మరోసారి కృష్ణజింకల వేట కేసు తెరపైకి వచ్చింది. ఈ కేసులో బాలీవుడ్ నటీనటులు సైఫ్ అలీఖాన్, టబు, సోనాలి బింద్రేకు రాజస్థాన్ ప్రభుత్వం షాకిచ్చింది. ఈ కేసులో వీరు నిర్దోషులుగా తేల్చడాన్ని సవాల్ చేస్తూ రాజస్థాన్ ప్రభుత్వం హైకోర్టును ఆశ్రయించింది. ప్రభుత్వం దాఖలు చేసిన లీవ్-టు-అప్పీల్ పిటిషన్‌ను శుక్రవారం జస్టిస్ మనోజ్ కుమార్ గార్గ్ కోర్టులో విచారించారు. ఈ విషయాన్ని సంబంధిత పెండింగ్ కేసులతో పాటు జాబితా చేయాలని ఆయన ఆదేశించారు. ఈ కేసులో తదుపరి విచారణ జూలై 28కి వాయిదా వేశారు. దీంతో బాలీవుడ్ తారలు మళ్లీ చట్టపరమైన ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి వచ్చింది.
కాగా, 1999లో విడుదలైన ‘హమ్ సాత్ సాత్ హై’ సినిమా షూటింగ్ కోసం 1998లో సల్మాన్ ఖాన్, సైఫ్ అలీఖాన్, టబు, సోనాలి బింద్రే రాజస్థాన్ వెళ్లారు. ఈ సినిమా షూటింగ్ సమయంలో కృష్ణజింకలను వేటాడి చంపినట్లు ఆరోపణలు వచ్చాయి. ఈ ఘటనలో వారిపై కేసు నమోదు చేశారు. కింది కోర్టు సల్మాన్ ఖాన్ ను దోషిగా కూడా ప్రకటించింది. అయితే, దీనిని ప్రశ్నిస్తూ ఆయన హైకోర్టును ఆశ్రయించారు. దాంతో బెయిల్ వచ్చింది. బిష్ణోయ్ వర్గానికి ‘కృష్ణజింక’ దైవంతో సమానంగా భావిస్తారు. దీంతో తాము పూజించే కృష్ణజింకను సల్మాన్ వేటాడి చంపాడని, అతడిని ఎలాగైనా చంపేస్తామని ఇదివరకే బిష్ణోయ్ వర్గం ప్రకటించిన సంగతి తెలిసిందే.