Tuesday, June 3, 2025

స్వీయ భద్రతతో ప్రమాదాల నివారణ

- Advertisement -
- Advertisement -

ఖర్చు తక్కువైనా చిన్నచూపే
ప్రమాదాల నివారణలో స్మోక్ డిటెక్టర్ కీలకం
సాంకేతిక వినియోగంతో అగ్ని ప్రమాదాల తీవ్రతను అరికట్టడంలో మెరుగైన పాత్ర పోషిస్తున్నాం
విస్తృతంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం
బిల్డింగ్ అనుమతుల్లో అగ్ని ప్రమాదాలు నివారించే పరికరాలు తప్పనిసరిగా అమర్చుకునే విధానం రావాలి
అగ్నిమాపక శాఖ డిజి నాగిరెడ్డి

మన తెలంగాణ/హైదరాబాద్: స్వీయ భద్రతతో అగ్ని ప్రమాదాలను (Preventing fire accidents) నివారించవచ్చు. ఇళ్లు, వ్యాపార సముదాయాలు నిర్మించుకునే వారు అగ్ని ప్రమాదాలను ముందస్తు గానే పసిగట్టే స్మోక్ డిటెక్టర్‌లు ఏర్పాటు చేసుకోవాలి. అగ్నిప్రమా దాలను గమనించిన వెంటనే ఫైర్ స్టేషన్‌కు(112), లేదా పోలీస్ శాఖకు (100) ఫోన్ చేస్తే సాధ్యమైనంత త్వరగా సంఘటనా స్థలానికి చేరుకొని ప్రమాద తీవ్రతను తగ్గించగలుగుతాం. రాష్ట్ర వ్యాప్తంగా అగ్నిమాపక కార్యాలయాల్లో సాంకేతికను విని యోగిస్తున్నాం. అగ్నిమాపక శాఖ నుంచి ఇవ్వాల్సిన అనుమతులను, నిబంధనల ప్రకారం అన్ని పత్రాలు ఉంటే కేవలం తోమ్మిది రోజుల్లోనే అనుమతులు ఇస్తున్నామని అగ్నిమాపక శాఖ డైరెక్టర్ జనరల్ నాగిరెడ్డి పేర్కొన్నారు. ఈ సందర్భంగా అగ్ని ప్రమాదాల నివారణకు సంబంధించి పలు అంశాలను ‘మనతెలంగాణ’తో పంచుకున్నారు. అగ్ని ప్రమాదాలు జరిగిన వెంటనే తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ప్రమాదాలు జరగకుండా చేపట్టాల్సిన పలు అంశాల గురించి ఆయన వివరించారు.

అగ్ని ప్రమాదాల నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటీ?

నూతనంగా ఇళ్లు, వ్యాపార సముదాయాలు నిర్మించుకునే వారు అగ్ని ప్రమాదాలను ముందస్తుగానే పసిగట్టే స్మోక్ డిటెక్టర్‌లు ఏర్పాటు చేసుకోవాలి. లక్షల రూపాయల వ్యయంతో నిర్మించే, నిర్మాణాల్లో అతి తక్కువ ఖర్చుతో ఏర్పాటు చేసుకునే స్మోక్ డిటెక్టర్‌లు లేకపోవడంతో అగ్ని ప్రమాదాలను గుర్తించడంలో బాధితులు విఫలమవుతున్నారు.

స్మోక్ డిటెక్టర్ ఎలా పనిచేస్తుంది?

అగ్ని ప్రమాదం జరిగితే మొదటగా పొగ వస్తుంది. ఈ స్మోక్ డిటెక్టర్ ప్రమాదంలో ఏర్పడిన పొగను గుర్తించి అలారంతో హెచ్చరిస్తుంది. దీంతో అక్కడ ఉన్న వారందరూ అప్రమత్తం కావొచ్చు.

స్మోక్ డిటెక్టర్ ఎంత వ్యయం అవుతుంది ?

లక్షలాది రూపాయలతో నిర్మించే భవన సముదాయాల్లో సుమారు రూ.10 వేల వ్యయంతో రెండు వేల చదరపు అడుగుల నిర్మాణ సముదాయానికి స్మోక్ డిటెక్టర్ ఏర్పాటు చేసుకోవచ్చు. భవన నిర్మాణాల విస్తీర్ణం, ఎంపిక చేసుకునే స్మోక్ డిటెక్టర్లకు అనుగుణంగా ఖర్చు పెరగవచ్చు, లేదా తగ్గవచ్చు.

కేవలం స్మోక్ డిటెక్టర్‌తో నివారణ సాధ్యమేనా?

కాదు, అది కేవలం అప్రమత్తం చేయడానికి మాత్రమే పనిచేస్తుంది. దీంతో పాటు వాటర్ మోటారు, చిన్న చిన్న స్పింక్లర్లు, ఏర్పాటు చేసుకోవాలి. భారీ భవనాలు, వ్యాపార సముదాయాలయితే అగ్నిపమాక శాఖ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలి. వాటి ప్రకారం పరికరాలు ఏర్పాటు చేసుకోవాలి.

ప్రమాదాన్ని గమనించిన వెంటనే చేపట్టాల్సిన చర్యలు ఏమిటీ?

అగ్ని ప్రమాదం గమనించిన వెంటనే అధిక శాతం బాధితులు మంట లను ఆర్పేందుకు తమవంతు ప్రయత్నం చేస్తారు. అదుపులోకి వస్తే సరే, లేకపోతే అప్పుడు అగ్నిమాపక కార్యాలయానికి సమాచారం అందిస్తారు. దీనివల్ల నష్టం అధికంగా జరిగే ప్రమాదం ఉంది. అలా కాకుండా గమనించిన వెంటనే ఫైర్ స్టేషన్‌కు(112), నెంబర్ గుర్తు లేకపోతే పోలీస్ శాఖకు (100) ఫోన్ చేయాలి. పోలీస్ స్టేషన్‌కు ఫోన్ చేసినా ఫైర్ స్టేషన్‌కు వెంటనే సమాచారం ఇస్తారు. ఫైర్ స్టేషన్‌కు సమాచారం వచ్చిన వెంటనే సాధ్యమైనంత త్వరగా అగ్నిమాపక యంత్రం సంఘటనా స్థలానికి చేరుకుంటుంది.

ఇటీవల జరిగిన అగ్ని ప్రమాదం ఇంటీరియర్ డిజైన్ మెటీరియల్ వల్లనే ప్రమాద తీవ్రత ఎక్కువగా ఉందని ప్రచారం జరుగుతోంది వాటిలో నిజం ఎంత ?

ఇంటీరియర్ డిజైన్ మెటీరియల్ వల్లనే అని చెప్పలేం. కానీ, అవకాశం మాత్రం ఉంది. ఇటీవల ఇంటీరియర్ డిజైన్‌లో వాడే మెటీరియల్ ప్లాస్టిక్, సింథటిక్ ఇలా సులువుగా మండే గుణం ఉన్నవి అధికంగా ఉన్నాయి. వాటివల్ల ప్రమాద తీవ్రత పెరిగే అవకాశం ఉంది.

డిజిగా బాధ్యతలు తీసుకున్న తరువాత చేపట్టిన కార్యక్రమాలు?

డిజిగా బాధ్యతలు చేపట్టిన తరువాత అంతర్గతంగా సంస్కరణలు తీసుకొచ్చా. ప్రభుత్వం, ఉన్నతాధికారుల సహకారంతో అగ్నిమాపక శాఖలో నూతన సాంకేతిక పరిజ్ఞానం వినియోగిస్తున్నాం. నిరంతర శిక్షణతో సిబ్బంది అప్రమత్తంగా పనిచేయిస్తున్నా. ఇటీవల గుల్జార్ హౌస్ ఘటనలో కేవలం 10 నిమిషాల్లోనే యంత్రాలు అక్కడికి చేరుకొని పక్కన ఉన్న ఇతర వ్యాపార భవనాలకు మంటలు చేరకుండా అదుపు చేయగలిగాం. గతేడాది అనేక సందర్భాల్లో రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 60 వేల అవగాహన కార్యక్రమాలు నిర్వహించాం. ఈ కార్యక్రమాలతో ప్రజల నుంచి మంచి స్పందన వచ్చింది.

రాష్ట్ర వ్యాప్తంగా అగ్నిమాపక కార్యాలయాల పరిస్థితి ఏ విధంగా ఉంది ?

రాష్ట్ర వ్యాప్తంగా అన్ని అగ్నిమాపక కార్యాలయాల్లో (Preventing fire accidents) దాదాపుగా సిబ్బంది పూర్తి స్థాయిలో ఉన్నారు. అగ్ని ప్రమాదాలు, ప్రకృతి విపత్తు పట్ల అప్రమత్తంగానే ఉంటున్నారు. గత సంవత్సరం వర్షాకాలంలో అకాల వరదలకు మా సిబ్బంది ఎంతో నిబద్దతో పనిచేశారు.  రాష్ట్ర వ్యాప్తంగా అగ్నిమాపక కార్యాలయాల్లో సాంకేతికను వినియోగిస్తున్నాం. అగ్నిమాపక శాఖ నుంచి ఇవ్వాల్సిన అనుమతులను, నిబంధనల ప్రకారం అన్ని పత్రాలు ఉంటే కేవలం తొమ్మిది రోజుల్లోనే ఇస్తున్నాం. నిరంతరం ప్రజల రక్షణ కోసం అగ్నిమాపక శాఖ పనిచేస్తుంది. కానీ, చిన్న చిన్న భద్రతా కారణాలతో పెద్ద పెద్ద ప్రమాదాలను నివారించవచ్చు. ఈ విషయంపై అవగాహన లేకపోవడం ప్రధాన సమస్యగా ఉంది. భవన నిర్మాణ సమయంలో ఇచ్చే అనుమతుల్లోనే అగ్ని ప్రమాదాలను నివారించే పరికాలు తప్పనిసరిగా అమర్చుకునే విధానం ఉంటే అగ్ని ప్రమాదాల నివారణకు మరింత అవకాశం ఉంటుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News