Sunday, April 28, 2024

చరిత్ర గతిని మార్చిన శాస్త్రవేత్తలు

- Advertisement -
- Advertisement -

ఫిబ్రవరి నెలకు, సైన్స్ ప్రేమికులకు ఒక అవినాభావ సంబంధం ఉంది. ఎందుకంటే థామస్ అల్వా ఎడిసన్, డార్విన్, గెలిలియో, కోపర్ని కస్ వంటి ప్రముఖ శాస్త్రవేత్తలు ఈ నెలలోనే జన్మించారు. ప్రముఖ ఖగోళ శాస్తవేత్త బ్రూనోని ఆనాటి మతోన్మాదులు దారుణంగా హత్య చేసింది ఈ నెలలోనే. జాతీయ సైన్స్ దినోత్సవాన్ని కూడా ఫిబ్రవరి 28న జరుపుతారు. జనవిజ్ఞాన వేదిక వంటి సైన్స్ ప్రచార సంస్థ సైన్స్ దినోత్సవం రోజునే ఏర్పడింది. అందుకే సైన్స్ ప్రచారకులు ఈ నెలంతా సైన్స్ ప్రాముఖ్యత గురించి వివరించడానికి వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తారు.

వివిధ మతాలకు చెందిన మత ప్రవక్తలు తాము నమ్మిన విషయాలని ఆయా మత గ్రంధాలలో ప్రస్తావించారు. వీటికి ఎక్కువగా వారి వ్యక్తిగత అనుభవాలని జోడించారు. తమ అనుభవాలను ప్రజలకు బోధించారు. ఇందులో నైతిక విలువలు కూడా ఉన్నాయి. మత బోధకుల చెప్పే ప్రవచనాలు వ్యక్తిగత నమ్మకం పైనే ఆధారపడి ఉంటాయి. మధ్యయుగం వరకు సైన్స్ పరిశోధనలు ఎక్కువగా సిద్ధాంతాలకు, ప్రతిపాదనలకు మాత్రమే పరిమితం అయ్యాయి. జాన్ గూటెన్ బర్గ్ ముద్రణా యంత్రం కనుగొనడంతో సామాన్యులకు కూడా పుస్తకాలు అందుబాటులోకి వచ్చాయి. 15వ శతాబ్దంలో పలువురు ఖగోళ శాస్త్రవేత్తలు పరిశోధించి విశ్వరహస్యాలని ఛేదించారు. వీరిలో కోపర్ని కస్, గెలిలియో, బ్రూనో అగ్రగణ్యులు.

సూర్యకేంద్ర సిద్ధాంతాల నమూనాలను, సిద్ధాంతాలను కోపర్ని కస్ కంటే ఎన్నో వందల ఏండ్లకు మునుపే ఆర్యభట్టు, ఒమర్ ఖయ్యాంలు ప్రతిపాదించారు. కాని, గ్రహాల కదలికలు ఆధారంగా గ్రహాలు సూర్యుని చుట్టూ తిరుగుతున్నాయని మొట్టమొదట నిరూపించింది ఇతనే. భూమి తన అక్షంపైనే తిరుగుతుందని అందువల్లే రాత్రి పగలూ యేర్పడుతున్నాయని తెలిపాడు. భూభ్రమణ, పరిభ్రమణాల వల్లే శీతోష్ణ స్థితులు, ఋతువులు మారుతున్నాయని గ్రహించాడు. ఈ విషయాలన్నీ వాస్తవాలే అయినా వాటిని బయట పెట్టడానికి కోపర్నికస్‌కు ధైర్యం చాలలేదు. ఆనాటి మత గురువులకు అటు పాలకుల్లో, ఇటు ప్రజల్లో మంచి పలుకుబడి ఉండేది. మత గ్రంధాలలో ఉన్న భావనలకు విరుద్ధంగా ఏ శాస్త్రవేత్తయినా అభిప్రాయాలు వ్యక్తం చేస్తే వారికి కఠిన శిక్షలు విధించేవారు.

ఈ కారణం చేత కోపర్ని కస్ వంటి శాస్త్రవేత్తలు తమ పరిశోధనలని బహిర్గతం చేయడానికి భయపడ్డారు. అయితే కోపర్ని కస్ ప్రతిపాదనలని గెలిలియో మరింత ముందుకు తీసుకెళ్లారు. ఎన్నో విశ్వ రహస్యాలను గెలీలియో ఛేదించగలిగాడు. బృహస్పతి గ్రహానికి ఉన్న ఉపగ్రహాలను ఆయన చూడగలిగాడు. గెలీలియో అప్పుడే కనుగొన్న టెలిస్కోపు ద్వారా శనిగ్రహ ఉపగ్రహాలను ప్రజలకు చూపించి నికోలస్ కోపర్నికస్ సూర్య కేంద్రక సిద్ధాంతాన్ని ధ్రువీకరించారు. మన పాలపుంతలో కోట్లాది నక్షత్రాలు ఉన్నాయని ఊహించి చెప్పగలిగాడు. ఈ టెలిస్కోప్‌ను ఉపయోగించి సేకరించిన సమాచారాన్ని బట్టి కోపర్నికస్ సూర్య కేంద్రక సిద్ధాంతంను బలపరిచాడు. క్రీ.శ 1616లో గెలీలియో విశ్వానికి సూర్యుడే కేంద్రమని సూర్యుని చుట్టే భూమి తిరుగుతుందని నిర్ద్వంద్వంగా ప్రకటించాడు. ఫలితంగా ఆయన క్రైస్తవ మత పెద్దల ఆగ్రహానికి గురై జైలుశిక్ష అనుభవించారు.

బ్రూనో ఒకడుగు ముందుకు వేసి సూర్య కేంద్రక సిద్ధాంతాన్ని బహిరంగంగా బలపరిచి ప్రచారం చేశాడు. ఆనాటి మత పెద్దలు ఆయనపై మరింత ఆగ్రహం వ్యక్తంచేశారు. చివరికి బ్రూనోని సజీవ దహనం చేశారు. కోపర్ని కస్, గెలిలియో, బ్రూనో చేసిన పరిశోధనలు చరిత్ర గమనాన్ని మార్చాయి. ప్రజల ఆలోచనలలో కూడా క్రమంగా మార్పు వచ్చింది. ఫలితంగా సైన్స్ పరిశోధనలకు మరింత ఊతం లభించింది. మతవాదులు కూడా తమ ఉనికిని కాపాడుకోవడానికి తాము నమ్మిన సిద్ధాంతాలకు కొత్త భాష్యాల్ని వెతుక్కోవాల్సి వచ్చింది. వారు తమ మత ప్రచారంలో భాగంగా మానవ సేవ అనే భావనను ప్రవేశపెట్టారు. శాస్త్రవేత్తలకు మరింత ప్రోత్సాహం లభించింది. కానీ నేడు పాలకులకి మతమే ఎన్నికల్లో ప్రధాన ఆయుధం ఆయింది. మధ్యయుగాల్లో శాస్త్రవేత్తలపై దాడులు జరిగి నట్లే, సైన్స్‌వాదులపై నేడు అనేక రూపాల్లో దాడులు జరుగుతున్నాయి. మూఢనమ్మకాలు కూడా రోజు రోజుకూ పెరుగుతున్నాయి. నాటి శాస్త్ర వేత్తల స్ఫూర్తితో సైన్స్ వాదులు ముందడుగు వేయాల్సిన అవసరం ఉంది. సైన్స్ పరిశోధనలకు విస్తృత ప్రచారం కల్పించాల్సిన అవసరం ఉంది.

* యం.రాం ప్రదీప్
9492712836

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News