Thursday, June 20, 2024

సాయిచంద్ మృతి దిగ్భ్రాంతి కలిగించింది: గుత్తా సుఖేందర్ రెడ్డి

- Advertisement -
- Advertisement -

మనతెలంగాణ/హైదరాబాద్ : చిన్న వయసులోనే సాయిచంద్ మృతి చెందడం దిగ్భ్రాంతి కలిగించిందని, ఆయన మరణం బాధాకరమని స్పీకర్ పోచారం శ్రీనివాస రెడ్డి అన్నారు. ఇటీవల గుండెపోటుతో మృతి చెందిన రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్, గాయకుడు వేద సాయిచంద్ గుర్రంగూడలో ఉన్న ఆయన నివాసానికి వెళ్లి రాష్ట్ర శాసన సభాపతి పోచారం శ్రీనివాస రెడ్డి, శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డిలు ఆయన కుటుంబసభ్యులను పరామర్శించారు. సాయిచంద్ చిత్రపటానికి పూలమాలలు వేసి వారు నివాళులు అర్పించారు. సాయిచంద్ భార్య, పిల్లలను ఓదార్చి వారు మనోధైర్యం చెప్పారు.

స్పీకర్ వెంట ప్రభుత్వ విప్ శ్రీమతి గొంగడి సునీత, లెజిస్లేటివ్ సెక్రటరీ వి.నరసింహా చార్యులు, బిఆర్‌ఎస్‌ఎల్‌పి సెక్రటరీ రమేష్ రెడ్డిలు ఉన్నారు. ఈ సందర్భంగా స్పీకర్ పోచారం మీడియాతో మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమంలో భాగంగా ఉద్యమ నాయకుడు కెసిఆర్ వెన్నంటి ఉండి తన ఆట, పాటతో రాష్ట్రాన్ని సాధించడంలో సాయిచంద్ కీలక పాత్ర వహించారన్నారు. మాటకు లేని శక్తి పాటకు ఉంటుందని, ఆ శక్తిని నిరూపించిన వ్యక్తి సాయిచంద్ అని స్పీకర్ పేర్కొన్నారు. వందల సభల్లో సాయిచంద్ ఆట, పాట కోసం ప్రజలు ఎదురు చూసేవారన్నారు. కళాకారుడు, గాయకుడు, మంచి మనిషి అయిన సాయిచంద్ అకస్మాత్తుగా దూరమవ్వడం ఎవ్వరూ ఊహించలేదన్నారు.

సాయిచంద్ మృతి ఆయన కుటుంబానికే కాదు, అభిమానించే తెలంగాణ ప్రజలకు కూడా లోటేనన్నారు. మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ పాటల గొంతుక మూగపోయిందన్నారు. రాష్ట్ర సాధనలో కెసిఆర్ వెన్నంటి ఉండి ప్రతి బహిరంగ సభలో తన పాటతోనే కార్యక్రమాన్ని ప్రారంభించేవారన్నారు. రాష్ట్ర అవతరణ తరువాత ప్రభుత్వ కార్యక్రమాల్లో కూడా తన ఆట, పాట ఉండేదన్నారు. సాయిచంద్ భౌతికంగా మన మధ్య లేకపోయినా తెలంగాణ ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోతారన్నారు. సాయిచంద్ కుటుంబానికి తెలంగాణ ప్రభుత్వంతో పాటుగా అందరం అండగా ఉంటామన్నారు.

 

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News