Sunday, May 19, 2024

యుపిలో ఇండియా కూటమి తుపాన్ వస్తోంది:రాహుల్ గాంధీ

- Advertisement -
- Advertisement -

ఉత్తర ప్రదేశ్‌లో ఇండియా కూటమి తుపాన్ వస్తున్నదని కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ శుక్రవారం చెప్పారు. నరేంద్ర మోడీ ఈ దఫా ప్రధాని పదవిని అధిష్ఠించలేరని రాహుల్ ఉద్ఘాటించారు. కన్నౌజ్‌లో ఒక ర్యాలీలో రాహుల్ ప్రసంగిస్తూ, ‘నరేంద్ర మోడీ భారత ప్రధాని కాబోవడం లేదని రాతపూర్వక గ్యారంటీగా మీరు తీసుకోండి’ అని చెప్పారు. సమాజ్‌వాది పార్టీ (ఎస్‌పి) అధ్యక్షుడు అఖిలేశ్ యాదవ్ లోక్‌సభ ఎన్నికల్లో కన్నౌజ్ నుంచి పోటీ చేస్తున్నారు. బిజెపి ఎన్నికల్లో ఓడిపోవడం తథ్యమని రాహుల్ జోస్యం చెబుతూ, ‘ఆప్ లిఖ్ కే లే లో (రాతపూర్వకంగా తీసుకోండి)’ అని అన్నారు. రాహుల్, అఖిలేశ్‌తో పాటు ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) నేత సంజయ్ సింగ్ కూడా సమష్టి ఇండియా కూటమి ర్యాలీలో ప్రసంగించారు. ఉత్తర ప్రదేశ్‌లోని 80 లోక్‌సభ సీట్లలో 17 సీట్లకు కాంగ్రెస్ పోటీ చేస్తోంది. క్రితం సారి బిజెపి 62 సీట్లు కైవసం చేసుకోగా దాని మిత్ర పక్షం అప్నా దళ్ (ఎస్)కు రెండు సీట్లు లభించాయి. గత సంవత్సరాల్లో ఇండియా కూటమి అవసరమైన ఎన్నికల సన్నాహాలు చేసిందని రాహుల్ తెలిపారు. ఆయన ఈ సందర్భంగా తన భారత్ జోడో యాత్ర, న్యాయ్ యాత్ర, ప్రతిపక్ష సమావేశాలను ప్రస్తావించారు. విద్వేష బజార్‌లో ప్రేమ దుకాణాలు తెరిచామని కూడా ఆయన చెప్పారు.

కాంగ్రెస్‌కు, వాణిజ్య దిగ్గజాలు అదానీ, అంబానీ మధ్య సంబంధాలు ఉన్నాయని మోడీ ఈ మధ్య చేసిన ఆరోపణను రాహుల్ ఖండించారు. ’10 ఏళ్లలో అదానీ, అంబానీ పేర్లను నరేంద్ర మోడీజీ ప్రస్తావించకపోవడం మీరు చూశారు’ అని రాహుల్ చెప్పారు. కానీ ఇప్పుడు ఆయన వారి పేర్లు ప్రస్తావిస్తున్నారని, వారు తనను కాపాడతారని ఆయన భావిస్తున్నారని రాహుల్ ఆరోపించారు. ‘ఇండియా కూటమి నన్ను చుట్టుముట్టింది. నేను ఓడిపోతున్నాను. నన్ను కాపాడండి. అదానీ, అంబానీజీ నన్ను కాపాడండి’ అని రాహుల్ వ్యంగ్యంగా అన్నారు. ఆ ఇద్దరు పారిశ్రామికవేత్తలు మోడీ ‘మిత్రులు’ అని ఆయన సూచించారు. ‘ఏ టెంపోలో, ఏ డబ్బును అదానీజీ పంపిస్తారో ఆయనకు కూడా తెలుసు. ప్రధానికి టెంపోతో వ్యక్తిగత అనుభవం ఉంది’ అని రాహుల్ బుధవారం నాటి ప్రధాని ఎన్నికల ప్రసంగాన్ని ఉద్దేశించి చెప్పారు. తమపై నిందలను రాహుల్ ‘ఆపేలా చూసేందుకు’ ఇద్దరు వాణిజ్యవేత్తల నుంచి కాంగ్రెస్ ‘టెంపో నిండుగా నల్ల ధనం’ అందుకుందా అని మోడీ అడిగారు. ర్యాలీ వేదికను చేరుకోకుండా వాహనాలను ఆపుతున్నారన్న ఒక వార్తను రాహుల్ ఉటంకిస్తూ, అఖిలేశ్‌ను కన్నౌజ్ నుంచి గెలవకుండా ఇది నిరోధించలేదని స్పష్టం చేశారు.

‘ఉత్తర ప్రదేశ్‌లో మీరు చూస్తారు. ఇండియా కూటమి తుపాన్ వస్తోందని రాతపూర్వకంగా మీకు ఇస్తున్నాను. మీరు రాతపూర్వకంగా తీసుకోండి. బిజెపికి అతిపెద్ద పరాజయం ఉత్తర ప్రదేశ్‌లో సంభవిస్తుంది’ అని రాహుల్ చెప్పారు. ‘యుపిలో మార్పు చోటు చేసుకోవాలని ప్రజలు నిశ్చయించుకున్నందున ఇది జరుగుతుందని ఆయన చెప్పారు. ఎస్‌పి అధ్యక్షుడు అఖిలేశ్ యాదవ్ ప్రసంగిస్తూ, సార్వత్రిక ఎన్నికల్లో ఇంత వరకు జరిగిన దశల్లో బిజెపి స్కోర్ తక్కువగా ఉందని చెప్పారు. ‘ఉత్తర ప్రదేశ్‌లో పూర్వపు ఎస్‌పి ప్రభుత్వం ‘అభివృద్ది ఉన్నత శిఖరాలను’ కన్నౌజ్ చూసిందని ఆయన తెలిపారు. కన్నౌజ్‌లో ఈ నెల 13న పోలింగ్ జరుగుతుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News