Sunday, April 28, 2024

లోక్‌సభకు పోటీకి నా వెంట పడుతున్న పార్టీలు: ప్రకాశ్ రాజ్

- Advertisement -
- Advertisement -

కోజికోడ్ : 2024 లోక్‌సభ ఎన్నికలలో పోటీ చేయవలసిందనే అభ్యర్థనతో ‘మూడు పార్టీలు’ తన వెంట పడుతున్నాయని, అందుకు కారణం తన సిద్ధాంతం కాదని, ప్రధాని నరేంద్ర మోడీ విమర్శకుడిని కావడమేనని ప్రముఖ నటుడు ప్రకాశ్ రాజ్ చెప్పారు. 58 ఏళ్ల ప్రకాశ్ రాజ్ కోజికోడ్‌లో కేరళ సాహితీ ఉత్సవం (కెఎల్‌ఎఫ్)లో మాట్లాడుతూ, ‘నేను ఈ ఊబిలో చిక్కుకోదలచుకోలేదు’ అని స్పష్టం చేశారు. ‘కంజీవరం’, ‘సింగం’, ‘వాంటెడ్’ వంటి చిత్రాలలో తన నటనకు గాను ప్రశంసలు అందుకున్న ప్రకాశ్ రాజ్ 2019 సార్వత్రిక ఎన్నికలలో బెంగళూరు సెంట్రల్ నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేశారు. కానీ ఆయనకు ఓటమి తప్పలేదు. ‘ఇప్నుడు ఎన్నికలు వస్తున్నాయి. నా వెంట మూడు రాజకీయ పార్టీలు పడుతున్నాయి. నేను ఫోన్ స్విచాఫ్ చేశాను. నేను ఈ ఊబిలో చిక్కుకోదలచుకోకపోవడమే అందుకు కారణం. వారు ప్రజల కోసం లేదా నా సిద్ధాంతం కోసం రావడం లేదు. ‘నేను మోడీ విమర్శకుడిని’ అయినందున మంచి అభ్యర్థిని అవుతానని వారు అంటున్నారు’ అని ఆయన చెప్పారు.

కేంద్రంలోని బిజెపి ప్రభుత్వంపై విరుచుకుపడే ప్రకాశ్ రాజ్ ‘స్టార్ పవర్ స్టేట్ క్రాఫ్ట్ : ప్రజల వ్యక్తి, ఎన్నికల రాజకీయాలు’ అనే అంశంపై సెషన్‌లో ఈ వ్యాఖ్యలు చేశారు. రాజకీయ పార్టీల అభిపప్రాయాన్ని ఎవ్వరూ పట్టించుకోవడం లేదని, వాటి మాటల్లో ఏ మాత్రం నిజం లేదని ఆయన ఆరోపించారు. అభ్యర్థుల ఎంపికకు వాటి (పార్టీల)లో చాలా వరకు తంటాలు పడుతున్నాయని ఆయన పేర్కొన్నారు. సెషన్ మోడరేటర్ అంజనా శంకర్ అడిగిన ప్రశ్నలకు ప్రకాశ్ రాజ్ సమాధానం ఇచ్చారు. ప్రధాని నరేంద్ర మోడీని ‘ద్వేషిస్తున్నారా’ అని కూడా ఆయనను అడిగారు. ‘నేను ఆయనను (మోడీని) ద్వేషించడం లేదు. ఆయన నా మావగారా లేక ఆయనతో నాకు ఆస్తి సంబంధించిన సమస్యలు ఉన్నాయా? నేను పన్నుల చెల్లింపుదారుని మాత్రమేనని చెబుతున్నాను. మీ జీతాన్ని నేను చెల్లించాను. కానీ మీ సేవకునిగా నన్ను పరిగణిస్తున్నారు. ఇప్పుడు అది పని చేయదు. ఆయనను తన బాధ్యత నిర్వర్తించవలసిందని అడుగుతున్నాను’ అని ప్రకాశ్ రాజ్ చెప్పారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News