Saturday, September 21, 2024

పదేళ్ల పాటు నరకప్రాయ జీవితం

- Advertisement -
- Advertisement -

ఆదివాసీల పక్షాన పోరాడినందుకు అక్రమంగా ఉపా కేసు
నా తల్లి కడచూపు దక్కనీయలేదు
గ్యాంగ్‌స్టర్లకు బెయిల్ దొరుకుతుంది కానీ హక్కుల కార్యకర్తలకు దొరకదు
పౌరహక్కుల నేత, ప్రొఫెసర్ జి.ఎన్. సాయిబాబా

మన తెలంగాణ/హిమాయత్‌నగర్: ఢిల్లీ పోలీసులు తనను కిడ్నాప్ చేసి అక్రమంగా అరెస్టు చేయడంతో పదేళ్ళ పాటు తాను జైల్లో చీకటి జీవితం గడిపానని పోలీసులు అనేక చిత్రహింసలకు గురిచేయడంతో మానసిక క్షోభ అనువించానని పౌరహక్కుల నేత, ప్రొఫెసర్ జి. ఎన్ సాయిబాబా తెలిపారు. తన తల్లి చనిపోతే చూసేందుకు జైలు అధికారులు అనుమతి ఇవ్వకపోవడంతో క డచూపును కూడా నోచుకోలేదని ఆయన అవేదన వ్య క్తం చేశారు. శుక్రవారం బషీర్‌బాగ్ ప్రెస్‌క్లబ్‌లో టియుడబ్లూజే ఆధ్వర్యంలో
నిర్వహించిన ‘మీట్ ది ప్రెస్’లో ఆయన మాట్లాడారు.

గ్రీన్ హంట్ ఆపరేషన్‌కు వ్యతిరేకిస్తూ ఆదివాసీల పక్షాన నిలబడిన పాపానికి ఉపా కేసు నమోదు చేసి నాగ్‌పూర్ సెంట్రల్ జైలులో పెట్టారన్నారు.దేశంలో గ్యాంగ్‌స్టర్‌లకు సైతం బెయిల్ దొరుకుతుందని,హక్కుల కార్యకర్తలకు మాత్రం బెయిల్ దొరకదన్నారు. తన కేసు విషయంలో బొంబాయి కోర్టు అనేక బెంచ్‌లను మార్చిందని,చివరకు సుప్రీంకోర్టు ఒక మేధావిని హింసించడం తప్పు అని మాత్రమే చెప్పిందని గుర్తు చేశారు. మహారాష్ట్ర జైలులో కులానికి అధిక ప్రాధాన్యతను ఇస్తాయని,జైలుకు వచ్చే ఖైదీలకు కులాన్ని బట్టి పనికల్పిస్తారని ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. కొత్తగా జైలుకు వచ్చిన వారిని గుట్టు చప్పుడు కాకుండా సిసి కెమెరాలు లేనిప్రాంతంలో ఉంచి చిత్ర హింసలకు గురిచేస్తారని ఆరోపించారు.

రాజ్యాంగ వ్యతిరేక వ్యక్తులుగా ముద్ర వేసిన వారికి మహారాష్ట్ర జైల్లో చిత్రహింసలు తప్పవని, జైలు మ్యానిఫెస్టోలోనే ఈ విషయాలు ఉన్నాయని ఆయన ఆరోపించారు.తనను అరెస్టు చేసి జడ్జి మందు హాజరు పర్చిచిన సమయంలో పోలీసు కస్టడీకి ఇవ్వాలని అడిగారని, కానీ పోలీసు అధికారులు కస్టడికి వద్దని నేరుగా జైలుకు పంపాలని న్యాయమూర్తికి విన్నవించడంతో తాను ఏ నేరం చేయలేదనే విషయం మహారాష్ట్ర పోలీసులు అంగీకరించారని ఆయన స్పష్టం చేశారు. మహారాష్ట్ర జైళ్ళు ఎంత అధ్యాన్నంగా ఉన్నాయో ఆ రాష్ట్ర మాజీ హోం శాఖ మంత్రి జైలుకు వెళ్లి వచ్చిన తరువాత ఆయన చేసిన ఆరోపణలు ఇందుకు నిదర్శమని చెప్పారు. దివ్యాంగుడినని చూడకుండా మహారాష్ట్ర పోలీసులు తన వీల్‌చైర్‌ను ధ్వంసం చేశారని, నాగపూర్ జైల్లో కనీసం వీల్‌చైర్ తిరుగని సెల్‌లో బంధించారని అవేదన వ్యక్తం చేశారు.

తనకు జైల్లో ఉన్నప్పుడు 21 రకాల ఆరోగ్య సమస్యలు వచ్చాయని, జైలు అధికారులు తొమ్మిది నెలల పాలు ఆసుపత్రికి కూడా తీసుకువెళ్ళలేదని తెలిపారు. ఉపా చట్టానికి వ్యతిరేకంగా మానవ హక్కుల కార్యకర్తగా ముందుకు వెళ్తానని ఆయన వెల్లడించారు. తెలంగాణ రాష్ట్రం తనకు విజ్ఞానాన్ని అందించిందని, దేశవ్యాప్తంగా అడవుల్లో ఉన్న ఆదివాసీలు నివసిస్తున్న ప్రాంతాలను ఖాళీ చేయాలని కార్పొరేట్ సంస్థలు చూస్తున్నాయని,అందుకు ఛత్తీస్‌ఘడ్ రాష్ట్రం,బాస్తర్ జిల్లాలోని అనేక గ్రామాలను ఖాళీ చేయించారని, దీంతో రెండు కోట్ల మంది ఆదివాసీల జాడ తెలియడం లేదన్నారు. ఉక్కు కౌగిలి నుండి తెలంగాణ ప్రజలు బయటపడ్డారని,ప్రజల ఆకాంక్షలను ప్రభుత్వాలు నేరవేర్చాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఫ్రొపెసర్ హరగోపాల్, టియుడబ్లూజే రాష్ట్ర అధ్యక్షుడు విరాహత్ అలీ పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News