మాస్కో సమీపాన శుక్రవారం కారు బాంబు పేలుడులో అగ్రస్థాయి రష్యా జనరల్ ప్రాణాలు కోల్పోయారు. ఇది ఉగ్రవాద దాడిగా రష్యా విదేశాంగ మంత్రిత్వశాఖ వెల్లడించింది. రష్యా రక్షణ మంత్రిత్వశాఖకు చెందిన మెయిన్ ఆపరేషన్స్ డైరెక్టరేట్ ఆఫ్ జనరల్ స్టాఫ్ డిప్యూటీ డెరెక్టర్ లెఫ్టినెంట్ జనరల్ 59 ఏళ్ల యారోస్లోవ్ మొస్కాలిక్ హతులయ్యారని దర్యాప్తు కమిటీ వెల్లడించిందని వెస్టీ ఎఫ్‌ఎం రేడియో వివరించింది. కారు పక్కనే ఉంచిన ఓ గ్యాస్ సిలిండర్‌లో బాంబును పెట్టి దానిని రిమోట్ సాయంతో పేల్చివేసినట్టు గుర్తించారు. ఈ దాడికి కారకులెవరో ఇంకా తెలియరాలేదు. సంఘటన స్థలంలో పడి ఉన్న పేలుడు పరికరం తునకలను పరీక్షకు పంపినట్టు దర్యాప్తు కమిటీ అధికార ప్రతినిధి స్వెత్లానా పెటెర్న్‌కో చెప్పారు.
మొస్కాలిక్ రక్షణ మంత్రిత్వశాఖ ప్రతినిధిగా అనేక చర్చల్లో పాల్గొనేవారు. రష్యా సైన్యం నిర్వహించే ప్రధాన ఆపరేషన్ల విషయంలో డైరెక్టరేట్ చీఫ్‌కు యారొస్లోవ్ సహాయ కారిగా ఉంటారు. ప్రస్తుతం ఉక్రెయిన్ యుద్ధలోకూడా ఆయనది చాలా కీలక పాత్ర. శుక్రవారం నాడు క్రెమ్లిన్‌తో అమెరికా రాయబారి స్టీవ్ విట్‌కోఫ్ చర్చలు జరగనున్న సమయంలో ఈ సంఘటన జరగడం చర్చనీయాంశం అయింది. ఉక్రెయిన్ క్యాంపైన్‌తో సంబంధం ఉన్న అనేక రష్యా మిలిటరీ అధికారులు తమ ఇళ్ల వద్దే హత్యకు గురవుతున్నారని ఉక్రెయిన్ ఇంటెలిజెన్స్ ఎస్‌బియు ఏజెంట్లు ఆరోపించారు.
మాస్కోకు మరోసారి ట్రంప్ ప్రతినిధి
ఉక్రెయిన్ యుద్ధానికి ముగింపు పలికే అంశంపై చర్చలు జరిపేందుకు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రత్యేక ప్రతినిధి స్టీవ్ విట్కాఫ్ మాస్కోకు వెళ్లారు. ఈ విషయాన్ని ఇంటర్ ఫాక్స్ న్యూస్ ఏజెన్సీ ధ్రువీకరించింది. ఈ పర్యటనలో భాగంగా ఆయన రష్యా అధ్యక్షుడు పుతిన్‌తో భేటీ అయ్యే అవకాశం ఉంది. అయితే దీనిని ఇప్పటివరకు క్రెమ్లిన్ వర్గాలు ధ్రువీకరించలేదు. యుద్ధానికి పరిష్కారం కోసం ఇప్పటికే విట్కాఫ్ మూడుసార్లు మాస్కోను సందర్శించారు. ఫిబ్రవరి 11, మార్చి 13, ఏప్రిల్ 11న ఆయన పుతిన్‌తో మాట్లాడారు. ఈ చర్చల్లో చెప్పుకోదగ్గ స్థాయిలో పురోగతి కనిపిస్తోందని ట్రంప్ పేర్కొనడం గమనార్హం.