Monday, April 29, 2024

మార్కెట్లు భారీ జంప్

- Advertisement -
- Advertisement -

ముంబై : దేశీయ స్టాక్‌మార్కెట్లు సరికొత్త రికార్డులతో దూసుకెళ్తున్నాయి. గతవారం నాలుగు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు, జిడిపి గణాంకాలు, క్రూడ్ ఆయిల్ ధరల తగ్గుముఖం వంటి పలు అంశాలు మార్కెట్ లాభాలకు కారమయ్యాయి. మొత్తానికి గత వారం మార్కెట్లు భారీ జంప్ చేశాయి. గతవారం ఐదు సెషన్లలో బిఎస్‌ఇ సూచీ సెన్సెక్స్ 1,375 పాయింట్లు అంటే 2 శాతం పెరిగింది. సోమవారం 68,451 పాయింట్ల వద్ద ప్రారంభమైన సెన్సెక్స్, ఆఖరి రోజు శుక్రవారం 69,840 పాయింట్ల వద్ద ముగిసింది. శుక్రవారం కూడా దేశీయ స్టాక్‌మార్కెట్లు లాభాల జోరును కొనసాగించాయి. మార్కెట్ సూచీలు సరికొత్త ఆల్ టైమ్ హైని నమోదు చేశాయి. మార్కెట్ ముగిసే సమాయనికి సెన్సెక్స్ 303.91 పాయింట్లు పెరిగి 69,825.60 వద్ద ముగిసింది. నిఫ్టీ కూడా 68.25 పాయింట్లు పెరిగి 20,969.40 వద్ద స్థిరపడింది.

సెన్సెక్స్‌లోని 30 షేర్లలో 19 పెరగ్గా, 11 క్షీణించాయి. సెన్సెక్స్‌లో అత్యధికంగా లాభపడిన షేర్లలో హెచ్‌సిఎల్ టెక్, జెఎస్‌డబ్ల్యు స్టీల్ ఉన్నాయి. ఐటిసి, ఎంఅండ్‌ఎం, బజాజ్ ఫైనాన్స్, టాటా మోటార్స్ షేర్లు నష్టపోయాయి. డిసెంబర్ 3న నాలుగు రాష్ట్రాల ఎన్నికల ఫలితాల్లో బిజెపి విజయాలు మార్కెట్‌కు ఉత్సాహాన్ని ఇచ్చాయి. లోక్‌సభ ఎన్నికలకు ముందు రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్‌లలో బిజెపి గెలుపొందింది. దీంతో 2024 లోక్‌సభ పోరులో నరేంద్ర మోడీ ప్రభుత్వం కేంద్రంలో మూడోసారి సులభంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగలదని స్టాక్ మార్కెట్ వర్గాలు విశ్వాసం ఏర్పడింది. పెట్టుబడిదారులు, అభివృద్ధిని కోరుకునే ప్రజలకు స్థిరమైన ప్రభుత్వం, విదేశాల నుండి వచ్చిన వ్యక్తులతో మంచి వ్యాపారం చేయగల ప్రభుత్వం అవసరమవుతుంది. మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన మొదటి రెండుసార్లు మోడీ వ్యాపారం బాగా పుంజుకుంది.

మరోవైపు చైనా తర్వాత విదేశీ పెట్టుబడిదారులు భారతదేశం వైపు మొగ్గు చూపారు. ఇది మార్కెట్లకు సానుకూలంగా మారింది. సోమవారం నాటి మార్కెట్ సెన్సెక్స్ చారిత్రాత్మక గరిష్టాలకు చేరుకుంది. దీంతో పాటు అంతర్జాతీయంగా చూస్తే ఇంధనానికి డిమాండ్ పెరిగినప్పటికీ, ముడి చమురు ధర తగ్గింది. బ్రెంట్ క్రూడ్ 78.36 డాలర్లకు చేరుకుంది. చమురు ధరలు తగ్గడం స్టాక్ మార్కెట్‌పై ప్రభావం చూపింది. భారత్ 2030 సంవత్సరం నాటికి ప్రపంచంలోనే మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరిస్తుందని గ్లోబల్ రేటింగ్ ఏజెన్సీ ఎస్ అండ్ పి నివేదిక వెల్లడించింది. ఇటీవల 4 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మారాలనే లక్ష్యాన్ని సాధించగా, 5 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా భారత్ వేగంగా పయనిస్తోంది. 2030 నాటికి భారత్ ప్రపంచంలోనే మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించనుందని రేటింగ్ ఏజెన్సీ ఎస్ అండ్ పి అంచనా వేసింది.

2026-27 నాటికి భారత ఆర్థిక వృద్ధి రేటు 7 శాతానికి చేరుకుంటుందని పేర్కొంది. 2023-24 ఆర్థిక సంవత్సరంలో భారతదేశ జిడిపి 6.4 శాతంగా ఉండబోతోందని ఏజెన్సీ తన గ్లోబల్ క్రెడిట్ ఔట్‌లుక్ 2024 నివేదికలో వెల్లడించింది. గతేడాది జిడిపి 7.2 శాతం నమోదైంది. 2026-27 ఆర్థిక సంవత్సరంలో ఇది 7 శాతానికి చేరుకుంటుందని, 2030 నాటికి ప్రపంచంలో మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్ అవతరించేందుకు మార్గం సుగమం అవుతుందని ఏజెన్సీ అంచనా వేసింది. భారతదేశం ప్రపంచంలో ఐదవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఉంది. అమెరికా, చైనా, జర్మనీ, జపాన్ మాత్రమే ముందున్నాయి. అమెరికా జిడిపి 26.46 ట్రిలియన్ డాలర్లు, చైనా జిడిపి 19.37 ట్రిలియన్ డాలర్లుగా ఉంది. దీని తరువాత జర్మనీ, జపాన్ ఆర్థిక వ్యవస్థ వరుసగా 4.3 ట్రిలియన్ డాలర్లు, 4.4 ట్రిలియన్ డాలర్లుగా ఉంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News