Sunday, May 19, 2024

కెసిఆర్ జాతిపిత కాదు… పక్కా చౌకబారు రాజకీయ నాయకుడు: రేవంత్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: బిఆర్ఎస్ అధినేత కెసిఆర్ తెలంగాణను అప్పుల ఊబిలోకి నెట్టేశారని, ఐదేళ్ల వరకు కెసిఆర్ రుణమాఫీ చేయకపోవడంతో రైతులపై రెండింతల భారం పడిందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం తొలి ప్రాధాన్యత రైతు రుణమాఫీ అని స్పష్టం చేశారు. రాజకీయ లబ్ధి పొందేందుకే ప్రభుత్వాన్ని బద్నాం చేస్తున్నారని, దుబారా ఖర్చులు తగ్గిస్తామని, అవినీతికి పాల్పడం అని అన్నారు. మంగళవారం రేవంత్ ఓ టివి చానెల్ లైవ్ లో మాట్లాడారు.

కెసిఆర్ ఏమన్నా ఆయన మాటలకు విలువ లేదని, తెలంగాణ జాతిపిత అంటే కొండా లక్ష్మణ్‌ బాపూజీ, ప్రొ.జయశంకర్‌ మాత్రమేనని, కెసిఆర్‌ పక్కా చౌకబారు రాజకీయ నాయకుడు అని, జాతిపిత అనే పదం కెసిఆర్‌కు సూట్‌ కాదు అని అన్నారు. కాంగ్రెస్ కు 14 సీట్లు వస్తే ఆ గొప్పతనం కెసిఆర్‌ది అనుకుంటే తమకు అభ్యంతరం లేదు అని, ప్రతిపక్ష నేతగా కెసిఆర్‌కు ఇవ్వాల్సిన గౌరవం ఇస్తామని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.

పార్లమెంట్ ఎన్నికలతో బిఆర్ఎస్‌ కుప్పకూలిపోతుందని, ఈ ఎన్నికల్లో జాతీయ పార్టీల మధ్య పోటీ ఉందని,  పరోక్షంగా బిజెపిని గెలిపించడానికి బిఆర్ఎస్‌ ప్రయత్నిస్తోందన్నారు. తెలంగాణలో 14 ఎంపి సీట్లు కాంగ్రెస్ టార్గెట్ అని, 100 రోజుల పరిపాలన చూసే తీర్పు ఇవ్వాలని కోరుతున్నామని, 100 రోజుల్లోనే అన్నీ అయిపోవాలంటే ఎలా? అని రేవంత్ అడిగారు. తాము అధికారంలోకి వచ్చిన 150 రోజుల్లో కేవలం 100 రోజులు మాత్రమే తాము పరిపాలన చేశామని, డిసెంబర్ 7వ తేదీన బాధ్యతలు చేపడితే, మార్చి 17వ తేదీ నుంచి ప్రభుత్వ వ్యవస్థలన్నీ ఇసి పరిధిలోకి వెళ్లిపోయాయని గుర్తు చేశారు. తాము అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లో 6 గ్యారెంటీల్లో 5 గ్యారెంటీలను అమలు చేశామన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News