Thursday, March 28, 2024

సంక్రాంతి నాటికి డబుల్ బెడ్‌ రూం ఇండ్లు

- Advertisement -
- Advertisement -

సంక్రాంతి నాటికి డబుల్ బెడ్‌రూం ఇండ్లు
 లబ్దిదారుల వివరాలను ఆన్‌లైన్‌లో నమోదు చేయాలి
 రాష్ట్ర, రోడ్లు, భవనాలు, గృహ నిర్మాణ శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి
మన తెలంగాణ/కరీంనగర్ ప్రతినిధి: రాష్ట్ర వ్యాప్తంగా డబుల్‌బెడ్‌రూం ఇండ్లను సంక్రాంతి (2023 జనవరి 15) నాటికి లబ్దిదారులకు పంపిణీకి సిద్థం చేయాలని రాష్ట్ర, రోడ్డు, భవనాలు, శాసనసభ వ్యవహారాల, గృహానిర్మాణ శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. గురువారం హైదరాబాద్ నుంచి ఆయన రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్‌కుమార్, హౌసింగ్ స్పెషల్ చీఫ్ సెక్రటరీ సునీల్‌శర్మ, రాష్ట్ర ఉన్నత అధికారులతో కలిసి జిల్లా కలెక్టర్లతో వీడియో సమావేశం నిర్వహించి రెండు పడక గదుల గృహ నిర్మాణం పురోగతి, తెలంగాణ క్రీడా ప్రాంగణాలు, బృహత్ ప్రకృతి వనాలు, పోడు భూములు, భూసమస్యలు తదితర అంశాలపై సమీక్షించారు. ఈ సందర్భంగా మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా 18 వేల 328 కోట్ల వ్యయంతో 2.91 లక్షల డబుల్‌బెడ్‌రూం ఇండ్లు నిర్మించి, పేద ప్రజలు ఆత్మగౌరవంతో జీవించేలా వంద శాతం సబ్సిడీతో పంపిణీ చేసేలా సీఎం కేసీఆర్ ప్రాజెక్టును రూపొందించారని తెలిపారు.

జీహెచ్‌ఎంసీ పరిధి మినహాయించి రాష్ట్ర వ్యాప్తంగా 62 వేల డబుల్‌బెడ్ రూం ఇండ్లు పూర్తయ్యాయని, 40 వేల ఇండ్లు నిర్మాణం తుది దశలో ఉన్నాయని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా 33 వేల మంది లబ్దిదారులను ఎంపిక చేసి వారికి 26 వేల ఇండ్లను అందజేస్తామని మంత్రి తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా 283 కాలనీలో 18 వేల డబుల్‌బెడ్ రూం ఇండ్ల పంపిణీకి సిద్దంగా ఉన్నాయని, సంబంధించిన ఎమ్మెల్యేలతో సమన్వయం చేసుకుంటూ త్వరగా పంపిణీ చేయాలని కలెక్టర్లకు మంత్రి సూచించారు.

రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్‌కుమార్ మాట్లాడుతూ డబుల్‌బెడ్ రూమ్ ఇండ్ల లబ్దిదారుల ఎంపిక, తుది దశలో ఉన్న ఇండ్ల నిర్మాణం, మౌళిక వసతుల కల్పన వంటి అంశాలపై జిల్లాకు ప్రత్యేక కార్యచరణ రూపొందించుకుని అమలు చేయాలని ఆయన సూచించారు. జిల్లా కలెక్టర్ ఆర్‌వి కర్ణన్ మాట్లాడుతూ జిల్లాలో 6494 డబుల్‌బెడ్ రూమ్ మంజూరైనవని, 2769 ప్రారంభించినట్లు, 1177 ఇండ్లు పూర్తయినైనవని 438 ఇండ్లు పంపిణీ చేయడం జరిగిందని తెలిపారు. ఈ వీడియో కాన్పరెన్స్‌లో అదనపు కలెక్టర్లు గరీమ అగర్వాల్, జీవీ శ్యాంప్రసాద్‌లాల్, జిల్లా సాంఘిక సంక్షేమ అధికారి నెతినియల్, జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారి శ్రీలత, ఇంజనీరింగ్ అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News