Sunday, April 28, 2024

లోక్‌సభ సభ్యత్వం రద్దును ఊహించలేదు

- Advertisement -
- Advertisement -

స్టాన్‌ఫోర్డ్( కాలిఫోర్నియా) రాజకీయాల్లోకి వచ్చిన కొత్తల్లో లోక్‌సభ సభ్యత్వం రద్దును తాను ఊహించలేదని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ అన్నారు. అమెరికాలో పర్యటిస్తున్న ఆయన బుధవారం రాత్రి స్టాన్‌ఫోర్డ్ యూనివర్సిటీలో జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. శాన్‌ఫ్రాన్సిస్కోలో భారత సంతతివారినుద్దేశించి మాట్లాడుతూ ప్రధాని నరేంద్ర మోడీపై రాహుల్ విమర్శలు చేసిన విషయం తెలిసిందే. తాజాగా కాలిఫోర్నియాలోని స్టాన్‌ఫోర్డ్‌లో మాట్లాడుతూ ‘2000 సంవత్సరంలో నేను రాజకీయాల్లోకి అడుగుపెట్టిన సమయంలో.. వేటిని ఎదుర్కోవలసి వస్తుందో అస్సలు ఊహించలేదు.

ఇలా జరుగుతుందని(లోక్‌సభ సభ్యత్వం రద్దు) అసలు అనుకోలేదు. కానీ ఆ తర్వాత దీన్ని నాకు లభించిన గొప్ప అవకాశంగా భావించా. నాకు లభించిన వాటిలో ఇదో పెద్ద అవకాశం. రాజకీయాలంటే అలానే ఉండాయి’ అని రాహుల్ అన్నారు. ప్రధాని నరేంద్ర మోడీనుద్దేశించి చేసిన వ్యాఖ్యలకు గాను దాఖలయిన పరువునష్టం కేసులో సూరత్ కోర్టు రెండేళ్ల శిక్ష విధించడంతో కేరళలోని వయనాడు నుంచి పార్లమెంటులో ప్రాతినిధ్యం వహిస్తున్న రాహుల్ గాంధీపై అనర్హత వేటుపడిన విషయం తెలిసిందే.

కాగా భారత్ జోడో యాత్ర గురించి రాహుల్ గాంధీ మాట్లాడుతూ‘ ఈ కథ ఆరు నెలల క్రితం మొదలైంది. అప్పట్లో మేం ఇబ్బందులు పడుతున్నాం. ప్రతిపక్షాలన్నీ చిక్కుల్లో ఉన్నాయి.అధికార పక్ష ఆర్థిక ఆధిపత్యం, సంస్థాగత పెత్తనం నడుస్తున్నాయి.మా దేశంలోనే మేము ప్రజాస్వామ్య పోరాటం చేయడానికి అవస్థలు పడుతున్నాం.ఆ సమయంలో బారత్ జోడో యాత్ర చేయాలనినిర్ణయించుకున్నాను’ అని చెప్పారు.స్వదేశంలో పరిస్థితులను చక్కదిద్దడానికి విదేశీ సాయం కోరుతున్నారా? అని ప్రశ్నించగా తాను ఎవరి సహకారాన్ని కోరడం లేదన్నారు.

మన పోరాటం మనదేనన్న స్పష్టత తనకు ఉందన్నారు. అయితే స్టాన్‌ఫోర్డ్ విశ్వవిద్యాలయంలో భారత్‌నుంచి వచ్చిన విద్యార్థులతో సత్సంబంధాలు కొనసాగించాలని అనుకొంటున్నట్లు వెల్లడించారు. వారితో తాను ముచ్చటించడానికి ఇది మంచి సమయమని అభిప్రాయపడ్డారు. ప్రధాని మోడీ కూడా ప్రజలతో మాట్లాడాలని, కఠినమైన ప్రశ్నలకు సమాధానాలు చెప్పాలని డిమాండ్ చేశారు. కాగా భారత్‌చైనా సంబంధాలు అంత సులువు కాదని, కఠినంగా ఉండబోతున్నాయని ఆయన అన్నారు. అయితే భారత్‌ను వెనక్కి నెట్టడం చైనాకు సాధ్యం కాదని రాహుల్ స్పష్టం చేశారు. కార్యక్రమం ప్రారంభం కావడానికి రెండు గంటల ముందే విద్యార్థులు క్యూ కట్టడంతో ఆడిటోరియం జనంతో కిక్కిరిసి పోయింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News