Thursday, October 10, 2024

ఎంఎస్‌పికి నిర్వచనం తెలుసా రాహుల్ ?: అమిత్ షా ఎద్దేవా

- Advertisement -
- Advertisement -

రేవారి(హర్యానా): లోక్‌సభలో ప్రతిపక్ష నాయకుడు, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీపై కేంద్ర హోం మంత్రి అమిత్ షా వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ఎంఎస్‌పి(కనీస మద్దతు ధర) పూర్తి నిర్వచనం ఏమిటో కూడా రాహుల్‌కు తెలియదంటూ ఆయన ఎద్దేవా చేశారు. హర్యానాలోని బిజెపి ప్రభుత్వం 24 పంటలను కనీస మద్దతు ధరపై సేకరిస్తోందని షా చెప్పారు. శుక్రవారం నాడిక్కడ ఒక ఎన్నికల ప్రచార సభలో అమిత్ షా ప్రసంగిస్తూ ఎంఎస్‌పిని ప్రస్తావిస్తే మనకు ఓట్లు వస్తాయని ఏదో ఎన్‌జిఓ రాహుల్‌కు చెప్పిందని అన్నారు. ఎంఎస్‌పికి పూర్తి నిర్వచనం ఏమిటో తెలుసా రాహుల్ బాబా అంటూ ఆయన ప్రశ్నించారు. ఖరీఫ్‌లో ఏఏ పంటలు ఉంటాయి..రబీలో ఏఏ పంటలు ఉంటాయో తెలుసా అంటూ ఆయన నిలదీశారు.

హర్యానాలో రైతుల నుంచి 24 పంటలను ఎంఎస్‌పితో ప్రభుత్వం సేకరిస్తోందని, కాంగ్రెస్ పాలిత ఏ రాష్ట్రం ఇన్ని పంటలను ఎంఎస్‌పితో కొనుగోలు చేస్తోందో హర్యానాలోని కాంగ్రెస్ నాయకులు చెప్పాలని ఆయన డిమాండు చేశారు. కర్నాటక, తెలంగాణలో ఎంఎస్‌పితో ఎన్ని పంటలను కొనుగోలు చేస్తున్నారని హోం మంత్రి ప్రశ్నించారు. కాంగ్రెస్ హయాంలో క్వింటాలుకు రూ. 1300 రేటుపై ధాన్యం కొనుగోలు చేసేవారని, కాని ఇప్పుడు క్వింటాలకు రూ. 2,300 ఇస్తున్నామని ఆయన తెలిపారు. హర్యానాలో బిజెపి ప్రభుత్వాన్ని ఎన్నుకుంటే క్వింటాలకు రూ. 3,100 చెల్లిస్తామని ఆయన హామీ ఇచ్చారు.

దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న ఒక ర్యాంకు, ఒక పెన్షన్ డిమాండును నరేంద్ర మోడీ ప్రభుత్వం నెరవేర్చిందని ఆయన తెలిపారు. హర్యానాలో సమన్యాయం అందచేసే పాలనను అందించామని ఆయన తెలిపారు. గత పదేళ్లలో అవినీతిని అంతం చేశామని ఆయన చెప్పారు. గతంలో హర్యానాలో కాంగ్రెస్ ప్రభుత్వాలు కమీషన్లు, అవినీతి, ప్రాతిపదికన నడిచేవని, డీలర్లు, దళారులు, అల్లుళ్లు రాష్ట్రాన్ని పాలించేవారని కాని ఇప్పుడు డీలర్లు, దళారులు, అల్లుళ్లు లేరని ఆయన వ్యాఖ్యానించారు. అక్టోబర్ 5న హర్యానా అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. అక్టోబర్ 8న ఫలితాలు వెలువడనున్నాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News