మన తెలంగాణ/మేడ్చల్: మాదక ద్రవ్యాలను తరలిస్తున్న నలుగురు వ్యక్తులను మేడ్చల్ ఎక్సైజ్ శాఖ పోలీసులు మంగళవారం రిమాండ్ కు తరలించారు. మేడ్చల్ ఎక్సైజ్ సిఐ నవనీత తెలిపిన వివరాల ప్రకారం కొంపల్లి మేడ్చల్ పరిసర ప్రాంతాల్లో శ్రామికులకు విద్యార్థులకు గంజాయి అమ్ముతున్నారన్న విశ్వసనీయ సమాచారం మేరకు మేడ్చల్ చెక్ పోస్ట్ లో వాహనాల తనిఖీ నిర్వహిస్తుండగా నలుగురు వ్యక్తులు రెండు ద్విచక్ర వాహనాలపై అనుమానాస్పదంగా కనపడడంతో వారిని అదుపులోకి తీసుకొని విచారణ జరిపినట్లు తెలిపారు.
బాలానగర్ కు చెందిన జనం మహేష్, మచ్చ బొల్లారం కు చెందిన నరేందర్, కూకట్పల్లికి చెందిన క్రిస్టో పి ఫిలిప్, యాప్రాల్ కు చెందిన పి షాజీ జార్జ్ ల నుండి హాష్ ఆయిల్ 225 గ్రాములు, 475 గ్రాముల ఎండు గంజాయి, 4 మొబైల్ ఫోన్ లు, 2 ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నట్లు ఆమె తెలిపారు. నిందితులపై కేసు నమోదు చేసి రిమాండ్ కు తరలించినట్లు ఆమె తెలిపారు. మాదకద్రవ్యాలను విక్రయించిన సేవించిన కఠిన చర్యలు ఉంటాయని మేడ్చల్ ఎక్సైజ్ సిఐ నవనీత హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఎస్ ఐ వెంకట్ రెడ్డి, ఎక్సైజ్ సిబ్బంది పాల్గొన్నారు.