యేక ప్రాధాన్యం ఇవ్వాలి. ఒత్తిడి, భయం, అభద్రత తదితర ప్రతికూల ప్రభావాలు తొలగించి సానుకూలదృక్పథాన్ని పెంపొందించడానికి ప్రత్యేక కౌన్సెలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయాలి.

పౌష్టికాహార లోపాన్ని అధిగమించడానికి మంచి నాణ్యతతో కూడిన మధ్యాహ్న భోజన సౌకర్యం కల్పించాలి. తెలంగాణ ప్రభుత్వం అంగన్‌వాడి కేంద్రంలో అందించే బాలామృత కార్యక్రమం, ఇటీవల పాఠశాలలో ప్రవేశపెట్టిన సిఎం బ్రేక్ ఫాస్ట్ పథకాలు వంటివి వారి అభివృద్ధికి ఎంతో దోహదం చేస్తాయి.పిల్లల్లో దాగి వున్న సృజనాత్మకతను వెలికితీసి, నైపుణ్యాన్ని పెంపొందించే విద్యను అందించాలి. దీనికై తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసిన గురుకులాలు ఎంతో దోహదపడతాయి. వీటికి మౌలిక వసతులు కల్పించి మరింత ముందుకు తీసుకు వెళ్లారు. వారికి జీవితంపట్ల భరోసా ఏర్పడుతుంది.

అధిక జనాభా గల భారత దేశంలో పిల్లల హక్కులను గుర్తించడంలో కొంత మేరకు వెనుకబడి ఉందని క్షేత్రస్థాయి అధ్యయనాలు పేర్కొంటున్నాయి. కావున వీరి హక్కుల సంరక్షణకు మరిన్ని చట్టాలు చేసి పటిష్టంగా అమలు పరచాలి. బాలల సహాయ కేంద్రానికి (1098) ప్రాచుర్యం కల్పించాలి. బాలల సంరక్షణ కోసం పోక్సో చట్టం 2012, బాలల న్యాయ చట్టం 2015, బాల హక్కుల పరిరక్షణ కమిషన్- 2005 లాంటివి వున్నాయి. ఇవి బాలల పట్ల కొనసాగుతున్న దుర్విచక్షణను అంతమొందించడానికి గట్టి కృషి చేయాలి. ఈ క్రమంలో తెలంగాణలోని కళ్యాణలక్ష్మి పథకం బాల్య వివాహలను నివారించగలినది. బాలల అభివృద్ధికీ బడ్జెట్ కేటాయింపుల్లో తగిన ప్రాధాన్యతనివ్వాలి. పిల్లల హక్కుల పట్ల ప్రభుత్వం, పౌర సమాజం, స్వచ్ఛంద సంస్థలు విస్తృతంగా ప్రచారం చేయాలి. అప్పుడే బాలల హక్కులు సంరక్షించబడి వారి సర్వతోముఖాభివృద్ధికి బాటలు పడతాయి.

సంపతి రమేష్ మహారాజ్
7989579428

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News