Thursday, April 18, 2024

హైదరాబాద్ టూ వరంగల్.. గంటలోగా జర్నీ పూర్తి

- Advertisement -
- Advertisement -

Regional Rapid Transit System between Hyderabad and Warangal

 

మన తెలంగాణ/హైదరాబాద్ : దేశ రాజధాని ఢిల్లీ పరిసర ప్రాంతాల పరిధిలో త్వరలోనే అందుబాటులోకి రానున్న రీజనల్ ర్యాపిడ్ ట్రాన్సిట్ సిస్టమ్ (ఆర్‌ఆర్‌టిఎస్) త్వరలోనే మన తెలుగు రాష్ట్రాల్లో అమలు చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇందులో భాగంగా తొలి దశలో హైదరాబాద్ వరంగల్, మలి దశలో హైదరాబాద్ విజయవాడల మధ్య ఈ ఆర్‌ఆర్‌టిఎస్ వ్యవస్థను అందుబాటులోకి తెచ్చే దిశగా ప్రయత్నాలు సాగుతున్నాయి. ప్రస్తుతం ఢిల్లీఘజియాబాద్‌మీరట్ మార్గంలో ఆర్‌ఆర్‌టిఎస్ నిర్మాణ పనులు సాగుతున్నాయి. ఆర్‌ఆర్‌టిఎస్ విధానం రెగ్యులర్ రైల్వే నెట్‌వర్క్, సబర్బన్ మెట్రో రైల్‌లకు పూర్తి భిన్నంగా ఉంటుంది. రెండు నగరాల మధ్య వేగంగా ప్రయాణించేందుకు వీలుగా ప్రత్యేక ట్రాక్‌లను, నియంత్రణ వ్యవస్థలను నిర్మిస్తారు. ఈ మార్గంలో రైలు గంటకు 180 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించే వీలుంది.

ప్రస్తుతం నేషనల్ క్యాపిటల్ రీజియన్ పరిధిలో ఢిల్లీ నుంచి హార్యానా, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్‌లలో పలు నగరాలను కలుపుతూ మూడు కారిడార్లలో ఆర్‌ఆర్‌టిఎస్ పనులు సాగుతున్నాయి. ఇందుకోసం నేషనల్ క్యాపిటల్ రీజియన్ ట్రాన్సిట్ కార్పొరేషన్‌ను ఏర్పాటు చేశారు. కేంద్రంతో పాటు ఆయా రాష్ట్రాలు ఈ ప్రాజెక్టుకి నిధులు సమకూరుస్తున్నాయి. ఇదే పద్ధతిలో తెలంగాణలోనూ ఆర్‌ఆర్‌టిఎస్‌ను చేపట్టాలని టిఆర్‌ఎస్ సర్కార్ నిర్ణయించింది. ఆర్‌ఆర్‌టిఎస్ నెట్‌వర్క్‌పై చర్చించేందుకు తెలంగాణకు చెందిన వివిధ విభాగాల అధికారులు ఆర్‌ఆర్‌టిఎస్‌కి సంబంధించి అంచనా వ్యయం, వనరుల లభ్యత తదితర అంశాలపై పూర్తి వివరాలను అధ్యయనం చేయనున్నారు.

ఈ మేరకు త్వరలో అధికారుల బృందం ఢిల్లీ పర్యటనకు వెళ్లనున్నట్లు సమాచారం. దేశంలోనే అతి పెద్ద టెక్స్‌టైల్ పార్క్‌ని వరంగల్‌లో ప్రారంభించారు. వివిధ దేశాలకు చెందిన ఎకంపెనీలు ఇక్కడ తమ యూనిట్లను నిర్మిస్తున్నాయి. అయితే వరంగల్‌లో ఎయిర్‌పోర్టు లేకపోవడం లోటుగా మారింది. ఎయిర్‌పోర్ట్ పునరుద్ధరణకు తెలంగాణ సర్కార్ ఓ వైపు ప్రయత్నాలు చేస్తూనే ఉంది. మరోవైపు ఆర్‌ఆర్‌టిఎస్ వంటి నెట్‌వర్క్ అందుబాటులోకి వస్తే హైదరాబాద్‌వరంగల్‌ల మధ్య ప్రయాణ సమయం తగ్గనుంది. పారిశ్రామికంగా వరంగల్‌కు ఇది ఎంతో ఉపయోగకరం. ఇలా టిఆర్‌ఎస్ సర్కార్ అంచనా వేస్తున్నట్లుగా ఆర్‌ఆర్‌టిఎస్ రవాణా వ్యవస్థ అందుబాటులోకి వస్తే నిజంగానే.. 3 గంటల సమయం పట్టే హైదరాబాద్‌వరంగల్ జర్నీ కేవలం గంటలోగానే ముగియడం ఖాయమే.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News