రైతు రుణమాఫీ, సన్నాలకు రూ.500 బోనస్ ఇవ్వడం చారిత్రాత్మక నిర్ణయం
మహబూబ్ నగర్‌లో రైతు పండగ విజయవంతం
మంత్రి జూపల్లి కృష్ణారావు వెల్లడి
మన తెలంగాణ/హైదరాబాద్: దేశంలో ఏక కాకంలో రూ.21 వేల కోట్లు రుణమాఫీ చేసిన ఘనత తమ ప్రజా ప్రభుత్వానికే దక్కుతుందని పర్యాటక, సాంస్కృతిక, పురావస్తు, ఎక్సైజ్ శాఖల మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. మహబూబ్ నగర్‌లో రైతు పండగ, సిఎం బహిరంగ సభను విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపారు. గాంధీభవన్‌లో ఆదివారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ రైతు అవగాహన సదస్సు, రైతు పండగ, బహిరంగ సభను విజయవంతం చేసిన రాష్ట్ర, ఉమ్మడి జిల్లా అధికార యంత్రాగానికి కృతజ్ఞతలు, అభినందనలు తెలిపారు.
రైతు రుణమాఫీ, సన్నాలకు రూ.500 బోనస్ ఇవ్వడం చారిత్రాత్మక నిర్ణయంగా ఆయన అభివర్ణించారు. ఉమ్మడి పాలమూరు జిల్లా అభివృద్ధికి ఏటా రూ.20 వేల కోట్లు కేటాయిస్తానన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. బూర్గుల రామకృష్ణారావు తర్వాత 70 ఏళ్లకు పాలమూరు జిల్లాకు చెందిన రేవండ్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యారని కొనియాడారు. ఈ ప్రాంత వాసిగా ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాను అన్ని రంగాల్లో అభివృద్ధి చేయాలనే తపన రేవంత్ రెడ్డికి ఉందని పేర్కొన్నారు. ఒకప్పటి వలసల జిల్లాను విద్యా, ఉద్యోగ, ఉపాధి, వ్యవసాయ, సాగునీటి రంగాల్లో అగ్రగ్రామిగా నిలిపాలని సిఎం కృతనిశ్చయంతో ఉన్నారని అన్నారు. నీటి పారుదల ప్రాజెక్ట్‌లకు సిఎం అవసరమైన నిధులు కేటాయిస్తున్నారని తెలిపారు.
రైతు పండగ విజయవంతం కావడంతో బీఆర్‌ఎస్ నాయకులకు నిద్రపట్టడం లేదని అన్నారు. కాంగ్రెస్ మెదలు పెట్టిన జిల్లా సాగునీటి ప్రాజెక్టులను గత పదేళ్లలో బీఆర్‌ఎస్ ప్రభుత్వం పూర్తి చేయలేకపోయిందని అన్నారు. పాలమూరు రైతన్నల సాగునీటి కష్టాలకు బీఆర్‌ఎస్ తీర్చలేకపోయిందని తెలిపారు. కాళేశ్వరం ప్రాజెక్ట్‌కు లక్షల కోట్లు వెచ్చించి, జూరాల, భీమా ప్రాజెక్ట్‌లకు నిధులు కేటాయించడంలో తీవ్ర నిర్లక్ష్యం చేసింది గత ప్రభుత్వమేనని ఆరోపించారు. కుర్చీ వేసుకుని ప్రాజెక్ట్‌లు పూర్తి చేస్తానన్న కేసీఆర్ పాలమూర్ కు చుక్క నీరివ్వలేదని విమర్శించారు.
వరి వేస్తే ఉరి అని గతంలో కేసీఆర్ చెప్పిన విషయాన్ని గుర్తు చేశారు. దొడ్డు బియ్యం పేరుతో దళారీలు, మిల్లర్లకు లబ్ధిచేకూర్చారని తెలిపారు. సన్నాలకు రూ.500 బోనస్ తో రైతులు, కౌలు రైతులు సంతోషంగా ఉన్నారని అన్నారు. అత్త సొమ్ము అల్లుడు దానం చేసినట్లు రాష్ట్రాన్ని నిలువునా దోచుకుని, కాంట్రాక్టర్లకు దోచిపెట్టారని అన్నారు. గత బీఆర్‌ఎస్ ప్రభుత్వ నిర్వాకం వల్ల ధనిక రాష్ట్రం అప్పుల ఊబిల్లో కూరుకుపోయిందని తెలిపారు. తిమ్మిన బమ్మిని చేద్దామనే బీఆర్‌ఎస్ నాయకుల మాటలను ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరని అన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ బీఆర్‌ఎస్‌కు ప్రజలు బుద్ది చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారని విమర్శించారు.