Sunday, May 19, 2024

న్యాయం చేయండి

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ సెంట్రల్ వర్సిటీలో 2016లో ఆత్మహత్యకు పాల్పడిన రోహిత్ వేముల తల్లి రాధిక సిఎం రేవంత్ రెడ్డిని కలిశారు. తమకు న్యాయం జరిగేలా చూడాలని ఆమె సిఎం రేవంత్‌కు విజ్ఞప్తి చేశారు. రోహిత్ ఆత్మహత్య వ్యవహారంలో వర్సిటీ విసితో పాటు పలువురు నేతలపై దాఖలైన కేసులో ఆధారాలు లేవంటూ కోర్టు విచారణను ముగించిన నేపథ్యంలో రోహిత్ తల్లి సిఎం రేవంత్‌రెడ్డిని కలవడం ప్రాధాన్యత సంతరించుకుంది. న్యాయం జరిగేలా చూడాలని ఆమె చేసిన విజ్ఞప్తికి సిఎం సానుకూలంగా స్పందించారు. ముఖ్యమంత్రి సానుకూలంగా స్పందించి పునర్విచారణ చేపట్టి న్యాయం జరిగేలా చూస్తామని ఆమెకు హామీ ఇచ్చారు. కేసును పునర్ విచారణ జరిస్తామని డిజిపి సైతం ప్రకటించడంతో ఈ మేరకు అనుమతివ్వాలని పోలీసులు న్యాయస్థానాన్ని కోరనున్నారు.

ఈ నెల 2వ తేదీన హైకోర్టుకు నివేదిక
2016 జనవరిలో హైదరాబాద్ సెంట్రల్ వర్సిటీలో రోహిత్ వేముల ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. యూనివర్సిటీ అధికారులు, ఇతర విద్యార్థి సంఘాల వేధింపుల కారణంగానే ఆ విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడ్డాడని దళిత సంఘాలు దేశవ్యాప్తంగా ఉద్యమించాయి. దళితుల హక్కుల కోసం పోరాడుతున్నాడన్న కారణంతో అతడిపై వేధింపులకు పాల్పడి, ఆత్మహత్యకు ప్రేరేపించారని ఆరోపణలు చేశాయి. విద్యాసంస్థల్లో దళిత విద్యార్థుల హక్కుల పరిరక్షణ కోసం రోహిత్ చట్టం రూపొందించాలని పలువురు డిమాండ్ చేశారు. రోహిత్ వేధించినందుకే ఆత్మహత్య చేసుకున్నట్లు ప్రశాంత్ అనే పిహెచ్‌డి విద్యార్థి ఫిర్యాదు చేశాడు.

ఆ ఫిర్యాదులో విసి అప్పారావు, బిజెపి నేతలు బండారు దత్తాత్రేయ, ఎన్.రాంచంద్రారావు, స్మృతి ఇరానీల పేర్లు ఉన్నాయి. దీనిపై పోలీసులు విచారణ చేపట్టగా రోహిత్ దళితుడని అవమానించినందుకే ఆత్మహత్య చేసుకున్నట్లు ఆధారాలు లేవని గచ్చిబౌలి పోలీసులు ఈ నెల 2వ తేదీన హైకోర్టుకు నివేదికను సమర్పించారు. ఈ నివేదికను పరిగణలోకి తీసుకున్న హైకోర్టు, పిటీషన్ విచారణను ముగించేసింది. పోలీసుల నివేదికపై ఏమైనా అభ్యంతరాలుంటే సంబంధిత కోర్టుకు వెళ్లాలని ప్రతివాదియైన ప్రశాంత్ తరఫు న్యాయవాదికి సూచించింది.

త్వరలోనే కోర్టులో పోలీసుల పిటీషన్
హైకోర్టు ఈ కేసును ముగించేయడంతో హెచ్‌సియూలోని విద్యార్థులు ఆందోళనలు చేపట్టారు. ఈ నిరసనలో ఎక్కువ మంది విద్యార్థులు పాల్గొనడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. ఎలాంటి ఘర్షణ వాతావరణం చోటు చేసుకోకుండా నిలవరించేందుకు జాగ్రత్తలు తీసుకున్నారు. ఈ నేపథ్యంలో రోహిత్ వేముల ఆత్మహత్య కేసును పునర్విచారణ చేస్తామని డిజిపి రవిగుప్తా ప్రకటించారు. ఈ కేసు తీర్పు విషయంలో రోహిత్ తల్లి అనుమానం వ్యక్తం చేయడం, విద్యార్థుల నిరసనలు చేపట్టడంతో ఈ నిర్ణయం తీసుకున్నామని ఆయన వెల్లడించారు. పునర్విచారణకు అనుమతి కోరుతూ కోర్టులో పిటీషన్ వేయనున్నారు. ఈ సందర్భంగా రోహిత్ తల్లి సచివాలయంలో సిఎం రేవంత్ రెడ్డిని కలిశారు. తమకు న్యాయం చేయాలని కోరారు. దీనికి సానుకూలంగా స్పందించిన ముఖ్యమంత్రి న్యాయం జరిగేలా చేస్తామని, మళ్లీ విచారణ చేపడతామని హామీ ఇచ్చారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News