Friday, September 20, 2024

జూవెల్లరీ షాపు మేనేజర్ పై దాడి చేసి రూ.35లక్షలు దోచుకున్న ముఠా

- Advertisement -
- Advertisement -

జూవెల్లరీ షాపు మేనేజర్‌పై దాడి చేసి రూ.35లక్షల నగదు దోచుకున్న సంఘటన గుడిమల్కాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని రేతిబౌలిలో శనివారం రాత్రి 12 గంటలకు చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం…బంజారాహిల్స్‌లోని ద్వీపర్‌మాల్ జ్యువెలర్స్‌లో శ్రీకాంత్ మేనేజర్‌గా విధులు నిర్వర్తిస్తున్నాడు. శ్రీకాంత్ రోజూ మాదిరిగానే బంజారాహిల్స్ లోని దుకాణం మూసివేసి అందులోనే పనిచేస్తున్న ప్రవీణ్ జాదవ్‌తో కలిసి ద్విచక్ర వాహనంపై అత్తాపూర్ వైపు బయలుదేరాడు.మేనేజర్‌గా పనిచేస్తున్న శ్రీకాంత్ ప్రతి రోజు వచ్చిన డబ్బులను మరుసటి రోజు బ్యాంక్‌లో డిపాజిట్ చేస్తాడు. ఈ క్రమంలోనే శుక్రవారం వచ్చిన డబ్బులను తీసుకుని అత్తాపూర్‌లోని ఇంటికి బయలుదేరాడు. రేతిబౌలి ఎక్స్ రోడ్‌లోని పిల్లర్ నంబర్ 28 సమీపంలోని ఓ పాన్ షాప్ వద్ద పాన్ కొనడానికి ఆగాడు.

అప్పుడే అక్కడకు ఇద్దరు వ్యక్తులు హెల్మెట్ ధరించి పల్సర్ బైక్‌పై వచ్చారు. ఇద్దరు వ్యక్తులు శ్రీకాంత్ చేతిలో ఉన్న బ్యాగును లాక్కునేందుకు యత్నించారు. దీంతో వారిని శ్రీకాంత్ ప్రతిఘటించాడు, శ్రీకాంత్‌ను కిందపడేసిన నిందితులు బ్యాగును లాక్కుని పారిపోయారు. పాన్ అమ్మే వ్యక్తి, శ్రీకాంత్‌తో వచ్చిన ప్రవీణ్‌జాదవ్ ఇద్దరు దుండగులను పట్టుకునే ప్రయత్నం చేసినా తప్పించుకుని పారిపోయారు. బాధితులు వెంటనే గుడిమల్కాపూర్ పోలీస్ స్టేషన్‌కు వెళ్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. శ్రీకాంత్ వద్ద ఉన్న బ్యాగులో డబ్బులు ఉన్నట్లు దుండగులకు ఎలా తెలిసింది? అనే దానిపై పోలీసులు ఆరా తీస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News