Thursday, May 8, 2025

రవీంద్రుడు.. దేశభక్తి పరాయణుడు

- Advertisement -
- Advertisement -

ఒక కలం, ఒక గళం, ఒక పదమై, ఒక పాటై, ఒక సంగీతమై, కవిత్వమై, రచనా వ్యాసంగమై కేవలం వంగ భూమినే కాకుండా యావత్ భారతాన్ని, ప్రపంచాన్ని అలరించింది. రవీంద్రనాథ్ ఠాగూర్‌ను సాహితీ వినీలాకాశంలో ధ్రువతారగా నిలబెట్టింది. విశ్వకవిగా పేరుగడించిన రవీంద్రనాథ్ ఠాగూర్ బహుముఖ ప్రజ్ఞాశాలిగా రాణించాడు. కవిగా, రచయితగా, సంఘసంస్కర్తగా బహుముఖ పాత్ర పోషించాడు. అనితర సాధ్యమైన ప్రజ్ఞాపాటవాన్ని ప్రదర్శించాడు. బ్రిటీషు పాలనకు వ్యతిరేకంగా గళమెత్తాడు. బెంగాల్ పునరుజ్జీవన ఉద్యమంలో కీలక భూమిక పోషించాడు. భారతదేశానికి అర్ధవంతమైన జాతీయ గీతం ‘జనగణమన..’ రచీంచాడు. బంగ్లాదేశ్ జాతీయ గీతాన్ని కూడా రవీంద్రుడు రచించాడు. ఎక్కడ ప్రతిభ ఉన్నా గుర్తించి గౌరవించడం వలన మన గొప్పదనం ప్రస్ఫుటమవుతుంది. మన వ్యక్తిత్వం సమాజానికి అవగతమవుతుంది.

దురదృష్ట వశాత్తూ ఇలాంటి లక్షణాలు వర్తమాన సమాజంలో మచ్చుకైనా కానరావు. అహం స్వవినాశనానికి దారితీయడమే కాకుండా, సమాజ వికాసానికి కూడా అడ్డుకట్టగా మారుతుంది. ప్రజ్ఞాపాటవాలు స్వయం కృషితో మాత్రమే సిద్ధిస్తాయి. ఆసక్తి, పట్టుదల వలన అనితర సాధ్యమైన ప్రతిభ స్వంతమవుతుంది. ఎలాంటి కృషిలేకుండా వడ్డించిన విస్తరిలా ప్రతిభ మన ముంగిట వాలదు. ప్రతిభను ప్రపంచానికి వెల్లడి కాకుండా అడ్డుకోవడం వలన అంతిమంగా నష్టమే వాటిల్లుతుంది. ఇతరులలోని ప్రతిభను గుర్తించి, ప్రోత్సహించడం వలన సమాజానికి మేలు జరుగుతుంది. ప్రతిభకు ఎల్లలులేవు. భాషాభేదాలు అడ్డురావని విశ్వకవి రవీంద్రనాథ్ ఠాగూర్ నిరూపించాడు. బెంగాలీ భాష పట్ల అమితమైన అభిమానమున్నా, ఇతర భాషల్లోని సాహిత్యాన్ని ఆస్వాదించి, అభినందించి, భారతదేశాన్ని ప్రపంచ సాహితీ రంగంలో అగ్రపథంలో నిలిపిన రవీంద్రుడు విశ్వకవిగా విశేష ఖ్యాతినార్జించాడు. రవి గాంచని చోటును కవి గాంచునన్న నానుడిని నిజం చేసిన రవీంద్రుని ప్రతిభ అనన్యసామాన్యం.

తన ఆలోచనలను కవిత్వీకరించి పాశ్చాత్య ప్రపంచానికి సైతం అందించిన ఘనత రవీంద్రునిదే. రవీంద్రుని బాల్యమంతా దాదాపుగా ఒంటరిగానే గడిచింది. సహజమైన విద్యకు అలవాటుపడ్డ రవీంద్రుడు స్వేచ్ఛయుతమైన, జ్ఞానసంపన్నమైన, భయం లేని నూతన ప్రపంచం కోసం పరితపించాడు. బాల్యంలోనే ఒక మంచి కవిగా, రచయితగా పేరు గడించాడు. విమర్శకుల ప్రశంసలు పొందాడు. శాంతి నికేతన్‌ను స్థాపించి, విద్యార్ధులకు క్రమశిక్షణతో కూడిన విద్యను అందించాడు. గురువులకు, విద్యార్థులకు మధ్య అవ్యాజ్యమైన ఆత్మీయతలతో కూడిన వాతావరణాన్ని సృష్టించాడు. సాహిత్యం పట్ల, కళల పట్ల విద్యార్థులకు మక్కువ కలిగించాడు. రవీంద్ర నాథ్ ఠాగూర్ ‘గీతాంజలి’ విశ్వవ్యాప్తంగా ప్రాచుర్యం పొందింది.

సాహిత్యంలో నోబెల్ బహుమతిని సంపాదించి పెట్టింది. భారతదేశంలోనే కాదు ఆసియాలో తొలి నోబెల్ బహుమతి గ్రహీతగా రవీంద్రునికి అవకాశం దక్కింది. ‘గీతాంజలి’ రవీంద్రుని సాహితీ వనంలో విరబూసిన మనోహరమైన కవితాకుసుమం. రవీంద్రుని కావ్య శైలికి, సహజత్వానికి, చైతన్యవంతమైన, అర్ధవంతమైన ప్రపంచ నిర్మాణానికి ‘గీతాంజలి’ ఒక మచ్చుతునక. ప్రకృతిని ఆస్వాదిస్తూ, ప్రకృతి ఒడిలో ప్రశాంతమైన వాతావరణంలో పెరుగుతూ, పెద్దలను గౌరవిస్తూ, క్రమశిక్షణతో జ్ఞానాన్ని ప్రసాదించే చదువులను అభ్యసిస్తూ, సృజనాత్మకతను అలవరచుకుని రవీంద్రనాథ్ ఠాగూర్ బహుముఖ ప్రజ్ఞాపాటవాలను స్ఫూర్తిగా తీసుకుని, ఆయన ఆదర్శాలను దేశభక్తిని, మానవతావాదాన్ని పెంపొందించుకోవాలి. అదే విశ్వకవికి మన మందించే నిజమైన నివాళి.

సుంకవల్లి సత్తిరాజు, 97049 03463

(నేడు రవీంద్రనాథ్ ఠాగూర్ జయంతి)

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News