Saturday, May 17, 2025

‘రిశాట్-1బి’ దిక్సూచి

- Advertisement -
- Advertisement -

ఒకప్పుడు దట్టమైన మేఘాలు కమ్మేసినా, చిమ్మచీకట్లు అలుముకున్నా భూమిని చూడలేని నిస్సహాయత. ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు, సరిహద్దుల వద్ద ఉద్రిక్తతలు నెలకొన్నప్పుడు స్పష్టమైన సమాచారం కోసం ఎదురుచూపులు. కానీ ఇప్పుడు కాలం మారింది. ఒక చారిత్రక ఘట్టం భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) అలుపెరగని కృషితో రూపుదిద్దుకున్న ఒక అద్భుత సాంకేతిక చక్షువు మన జాతికి అండగా నిలవడానికి సిద్ధమవుతోంది. అదే ‘రిశాట్- 1బి’ -రాడార్ ఇమేజింగ్ శాటిలైట్. దీనికి ఇఒఎస్-09 గా కూడా పిలుస్తారు. మే 18, 2025 ఆ రోజు కోసం ఇస్రో శాస్త్రవేత్తలు, ఇంజనీర్లు రాత్రింబవళ్లు శ్రమిస్తున్నారు. ఆ రోజు ఉదయం శ్రీహరికోటలోని సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రంనుంచి భారత కాలమానం ప్రకారం ఉదయం 6.59 గంటలకు జరగనుంది. ఇస్రో నమ్మకమైన వాహక నౌక పిఎస్‌ఎల్‌వి-సి 61, రిశాట్-1బిని గుండెల్లో పెట్టుకుని గగనసీమ వైపు దూసుకెళ్లనుంది. ఆ క్షణం ప్రతి భారతీయుడి గుండె గర్వంతో ఉప్పొంగుతున్నది.

శాస్త్రసాంకేతిక రంగంలో మన దేశం సాధిస్తున్న ప్రగతికి అది నిలువెత్తు నిదర్శనంగా నిలుస్తుంది. ఆపరేషన్ సిందూర్ తర్వాత కొన్ని రోజులకే వస్తున్న ఈ ప్రయోగం చాలా ప్రాముఖ్యతను సంతరించుకుందని నిపుణులు అంటున్నారు. ఎందుకంటే ఇది పాకిస్తాన్, చైనా వెంట భారతదేశ సున్నితమైన సరిహద్దులను పర్యవేక్షించడంలో, దేశంలోని విస్తారమైన తీరప్రాంతాలను కాపాడటంలో రక్షణ దళాలకు కీలకమైన శక్తిని ఇస్తుంది. ఇది భవిష్యత్ పథంలో ఒక దిక్సూచి అవుతుంది. కక్ష్యలోకి చేరిన తర్వాత రిశాట్-1బి సుమారు పదేళ్లపాటు మనకు సేవలందిస్తుందని అంచనా. ఇది అందించే సమాచారం, చిత్రాలు మన దేశ భవిష్యత్ ప్రణాళికలకు దిక్సూచిగా మారతాయి. ఇస్రో ఇప్పటికే నాసాతో కలిసి ‘నిసార్’ అనే మరో అత్యాధునిక రాడార్ ఉపగ్రహాన్ని రూపొందిస్తోంది. రిశాట్-1బి విజయం ఆ భవిష్యత్ ప్రయత్నాలకు మరింత బలాన్ని చేకూరుస్తుంది.
రిశాట్ ప్రస్థానం ఒక్క రోజులో మొదలైంది కాదు.

దశాబ్దాల శాస్త్రవేత్తల మేధోమథనం, అలుపెరగని పరిశోధనల ఫలం ఇది. సాధారణ ఉపగ్రహ కెమెరాలకు కొన్ని పరిమితులున్నాయి. అవి సూర్యరశ్మి ఉన్నప్పుడు, ఆకాశం నిర్మలంగా ఉన్నప్పుడు మాత్రమే భూమిని స్పష్టంగా చూడగలవు. కానీ దేశరక్షణ, విపత్తు నిర్వహణ వంటి కీలక సమయాల్లో ప్రతిక్షణం సమాచారం అవసరం. ఈ అవసరాన్ని గుర్తించిన ఇస్రో, రాడార్ సాంకేతికత వైపు అడుగులు వేసింది. రాడార్ తరంగాలు మేఘాలను, చీకటిని ఛేదించుకుని ప్రయాణించి భూమిని స్పష్టంగా చిత్రీకరించగలవు ఇదే రిశాట్ శ్రేణికి పునాది. 2008 ముంబై దాడుల తర్వాత, దేశభద్రతకు నిరంతర నిఘా ఎంత అవసరమో యావత్ జాతికి తెలిసొచ్చింది. తక్షణ అవసరాలరీత్యా, 2009లో ‘రిశాట్-2’ (ఇజ్రాయెల్ సహకారంతో) అంతరిక్షంలోకి వెళ్లింది. అది ఎక్స్-బ్యాండ్ రాడార్‌తో మన సరిహద్దులకు ఒక కవచంలా నిలిచింది. ఆ తర్వాత పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో సి-బ్యాండ్ రాడార్‌తో ‘రిశాట్-1’ను 2012లో ఇస్రో విజయవంతంగా ప్రయోగించింది. ఇది ప్రధానంగా వ్యవసాయం, అటవీ సంపద, వరదల అంచనా వంటి పౌర సేవలకు అంకితమై, అన్నదాతలకు, ప్రకృతి పరిరక్షకులకు నేస్తమైంది. ఈ విజయాల స్ఫూర్తితో మరింత ఆధునిక పరిజ్ఞానంతో రిశాట్-2బి, రిశాట్-2బిఆర్1 వంటి ఉపగ్రహాలు మన రక్షణ, పర్యవేక్షణ సామర్థ్యాన్ని ఇనుమడింపజేశాయి.

ఈ అద్భుత పరంపరలో మరో కలికితురాయిగా మునుపటి ఉపగ్రహాల అనుభవాన్ని ఆధునిక సాంకేతికతను రంగరించి ‘రిశాట్-1బి’ రూపుదిద్దుకుంది. ఇది కేవలం ఒక ఉపగ్రహం కాదు, అంతరిక్షంలో మన జాతికి అదనపు నేత్రం. దీనిలో అమర్చిన అత్యాధునిక సి-బ్యాండ్ సింథటిక్ అపెర్చర్ రాడార్ దీని ప్రత్యేకత. ఈ రాడార్‌కు ఒక విశిష్టశక్తి ఉంది – అది పగలు-రాత్రి, ఎండా-వాన, మంచు-పొగమంచు తేడా లేకుండా భూమిని అత్యంత స్పష్టంగా చూడగలదు. ఒకప్పుడు సైనికుడు సరిహద్దులో చిన్న కదలికను పసిగట్టాలన్నా, విపత్తు సమయంలో సహాయక బృందం మారుమూల గ్రామానికి దారి కనుక్కోవాలన్నా ఎన్నో సవాళ్లు. కానీ రిశాట్-1బి తన ఐదు విభిన్న ఇమేజింగ్ మోడ్‌లతో ఈ సవాళ్లను అధిగమించనుంది. ఒకవైపు అత్యంత సూక్ష్మమైన వస్తువులను కూడా గుర్తించగల ‘సూపర్ ఫైన్’ చిత్రాలను అందిస్తూనే మరోవైపు విశాలమైన ప్రాంతాలను వేగంగా స్కాన్ చేసి పరిస్థితిని అంచనా వేయగలదు. సుమారు 1710 కిలోల బరువుతో భూమికి 529 కిలోమీటర్ల ఎత్తులో తన కక్ష్యలో పరిభ్రమిస్తూ, నిరంతరాయంగా మన భూభాగాన్ని కాపలా కాయనుంది.

రిశాట్-1బి కేవలం ఒక సాంకేతిక అద్భుతమే కాదు, అది మన జాతి ప్రగతికి, భద్రతకు ఒక రక్షా కవచం. దేశ రక్షణలో అభేద్యమైన కోటగా ఉండబోతుంది. మన సరిహద్దుల వెంబడి జరిగే అనుమానాస్పద కదలికలను, శత్రువుల కుయుక్తులను ఇది క్షణాల్లో పసిగట్టగలదు. ఉగ్రవాద శిబిరాలపై డేగ కన్ను వేసి, మన భద్రతా దళాలకు అమూల్యమైన సమాచారాన్ని అందించి, వారి ప్రాణాలను కాపాడటంలో సహాయపడుతుంది. సముద్ర తీరంలో అక్రమ చొరబాట్లను, స్మగ్లింగ్‌ను అరికట్టడంలో దీని పాత్ర కీలకం. విపత్తుల సమయంలో ఆపద్బాంధవుడు అవుతుంది.

వరదలు ముంచెత్తినప్పుడు, తుఫానులు విరుచుకుపడినప్పుడు, కొండచరియలు విరిగిపడినప్పుడు, దట్టమైన మేఘాల చాటున ఏం జరుగుతుందో తెలియక సహాయక చర్యలకు ఆటంకం కలుగుతుంది. అప్పుడు రిశాట్-1బి తన రాడార్ చూపుతో ఆ చీకట్లను చీల్చి ప్రభావిత ప్రాంతాలను స్పష్టంగా చూపిస్తుంది. ఎక్కడ ఎంత నష్టం జరిగిందో ఎక్కడ ప్రజలు చిక్కుకుపోయారో కచ్చితంగా చెప్పి, సహాయక బృందాలు వేగంగా స్పందించడానికి మార్గం సుగమం చేస్తుంది.

వ్యవసాయంలో కూడా రిశాట్-1బిది కీలక పాత్ర. ఏ పంట ఎంత విస్తీర్ణంలో ఉందో, పంటల ఆరోగ్యం ఎలా ఉందో, భూమిలో తేమ శాతం ఎంత ఉందో ఇది కచ్చితంగా అంచనా వేస్తుంది. దీనివల్ల ప్రభుత్వాలు ఆహార భద్రతకు ప్రణాళికలు రచించుకోవచ్చు, రైతులకు సరైన సలహాలు అందించి, అధిక దిగుబడులు సాధించడానికి తోడ్పడవచ్చు. ఈ విధంగా అన్నదాతకు ఆప్తమిత్రుడు కాబోతుంది. ప్రకృతి పరిరక్షణలో భాగస్వామిగా అడవుల నరికివేతను, కార్చిచ్చులను పసిగట్టడంలో మన అటవీ సంపదను కాపాడుకోవడంలో ఇది సహాయపడుతుంది.

పట్టణ ప్రణాళికలో, జలవనరుల నిర్వహణలో దీని సేవలు అమూల్యం. రిశాట్-1బి ప్రయోగం కేవలం ఒక సాంకేతిక విజయం మాత్రమే కాదు. అది స్వావలంబన దిశగా భారతదేశం వేస్తున్న మరో దృఢమైన అడుగు. మన శాస్త్రవేత్తల ప్రతిభకు, మన దేశపు ఆకాంక్షలకు అది నిదర్శనం. అంతరిక్షంలో మన అకుంఠిత నేత్రంగా మారి, ఈ దేశాన్ని సదా కాపాడుతూ, ప్రగతి పథంలో నడిపించాలని ఆశిద్దాం. ఈ ప్రస్థానం, భావి తరాలకు స్ఫూర్తినిస్తూ భారతదేశ ఖ్యాతిని దశదిశలా వ్యాపింపజేయడం ఖాయం. జై భారత్ !

డి జె మోహన రావు
82470 45230

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News