Sunday, September 15, 2024

ప్రభుత్వ భూముల సంరక్షణ కోసం రిమోట్ రెఫరెన్సింగ్ విధానం

- Advertisement -
- Advertisement -

పైలట్ ప్రాజెక్టుగా పోలీసు శాఖ, ఆర్టీసీ భూముల సంరక్షణకు చర్యలు
దశల వారీగా ఎండోమెంట్స్, వక్ఫ్ భూములు సహా ఇతర శాఖల భూముల సంరక్షణ కోసం చర్యలు
రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ డాక్టర్ జీ చిన్నారెడ్డి వెల్లడి

మన తెలంగాణ/హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన వివిధ శాఖల భూములు, ఇతర స్థిరాస్తులను జియో రెఫరెన్సింగ్ మ్యాపింగ్ ద్వారా సంరక్షించనున్నట్లు రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ డాక్టర్ జి చిన్నారెడ్డి వెల్లడించారు. శనివారం ఖైరతాబాద్‌లోని తెలంగాణ రిమోట్ ఏజెన్సీ సెంటర్ (టీజీ రాక్) సంస్థ కార్యక్రమాలను ఉన్నతాధికారులతో సమీక్షించారు.

ఈ సందర్భంగా చిన్నారెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వ శాఖల భూములు, ఇతర స్థిరాస్తులు నిరంతరంగా దురాక్రమనకు గురవుతున్నాయని, ఈ అంశాలను దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వ భూముల సంరక్షణ ఏకైక లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం కార్యాచరణ ప్రణాళికను రూపొందిస్తున్నట్లు తెలిపారు. అందులో భాగంగా పైలట్ ప్రాజెక్టుగా పోలీసు శాఖ, రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (ఆర్టీసీ) భూములు, ఇతర స్థిరాస్తుల సంరక్షణ కోసం జియో రిఫరెన్సింగ్ మ్యాపింగ్ పద్ధతిని అమలు చేస్తున్నట్లు పేర్కొన్నారు. రానున్న రోజుల్లో ఎండోమెంట్స్, వక్ఫ్ భూములు, ఇతర శాఖల భూముల సంరక్షణ కోసం ఇదే విధానాన్ని కొనసాగిస్తామని తెలిపారు.

ప్రభుత్వ భూముల జోలికి ఎవరూ రాలేని పరిస్థితిని తీసుకుని వచ్చేందుకే జియో రిఫరెన్సింగ్ పద్ధతిని అనుసరిస్తున్నట్లు వివరించారు. ప్రభుత్వ భూముల జోలికి ఎవరైనా వస్తే కఠిన చర్యలు తప్పవు అని హెచ్చరించారు. జిహెచ్‌ఎంసి పరిధిలో స్థిరాస్తుల వివరాల సేకరణ కోసం తెలంగాణ ప్రభుత్వ రిమోట్ సెన్సింగ్ సెంటర్ సేవలను వినియోగించుకోవాలని, ప్రైవేట్ సంస్థలకు ఈ బాధ్యత అప్పగించ వద్దన్న విషయాన్ని జిహెచ్‌ఎంసి కమిషనర్ ఆమ్రపాలికి సూచించారు. అటవీ శాఖలో మొక్కల సంరక్షణ కోసం వినియోగించే జియో టాకింగ్ బాధ్యతలను ప్రభుత్వ రిమోట్ సెన్సింగ్ సెంటర్ కు అప్పగించాలని, ఈ విషయాన్ని పిసిసిఎఫ్ డోబ్రియాల్ దృష్టికి తీసుకెళ్లనున్నట్లు ఆయన తెలిపారు.

హైదరాబాద్ నగరం చుట్టూ ఉన్న 920 చెరువులలో దాదాపు 240 చెరువులు ఆక్రమణకు గురై కబ్జా దారుల చేతుల్లో మాయం అయ్యాయని, ఇలాంటి పరిస్థితులు రాకుండా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హైడ్రాను నెలకొల్పిన విషయాన్ని గుర్తు చేశారు. రాష్ట్రంలో పంటల సాగు విస్తీర్ణం ప్రతి ఏటా పెరుగుతోందని, దీనిపై పలు అనుమానాలు ఉన్నాయన్నారు. ఈ అనుమానాలను నివృత్తి చేసేందుకు క్షేత్రస్థాయిలో జియో రెఫరెన్సింగ్ విధానాన్ని ఉపయోగించి పక్కా సాగు లెక్కలు సేకరించాలని చిన్నారెడ్డి అధికారులకు సూచించారు. ఒక సంవత్సరంలో కోటి ఎకరాలకు సాగునీరు అందిస్తామని చెప్పడం, మరుసటి సంవత్సరం కోటి యాభై లక్షలు ఎకరాలకు సాగునీరు అందిస్తామని చెప్పడం వంటి విషయాలను గమనిస్తే ఈ అనుమానాలు కలుగుతున్నాయన్నారు.

ఇలాంటి అనుభవాలను దృష్టిలో ఉంచుకొని రానున్న రోజుల్లో రైతుల నుంచే తనకున్న భూమిలో ఏయే పంటలు యంత విస్తీర్ణంలో సాగు చేస్తున్నారు అని స్వీయ నివేదికను తీసుకోవాలన్న ఆలోచనను అమలు చేయనున్నట్లు తెలిపారు. నిజాయితీకి మారు పేరు రైతులు అని, రైతులు చెప్పే పంట సాగు వివరాలు పక్కాగా ఉంటాయని అభిప్రాయపడ్డారు. తెలంగాణ రాష్ట్ర రిమోట్ సెన్సింగ్ సెంటర్ అధికారులు, ఉద్యోగుల పని తీరును అభినందించారు. ఈ సమీక్షా సమావేశంలో రిమోట్ సెన్సింగ్ అదనపు డైరెక్టర్ జనరల్ మనోహర్, అర్థ గణాంక శాఖ డైరెక్టర్ రుఫస్ దత్తం, పరిపాలన అధికారి రాజోజు నరసింహా చారీ, జేడి శివ ప్రసాద్, సైంటిస్టులు, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News