Tuesday, July 1, 2025

మంత్రి వర్సెస్ ఐఏఎస్‌లు ?

- Advertisement -
- Advertisement -

అమాత్యురాలికి తెలియకుండానే
కీలక నిర్ణయాలు టెండర్లపై
ప్రశ్నిస్తే నిర్లక్షంగా సమాధానాలు
మహిళా శిశుసంక్షేమశాఖలో కోల్డ్
వార్ సిఎం వద్దకు పంచాయితీ?

మనతెలంగాణ/హైదరాబాద్: ఆ శాఖలో మంత్రి తెలియకుండానే నిర్ణయాలు అమలవుతున్నాయి. ఈ మధ్య బెంచీల కొనుగోళ్లకు సంబంధించిన టెండర్‌ల విషయమై మంత్రికి తెలియకుండానే అధికారులు ఆపివేయడంతో ప్రస్తుతం ఈ అంశం వివాదాస్పదం అవుతోంది. మహిళా శిశుసంక్షేమ శాఖలో ప్రస్తుతం మంత్రి వర్సెస్ ఐఏఎస్‌ల(IAS) మధ్య కోల్డ్‌వార్ కొనసాగుతోందని సచివాలయ వర్గాలు పేర్కొంటుండగా త్వరలోనే ఈ పంచాయితీ సిఎం వద్దకు వెళ్లనుంది. ప్రస్తుతం మహిళా శిశుసంక్షేమ శాఖ అంగన్‌వాడీల కోసం 40 వేల బెంచీలను కొనుగోలు చేయడానికి టెండర్‌లను పిలిచింది. ఈ నేపథ్యంలోనే టెండర్‌లో నాలుగు సంస్థలు పాల్గొన్నాయి. దీంతో ఆ కంపెనీలకు అర్హత లేదని, ఈ టెండర్‌లను ఆ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ఆపివేసినట్టుగా తెలిసింది.

దీంతో టెండర్‌ల ఆపివేత విషయమై కొందరు మంత్రి సీతక్క దృష్టికి తీసుకువచ్చారు. దీంతో ఈ విషయమై సంబంధిత ఐఏఎస్‌లను మంత్రి సీతక్క అడగ్గా వారు నిర్లక్షంగా సమాధానం ఇచ్చినట్టుగా తెలిసింది. దీంతోపాటు సిఎంఓ నుంచి వచ్చిన ఆదేశాల మేరకు తాను ఈ నిర్ణయం తీసుకున్నానని ప్రిన్సిపల్ సెక్రటరీ మంత్రి సీతక్కతో(Seethakka) పేర్కొన్నట్టుగా తెలిసింది. అయితే టెండర్‌ల ఆపివేత గురించి ఎందుకు తన దృష్టికి తీసుకురాలేదని, సిఎంఓ నుంచి ఫోన్ వచ్చినప్పుడు ఎందుకు తనకు చెప్పలేదని మంత్రి అడగ్గా ఆ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ నిర్లక్షంగా సమాధానం ఇచ్చినట్టుగా సమాచారం. తన శాఖలో తనకు తెలియకుండానే అధికారులు నిర్ణయాలు తీసుకోవడంపై మంత్రి సీతక్క ఐఏఎస్‌లపై ఆగ్రహం వ్యక్తం చేసినట్టుగా తెలిసింది.

ఇలా మంత్రికి తెలియకుండానే ఆ శాఖలో ఐఏఎస్‌లు ((IAS)) నిర్ణయాలు తీసుకుంటున్నారని, గతంలో కూడా ఇలాగే జరిగిందని ఆ శాఖలో పనిచేసే వారు పేర్కొంటుండడం విశేషం. త్వరలోనే ఈ విషయాన్ని సిఎం రేవంత్‌రెడ్డి దృష్టికి తీసుకెళ్లాలని మంత్రి సీతక్క(Seethakka) నిర్ణయించినట్టుగా సమాచారం. రాష్ట్రంలో సుమారుగా 35 వేల అంగన్‌వాడీలు ఉండగా 40 వేల బెంచీలను ఆయా అంగన్‌వాడీలకు పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నేపథ్యంలోనే మహిళా శిశు సంక్షేమ శాఖ ఈ టెండర్‌లను పిలిచింది. గతంలోనూ కోడిగుడ్ల టెండర్ విషయం కూడా వివాదస్పదం అయ్యింది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News