Friday, May 10, 2024

రాహుల్ తీరుపై ప్రణబ్ ముఖర్జీలో అసంతృప్తి

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ తీరుపై తన తండ్రి, మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారని ఆయన కుమార్తె శర్మిష్ఠ ముఖర్జీ వెల్లడించారు. అవినీతి కేసులో శిక్ష పడిన ఆర్‌జెడి అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ వంటి నాయకులపై అనర్హత వేటు పడకుండా కాపాడేందుకు 2013లో అప్పటి యుపిఎ ప్రభుత్వం తీసుకువచ్చిన ఆర్డినెన్స్‌ను రాహుల్ గాంధీ చింపివేయడం పట్ల తన తండ్రి తీవ్రంగా కలత చెందారని ఒక ఆంగ్ల ప్రతికకు ఇచ్చిన ఇంటర్వూలో కాంగ్రెస్ అధికార ప్రతినిధిగా ఉన్న శర్మిష్ఠ తెలిపారు. తన తండ్రి తనతో పంచుకున్న వ్యక్తిగత మనోభావాలను ఆమె మై ఫాదర్: ఎ ఎ డాటర్ రిమెంబెర్స్ పేరిట రచించారు. త్వరలో విడుదల కానున్న ఈ పుస్తకంలోని అంశాలను ఆమె ఇంటర్వూలో వెల్లడించారు.

రాహుల్ గాంధీ వ్యాఖ్యలు రాజకీయ అపరిపక్వతతో కూడుకున్నవిగా తన తండ్రి భావించేవారని, అంతేగాక 2014 లోక్‌సభ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ ఓటమి తర్వాత రాహుల్ పార్లమెంట్‌కు తరచు డుమ్మా కొట్టడం పట్ల తన తండ్రి అసంతృప్తి వ్యక్తం చేసేవారని ఆమె గుర్తు చేసుకున్నారు. కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ తనను ప్రధాన మంత్రి పదవిలో కూర్చోపెడతారని తాను ఆశించడం లేదని ఒక జర్నలిస్టుకు ఇచ్చిన ఇంటర్వూలో తన తండ్రి చెప్పారని ఆమె తెలిపారు. ప్రధాన మంత్రి పదవికి తన తండ్రితోపాటు మన్మోహన్ సింగ్ పేరు పరిశీలనలో ఉన్నట్లు ఊహాగానాలు సాగాయని ఆమె చెప్పారు. మీరు ప్రధాని అవుతారా అని తాను తండ్రిని ఎంతో ఆతృతగా ప్రశ్నించగా లేదు అని చెబుతూ మన్మోహన్ సింగ్ ప్రధాని అవుతారని ఆయన చెప్పారని శర్మిష్ఠ తెలిపారు.

2009 సార్వత్రిక ఎన్నికలకు ముందు జరిగిన కాంగ్రెస్‌వర్కింగ్ కమిటీ(సిడబ్లుసి) సమావేశంలో పాల్గొన్న రాహుల్ గాంధీ తాను సంకీర్ణ ప్రభుత్వానికి వ్యతిరేకమని చెప్పిన విషయాన్ని తన తండ్రి చెప్పగా విన్నానని ఆమె తన పుస్తకంలో రాశారు. అయితే నీ ఆలోచనలు ఏమిటో స్పష్టంగా చెప్పాలని రాహుల్ గాంధీకి ప్రణబ్ ముఖర్జీ సూచించగా తాను వచ్చి విడిగా మాట్లాడతానని రాహుల్ అప్పుడు చెప్పారు. 2004 నుంచి 2014 వరకు యుపిఎ హయాంలో వారిద్దరూ తరచూ కలుసుకున్న సందర్భాలు చాలా తక్కువని శర్మిష్ఠ తెలిపారు. ప్రధాన మంత్రి పదవిని చేపట్టాలన్న రాహుల్ అఆలోచనలను తన తండ్రి ఒక సందర్భంలో ఎత్తిపొడిచిన విషయాన్ని ఆమె గుర్తు చేశారు. ఒక రోజు ఉదయం ముఘల్ గార్డెన్స్‌లో తన తండ్రి వాకింగ్ చేస్తుండగా రాహుల్ వచ్చారని ఆమె తెలిపారు.

వాకింగ్ చేస్తున్నపుడు, పూజ చేసేటప్పుడు ఎవరూ తన ఏకాంతానికి భండగం కలిగించడాన్ని తన తండ్రి సహించేవారు కారని, కాని ఆ రోజు ఉదయం వాకింగ్ చేస్తుండగా తన తండ్రిని రాహుల్ కలిశారని ఆమె చెప్పారు. నిజానికి తన తండ్రిని సాయంత్రం కలవాల్సిన రాహుల్ ఉదయం కలిసినట్లు తన దృష్టికి రాగా ఇదే విషయాన్ని తన తండ్రికి చెప్పానని ఆమె పేర్కొన్నారు. దీనిపై తన తండ్రి స్పందిస్తూ రాహుల్ కార్యాలయానికి ఎఎంకు పిఎంకు(ఉదయం, సాయంత్రం) తేడా తెలియకపోతే ఆయనెలా ప్రధాన మంత్రి కాగలరు అని ఎద్దేవా చేశారని ఆమె గుర్తు చేసుకున్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News