Monday, October 14, 2024

రూ. 7.65 కోట్లతో యాదాద్రిలో హరిత హోటల్

- Advertisement -
- Advertisement -

టెండర్లు ఆహ్వానించి త్వరలోనే నిర్మాణం పూర్తి
ఈ హరిత హోటల్ అందుబాటులోకి వస్తే భక్తులకు ఎంతో సౌకర్యవతం

మన తెలంగాణ / హైదరాబాద్ : తెలంగాణ పర్యాటకాభివృద్ధి సంస్థ టిఎస్‌టిడిసి సరికొత్త ఆలోచనతో ముందుకు వెళ్తోంది. యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహుడిని దర్శించుకునేందుకు రోజు వేల సంఖ్యలో భక్తులు వస్తుండడంతో వారి సౌకర్యార్థం త్వరలో రూ. 7 కోట్ల 65 లక్షల వ్యయంతో హరిత హోటల్‌ను నిర్మించనుంది. ఇప్పటికే వివిధ జిల్లాల్లో బడ్జెట్ హోటళ్లను ఏర్పాటు చేస్తున్న పర్యాటకాభివృద్ధి సంస్థ యాదాద్రి ఆలయం వద్ద ఒక మంచి హోటల్‌ను నిర్మించాలని ప్రణాళికలు రచిస్తోంది.

గోవా, ఊటీ, కొడైకెనాల్ వంటి ప్రాంతాల్లో అక్కడి పర్యాటకులను విశేషంగా ఆకట్టుకుంటున్న బడ్జెట్ హోటళ్ల తరహాలోనే తెలంగాణలోనూ బడ్జెట్ హోటళ్లు అలాగే హరిత హోటళ్లను ఏర్పాటు చేయిస్తోంది. ప్రస్తుతం వివిధ జిల్లాల్లో సుమారు ఆరు నుండి ఏడు హరిత హోటళ్లు, రిసార్ట్‌లను ఏర్పాటు చేయగా పర్యాటకుల నుండి భారీ స్పందన లభించింది. ఈ క్రమంలో హరిత హోటళ్లు, బడ్జెట్ హోటళ్లను వివిధ ప్రాంతాల్లో కొత్తగా ఏర్పాటు చేసేందుకు ముందుకు వచ్చింది. ఈ హోటళ్లు కూడా పర్యాటకులను అమితంగా ఆకర్షించడంతో పాటు మిగతా హోటళ్ల కంటే కూడా అత్యంత నాణ్యత పద్దతుల్లో భోజనం, వసతి సౌకర్యాలను కల్పించనున్నారు. అక్కడికి వచ్చి యాదాద్రి నరసింహుడిని దర్శించుకోవడంతో పాటు పరిసర పర్యాటక ప్రాంతాలను చూసి మరికొన్ని రోజులు హరిత హోటళ్లలోనే సేద తీరేలా ఈ భవనాలను నిర్మిస్తున్నారు. అంతే కాకుండా తెలంగాణ పర్యాటకాభివృద్ధి సంస్థ తక్కువ రేట్లకే మెరుగైన వసతి కల్పించడానికి ప్రతిపాదిత హరిత హోటల్ కోసం చర్యలు తీసుకుంటోంది. పలు జిల్లాల్లో బడ్జెట్ హోటళ్ల నిర్మాణానికి కూడా వివిధ జిల్లాల్లో భూమిని కేటాయించాలని ఇప్పటికే పలు జిల్లాల కలెక్టర్లకు తెలంగాణ పర్యాటకాభివృద్ధి శాఖ లేఖలు రాసింది.

ఆకట్టుకుంటున్న హరిత హోటళ్లు
రాష్ట్ర వ్యాప్తంగా హరిత హోటళ్లు పర్యాటకులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. వీటిలో వరంగల్ రామప్ప టెంపుల్ వద్ద గల హరిత లేక్‌వ్వూ రీసార్ట్ హోటల్ ఒకటి. దీంతో పాటు హరిత ఇందూర్ ఇన్ పేరిట నిజామాబాద్‌లోనూ, హోటల్ హరిత కాళేశ్వరం పేరిట కాళేశ్వరంలోనూ అలాగే కడెం రిజార్వాయర్ వద్ద హరిత రిసార్ట్ కడెం, వీటితో పాటు ఆలంపూర్ జోగులాంబ అమ్మవారి సన్నిధిలోనూ “హరిత హోటల్ అలంపూర్‌”ను ఏర్పాట చేశారు. వీటన్నింటికంటే కూడా రామప్ప ఆలయం వద్ద గల హరిత లేక్‌వ్వూ రీసార్ట్ ద్వారా పర్యాటక శాఖకు అధికంగా గిరాకీ ఉంటోంది.

యాదాద్రి హరిత హోటల్‌కు టెండర్ల పిలుపు
తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ యాదాద్రి ఆలయాన్ని అత్యంత అద్భుతంగా వెయ్యేళ్లు చరిత్రలో నిలిచిపోయేలా పునర్నిర్మింపజేశారు. పాత ఆలయానికి పూర్తి భిన్నంగా తిరుమల వెంకటేశ్వర స్వామి తరహాలో ఇక్కడ ఏర్పాటు చేశారు. మరీ ముఖ్యంగా యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి అలనాటి వైభవం చెక్కుచెదరకుండా ఆధునిక పరిజ్ఞానాన్ని మేళవించి యాదాద్రి ఆలయాన్ని ప్రపంచం దృష్టిని ఆకర్షించేలా నిర్మించారు. ఇప్పటివరకు ఏ ఆలయంలోనూ లేని విధంగా పూర్తిగా నల్లరాతి కృష్ణ శిలలతో నిర్మించిన ఏకైక ఆలయం యాదాద్రి ఆలయం కావడం విశేషం. యాదాద్రి కొండపైన ప్రతి కట్టడాన్ని ఆధ్యాత్మికత ఉట్టిపడేలా పునర్నించారు.ప్రధానాలయం, ప్రాకారాల నిర్మాణాలు పూర్తికాగా.. మరికొన్ని కట్టడాలు ఇంకా నిర్మాణంలోనే ఉన్నాయి. కొండపైన తెలంగాణ టూరిజం కార్పొరేషన్ ఆధ్వర్యంలో ఈ హరిత హోటల్ నిర్మిస్తున్నారు. ఈ భవనాన్ని అధునాతన హంగులతో తీర్చిదిద్దనున్నారు. ఇందుకోసం తెలంగాణ స్టేట్ టూరిజం డెవలప్ కార్పొరేషన్ లిమిటెడ్ నిధుల కింద రూ.7.65 కోట్లు మంజూరు చేసి, టెండర్లను ఆహ్వానించారు. త్వరలోనే టెండర్ ప్రక్రియను పూర్తిచేసి పనులు ప్రారంభించనున్నట్టు అధికారులు తెలిపారు. ప్రస్తుత భవనంలో 32 గదులు, 2 సూట్లు ఉన్నాయి. శిథిలావస్థకు చేరిన వీటిని ఆధునీకరించనున్నట్లు తెలిపారు. భవనం చుట్టూ గార్డెనింగ్, పార్కింగ్ వసతి కల్పించనున్నట్లు తెలిపారు. గదులతోపాటు ఆ పక్కనే అల్పాహారం, భోజనం చేసేందుకు అందుబాటులో ఉన్న హోటల్ ప్రాంగణాన్ని కూడా ఆలయ థీమ్‌కు అనుగుణంగా మార్చనున్నారు. ఈ హరిత హోటల్ అందుబాటులోకి వస్తే భక్తులకు సౌకర్యవతంగా ఉండనుంది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News