ఈ నెల 28న రాష్ట్రానికి వస్తున్న రాష్ట్రపతి పర్యటన సందర్భంగా చేపట్టాల్సిన ఏర్పాట్లపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి శనివారం సచివాలయంలో అధికారులతో సమావేశమై సమీక్షించారు. రాష్ట్రానికి తన ఒకరోజు పర్యటన సందర్భంగా రాష్ట్రపతి ఉదయం నల్సార్ యూనివర్సిటీ ఆఫ్ లా స్నాతకోత్సవానికి హాజరవుతారని ఆమె తెలిపారు. అనంతరం సాయంత్రం రాష్ట్రపతి నిలయంలో భారతీయ కళా మహోత్సవ్‌ను రాష్ట్రపతి ప్రారంభిస్తారు. శాఖల మధ్య సంపూర్ణ సమన్వయం ఉండేలా ముందస్తుగా అన్ని ఏర్పాట్లు చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అధికారులను ఆదేశించారు. బ్లూ బుక్ ప్రకారం తగిన భద్రతా ఏర్పాట్లు, శాంతిభద్రతలు, ట్రాఫిక్, బందోబస్త్ ఏర్పాట్లు చేయాలని పోలీసు శాఖను కోరారు. అదేవిధంగా, విమానాశ్రయం, రాష్ట్రపతి నిలయం, అన్ని వేదికల వద్ద తగినన్ని అగ్నిమాపక పరికరాలు ఏర్పాట్లు చేయాలని కోరారు. రాష్ట్రపతి కార్యాలయ అవసరాలకు అనుగుణంగా సహాయక సిబ్బందితో పాటు మహిళా వైద్యుల సేవలను అందుబాటులో ఉంచాలని, అవసరమైన వైద్య ఏర్పాట్లు చేయాలని ఆరోగ్య శాఖ అధికారులను కోరారు.
రాష్ట్రపతి కాన్వాయ్ ఉపయోగించాల్సిన రోడ్ల మరమ్మతులను కంటోన్మెంట్ బోర్డు, జీహెచ్‌ఎంసీ అధికారులతో సమన్వయంతో చేపట్టాలని ఆర్‌అండ్‌బి శాఖ అధికారులను ఆదేశించారు. రాష్ట్రపతి నిలయంలో పాములు పట్టేవారిని అందుబాటులో ఉంచాలని, అలాగే రాష్ట్రపతి నిలయం పరిసర ప్రాంతాల్లో కోతుల బెడద, తేనెటీగలు వంటి వాటి నివారణకు ప్రత్యేక బృందాలను జీహెచ్‌ఎంసీ సమన్వయంతో ఏర్పాటు చేయాలని అటవీ శాఖ అధికారులను ఆదేశించారు. రాష్ట్రపతి సందర్శనకు వెళ్లే అన్ని ప్రాంతాల్లో నిరంతరాయంగా విద్యుత్ సరఫరా చేయాలని ఇంధన శాఖ అధికారులను ఆదేశించారు. డీజీపీ జితేందర్, హోం శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రవిగుప్తా, డీజీ ఫైర్ సర్వీసెస్ నాగిరెడ్డి, గవర్నర్ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం, అటవీ శాఖ ముఖ్య కార్యదర్శి అహ్మద్ నదీమ్, పొలిటికల్ కార్యదర్శి రఘునందన్ రావు, పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ కార్యదర్శి లోకేష్ కుమార్, సమాచార పౌర సంబంధాల స్పెషల్ కమిషనర్ హనుమంత రావు, ఆరోగ్య శాఖ కార్యదర్శి క్రిస్టినా జెడ్ చొంగ్తు, జీహెచ్‌ఎంసీ కమిషనర్ అమ్రపాలి, సీఎండీ టీఎస్‌పీడీసీఎల్ ముషారఫ్, ఇతర అధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.